ఫంక్షన్‌లో వడ్డానం చోరీ.. 21 రోజుల తర్వాత ఇంటికొచ్చిన కొరియర్.. తెరిచి చూడగా..
ABN , Publish Date - Mar 14 , 2026 | 09:42 AM
తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధి పండ్లూరు ఫంక్షన్ హాల్లో గత నెల 20న నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళ వడ్డానం చోరీకి గురైంది. అయితే 21 రోజుల తర్వాత షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
శుభకార్యాల సమయంలో ఎంత సందడిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొన్నిసార్లు ఈ సందడిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటుంటారు. పైకి హుందాగా కనిపిస్తూ కార్యక్రమాల్లోకి ఎంటర్ అవుతారు.. అంతా ఆదమరచి ఉన్న సమయంలో ఉండగా మెల్లగా నగలు, నగదు దోచుకుని ఉడాయిస్తారు. ఇలాంటి షాకింగ్ ఘటనలు ఇటీవల పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. ఈ తరహా చోరీ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఫంక్షన్ హాల్లో ఓ మహిళకు సంబంధించిన 14 సవర్ల బంగారు వడ్డానం చోరీకి గరైంది. అయితే 21 రోజుల తర్వాత షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తిరుపతి జిల్లా (Tirupati District) నాయుడుపేట మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండల పరిధి పండ్లూరులోని ఫంక్షన్ హాల్లో గత నెల 20న.. ఓజిలి మండలం పున్నేపల్లెకు చెందిన ఓ కుటుంబానికి సంబంధించిన నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రేణిగుంటకు చెందిన శిల్ప అనే మహిళ హాజరైంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆమె నిశ్చితార్థ కార్యక్రమ హడావుడిలో ఉండగా.. ఓ దొంగ ఆమెకు సంబంధించిన 14 సవర్ల వడ్డానాన్ని కొట్టేశాడు.
వడ్డానం కనిపించకపోవడంతో (Vaddanam theft) ఆమె కంగారుపడిపోయింది. ఫంక్షన్ హాల్లో ఎక్కడ వెతికినా కనిపించలేదు. దీంతో చివరకు చేసేదేమీలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు దర్యాప్తు చేపట్టారు. ఇలా చూస్తుండగానే 20 రోజులు గడిచిపోయాయి. వడ్డానంపై ఆశలు వదిలేసుకుంటున్న తరుణంలో ఉన్నట్టుండి ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. రేణిగుంటలో ఉన్న బాధితురాలి శిల్ప ఇంటికి ఓ కొరియర్ వచ్చింది.
ఏంటా అని కొరియర్ తెరిచి చూడగా.. అందులో (vaddanam in courier) వడ్డానం కనిపించింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక దక్కదు అనుకున్న తరుణంలో అనుకోని పరిస్థితుల్లో ఇలా వడ్డానం ఆ కుటుంబం మొత్తం ఆశ్చర్యానికి గురైంది. తెలిసిన వాళ్లే చోరీ చేసి ఉంటారని, పరువు పోతుందనే ఉద్దేశంతో మళ్లీ కొరియర్ చేసి ఉంటారని.. అంతా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వీరి తెలివి మామూలుగా లేదుగా.. రైల్వే ఏసీ కోచ్‌ను ఎలా మార్చారో చూడండి..
ఇలాంటి చోరీ ఎక్కడైరా చూశారా.. ఈ దొంగ నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..