మరవలేని మన ‘డిటెక్టివ్’...
ABN , Publish Date - Jun 21 , 2026 | 11:09 AM
ఓటీటీల్లో డిటెక్టివ్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్స్ హవా నడుస్తోంది. ఆయా కేసులను పరిష్కరించే హీరోలు ఈ తరానికి కొత్తగా కనిపిస్తున్నారు కానీ... యాభై అరవై ఏళ్ల క్రితం ఒక తరానికి డిటెక్టివ్ నవలలే సినిమా చూపించాయి.
ఓటీటీల్లో డిటెక్టివ్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్స్ హవా నడుస్తోంది. ఆయా కేసులను పరిష్కరించే హీరోలు ఈ తరానికి కొత్తగా కనిపిస్తున్నారు కానీ... యాభై అరవై ఏళ్ల క్రితం ఒక తరానికి డిటెక్టివ్ నవలలే సినిమా చూపించాయి. భగవాన్, యుగంధర్, షాడో వంటి డిటెక్టివ్ పాత్రలతో అనేక అపరాధ పరిశోధక నవలలు పాఠకులను ఉర్రూతలూగించాయి. అలనాటి డిటెక్టివ్ నవలలను ఈ తరానికి సినిమాలుగా, సిరీస్‌లుగా తెరకెక్కిస్తే ఆ కిక్కే వేరంటున్నారు వాటి అభిమానులు. తెలుగులో డిటెక్టివ్ నవలలు విజృంభించిన కాలం నాటికి ఒకసారి వెళ్లొద్దామా...!
భగవాన్.. యుగంధర్... షాడో... వీళ్ళందరూ ఒకప్పుడు వెరీ పాపులర్! పాత తరానికి కొన్ని దశాబ్దాల పాటు హాట్ ఫేవరెట్స్. కానీ ఇప్పుడు వీళ్ళంతా తెరమరుగైపోయారు. అపరాధ పరిశోధన అంటే... అప్పట్లో కుర్రకారుకి ఎంతో ఆసక్తి. ఈ పాకెట్ బుక్స్‌ని పాకెట్‌లో దాచుకుని మరీ చదివేవారు. ఇంతకీ ఏముంటుంది వాటిలో?
ఓ డబ్బున్న వారి ఇంట్లో మర్డరో, మానభంగమో జరుగుతుంది. దాని అంతు తేల్చడానికి ఓ డిటెక్టివ్ వస్తాడు. అతను చేేస రకరకాల సాహసకృత్యాలతో నవలంతా అనుక్షణం ఉత్కంఠకు లోను చేస్తూ ఉంటుంది. అదొక కొత్త ప్రపంచం అంతే. డిటెక్టివ్ నవలలనేవి ఎంతమందిలో రీడింగ్ హాబిట్ పెంచిందో. ఆ తర్వాత గొప్ప పాఠకులుగా మారిన వారంతా, ఈ డిటెక్టివ్ దగ్గరే టెస్ట్ డ్రైవింగ్ చేశారు.
డిటెక్టివ్‌ను ‘పత్తేదార్’ అంటారు. ఒక కేసుని డిటెక్ట్ చేయడమే అతని పని. కానీ ఆ పరిధి కూడా దాటిపోయి డిటెక్టివ్‌ను దేశాలు కూడా దాటించేశారు. నిజానికి వాళ్ళు ‘స్పై’లు. వాటిని ‘స్పై థ్రిల్లర్స్’ అంటారు. కానీ మనవాళ్ళు వాటిని కూడా ‘డిటెక్టివ్ సాహిత్యం’తో లింక్ చేేసశారు. క్రైౖమ్ సాహిత్యాన్ని కూడా ఇందులో కలగలిపేశారు. సినిమా అయినా... ఏ ఇతర కళ అయినా విదేశాల నుంచే దిగుమతి చేసుకోవడం, ఇన్‌స్పైర్ కావడం మనకు అలవాటే. అలానే డిటెక్టివ్ సాహిత్యం కూడా అక్కడ నుంచే ఇంపోర్ట్ అయ్యింది.
తెలుగులో తొలి డిటెక్టివ్ నవల!
తెలుగునాట అపరాధ పరిశోధనకు శ్రీకారం చుట్టిన రచయిత దేవరాజు వేంకట కృష్ణారావు. ఆయన 1912లో రాసిన ‘వాడే -వీడు’ ప్రప్రథమ తెలుగు డిటెక్టివ్ నవల. ఇదిలా ఉంటే ఆరుద్ర మాత్రం ‘చిత్రలేఖ’ అనే నవలను తొలి అపరాధ పరిశోధక నవలగా పేర్కొన్నారు. తెలుగు అకాడమీ ప్రచురించిన ‘సమగ్రాంధ్ర సాహిత్యం’ నాలుగవ సంపుటంలో అదే ఉంటుంది. చింతా దీక్షితులు, తమ దగ్గరి బంధువు చింతా భీమశంకరంతో కలిసి చింతా శంకర దీక్షితులు అనే కలం పేరుతో దీన్ని 1914లో ప్రచురించారు. ఇది ‘వాడే-వీడు’కు రెండేళ్ళ తర్వాతనే వచ్చింది. అయితే ‘వాడే - వీడు’ కథాంశాన్ని వేరే భాష నుంచి ఇన్‌స్పయిరై తీసుకున్నారనే వాదన ఉంది. కానీ, సరైన ఆధారాలు లేవు. అందుకే ‘వాడే - వీడు’నే మన తొలి తెలుగు డిటెక్టివ్ నవల అనుకోవాలి. లక్కీగా ఆ నవల ఇప్పటికీ దొరుకుతోంది. విజయవాడకు చెందిన క్లాసిక్ బుక్స్ ఆ మధ్య దీనిని పున: ప్రచురించింది.
అనంతపురం నుంచి 1874లో గడియారం రామాశాస్ర్తులు ‘పేటికాంతర శవము’ వెలువడిందని తెలుగు అకాడమీ ‘తెలుగు సాహిత్య కోశము’లో ఉంది. అయితే ‘పేటికాంతర శవము’ గ్రంథకర్త చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన పెరమల రామచౌదరి అని, అది 1927లో అచ్చయిందని, ప్రముఖ సాహితీవేత్త బందా లక్ష్మీ నరసింహారావు దీనిని గుర్తించి, ఆచూకీ తెలిపారని ఏల్చూరి మురళీధరరావు చెబుతున్నారు. ‘పేటికాంతర శవము’ పేరుతో గడియారం రామాశాస్ర్తులు వేరే అపరాధ పరిశోధక నవల రాసి ఉంటారేమోననే సందేహాన్ని ఆయన వ్యక్తపరిచారు. 1915 నుంచి రాజమండ్రి, పిఠాపురం, కపిలేశ్వరపురం కేంద్రాలుగా అపరాధ పరిశోధనా ఇతివృత్తంతో నవలలు పుంఖానుపుంఖాలుగా అచ్చయ్యాయి.
1923లో అబ్బూరి రామకృష్ణారావు ‘మంగళసూత్రము’ అనే అపరాధ పరిశోధన నవల రాశారు. దాని రెండోభాగం ‘దుర్గా ప్రసాద విజయము’. 1930కి మునుపే వి. సన్యాసయ్య నాయుడు, వాడ్రేవు మల్లపరాజు, జి. సుబ్రహ్మణ్య శర్మ, కేతవరపు రామకృష్ణ శాస్ర్తి, ములుగు వెంకట కృష్ణయ్య, కనకదండి సీతారామయ్య, అవసరాల శేషగీరిరావు, గాడేపల్లి సూర్యనారాయణశర్మ, అయ్యగారి నరసింహ మూర్తి, మన్నన రామారావు, జొన్నలగడ్డ వెంకట రాధాకృష్ణయ్య వంటివారు ఈ తరహా సాహిత్యాన్ని రాశారు. డిటెక్టివ్ సాహిత్యంలో ఇది తొలిదశగా చెప్పుకోవాలి. అప్పట్లో డిటెక్టివ్ నవలల్లో అధిక శాతం గ్రాంథిక భాషలోనే ఉండేవి.
‘భయంకరం’ గా రాసిన కొవ్వలి
ఒంటిచేత్తో వెయ్యికి పైగా నవలలు రాసిన రికార్డు కొవ్వలి లక్ష్మీ నరసింహారావుది. శ్రవణాసక్తి కలిగిన తెలుగు సమాజంలో పఠనాసక్తి కలిగించిన వాడు. కేవలం కొవ్వలి పుస్తకాలు చదవడం కోసమే కష్టపడి అక్షరాలు నేర్చుకున్న వాళ్ళూ ఉన్నారు. ఆయన కలాన్ని ఎటు తిప్పినా పద ప్రవాహమే. ఏదైనా రాయగలడు. అలాంటివాడు డిటెక్టివ్ సాహిత్యం రాయలేరా? భయంకరంగా రాసి పారేశారు. అవును... ‘భయంకర్’ పేరుతో 150కి పైగా డిటెక్టివ్ నవలలు రాశారు. సినిమాలకు పనిచేయడం కోసం ఏలూరు నుంచి మద్రాసు వెళ్ళిన కొవ్వలితో డిటెక్టివ్ సాహిత్యం రాయించింది ఎం.వి.ఎస్. పబ్లికేషన్స్ అధినేత మట్టా వెంకటేశ్వర్లు శెట్టి. ‘భయంకర్’ పేరుతో ఆయన రాసిన మొదటి నవల ‘చాటు మనిషి’. అది కాస్తా పాఠకులను ఉర్రూతలూగించడంతో ఇక అక్కడ నుంచి ఆయన నాన్‌స్టాప్ రైటింగ్. లైట్ రీడింగ్ మెటీరియల్‌తో డిటెక్టివ్ సాహిత్యాన్ని కొత్త మలుపు తిప్పారు.
పాకెట్ బుక్స్‌కు ఆద్యుడు
డిటెక్టివ్ సాహిత్యాన్ని పాపులరైజ్ చేసిన వ్యక్తి టెంపోరావ్. డిటెక్టివ్ వాలి ఆయన కథానాయకుడు. అలానే డిటెక్టివ్ పరశురామ్ సైతం ఆయన సృష్టించిన పాత్రే. ఆజన్మ బ్రహ్మచారి అయిన ఆయన దాదాపు 350 డిటెక్టివ్ పుస్తకాలు రాశారు. అందులో కొన్ని సినిమాలుగానూ వచ్చాయి. 1985లో తుది శ్వాస విడిచే వరకూ రచనలు చేస్తూనే ఉన్నారు. ఆయన అసలు పేరు కూరపాటి రామచంద్రరావు. డిటెక్టివ్ పుస్తకాలను పాకెట్ బుక్స్‌గా వేయాలనే ఆలోచన ఆయనదే. అప్పట్లో ఆ తరహాలో వచ్చిన ఆంగ్ల నవలలే టెంపోరావ్‌కు ఇన్‌స్పిరేషన్! అప్పట్లో టెంపోరావు రాసిన నవలలు యాభై, అరవై వేలకు పైగా కాపీలు ప్రింట్ అయ్యేవి.
కొమ్ములు తిరిగిన కొమ్మూరి
లక్షాధికారి హత్య, చావు కేక, అడుగో అతనే హంతకుడు, చీకటికి వెయ్యి కళ్ళు, పదును లేని కత్తి - గుళ్ళు లేని పిస్తోల్, తలుపు తెరిేస్త చస్తావ్... ఇవన్నీ కొమ్మూరి సాంబశివరావు రాసిన డిటెక్టివ్ నవలలు. అప్పట్లో ఆయన ఏది రాేస్త అదే ట్రెండు. ఒక డిటెక్టివ్ నవలను ఇంత చక్కటి భాషతో రాయొచ్చా అని అందరూ ఆశ్ఛర్యపోయేలా చేశారు. కొమ్మూరి మొత్తం 75 డిటెక్టివ్ నవలలు రాశారు. ‘నెం 888’ ఆయన రాసిన తొలి డిటెక్టివ్ నవల. ‘లక్షాధికారి హత్య’ నవలతో డిటెక్టివ్ యుగంధర్ , అసిస్టెంట్ రాజును క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఆ రెండు పాత్రలూ ఎవర్‌గ్రీన్. కొమ్మూరి రచనలు కొన్ని సినిమాలుగానూ వచ్చాయి. ‘నేను చావను‘ నవల ఆధారంగానే చిరంజీవి హీరోగా ‘నకిలీ మనిషి‘ సినిమా వచ్చింది. తాను తీయలేకపోయిన ‘గాలికొండపురం రైల్వే గేట్’ సినిమా స్ర్కిప్ట్‌కి కొమ్మూరి వర్క్ చేశారని ప్రముఖ దర్శకుడు, రచయిత వంశీ చెప్పారు.
గుమస్తా నుంచి డిటెక్టివ్ రచయితగా...
‘ప్రతిభా’ సంస్థలో పనిచేసి, అటుపై అక్కినేనితో ‘జయభేరి’ వంటి క్లాసిక్‌కి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ‘ప్రతిభా’ శాస్ర్తి సొంత తమ్ముడు తోపల్లి కృష్ణమోహన్. గుమస్తాగా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా, స్టూడియో లాబరేటరీ టెక్నీషియన్‌గా ఇలా రకరకాల వృత్తుల్లో పనిచేశారాయన. ‘నారీ హంతకులు’ ఆయన తొలి డిటెక్టివ్ నవల. అది కాస్తా సూపర్ హిట్. ‘రాజద్రోహి‘ సీరియల్ కూడా సక్సెస్. అలా 143 వరకూ సాంఘిక, జానపద, అపరాధ పరిశోధన నవలలు రాశారు. టెంపోరావ్, కొమ్మూరి తర్వాత ఒక దశలో లీడింగ్ రచయితగా వెలుగొందారు.
మహామహులే రాశారు!
డిటెక్టివ్ సాహిత్యాన్ని చాలామంది చిన్నచూపు చూశారు కానీ, పెద్ద పెద్ద రచయితలు డైరెక్ట్‌గానో ఇన్ డైరెక్ట్‌గానో ఈ జానర్లో రచనలు చేశారు. ప్రసిద్ధ వేంకట పార్వతీశం కవులు, బెంగాలీ రచయిత పాంచకడీ దేవ్ డిటెక్టివ్ నవలల్ని తెలుగులోకి అనువాదం చేసి ముద్రించేవారు. చింతా దీక్షితులు, మునిమాణిక్యం నరసింహారావు, జంపన చంద్రశేఖరరావు, రావూరి భరద్వాజ, కొంగర జగ్గయ్య తదితరులు డిటెక్టివ్ నవలలు రాశారు. శ్రీశ్రీ తన పద్నాలుగో యేట అంటే 1924లో ‘పరిణయ రహస్యము’ పేరుతో పది ప్రకరణాల డిటెక్టివ్ నవలిక రాశారు. ఆరుద్ర కూడా డిటెక్టివ్ రచనల్లో తన మార్కు చూపించారు. ఆయన నవలల్లో మంచి వర్ణనలు ఉండేవి. ‘పలకల వెండి గ్లాసు’, ‘దెయ్యాల కొంప’, ‘ఆనకట్ట మీద హత్య’, ‘అహింసా రౌడీ’, ‘త్రిశూలం’, ‘కొండ చిలువ’, ‘అణాకో బేడ స్టాంపు’ - నవలలు రాశారాయన. ‘ఎర్రని ఆకు పచ్చని సైకిల్’ వంటి ఎనిమిది డిటెక్టివ్ కథలు కూడా రాశారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కూడా ‘దిండు కింద పోకచెక్క’ అనే డిటెక్టివ్ నవల రాసినవారే. పాలగుమ్మి పద్మరాజు ‘చచ్చి సాధించేడు’ అనే అపరాధ పరిశోధక నవల రాశారు.
చాలామంది స్టార్ రైటర్స్
ఓ ప్రక్రియ హిట్టయితే, రచయితలు పుట్టకుండా ఎలా ఉంటారు? అలానే ఆ సమయంలో చాలామంది పుట్టుకొచ్చారు. విశ్వప్రసాద్, జీవీజీ, కనకమేడల వెంకటేశ్వరావు, వీయస్ చెన్నూరి, వై.వి. రావ్, శీతంరాజు, వి.యస్. రావ్, వక్కంతం సూర్యనారాయణ, కె.వి.యస్.ఎన్. మూర్తి, బొమ్మిడి అచ్చారావు, సుంకరి రాంప్రసాద్, వాణిశ్రీ, భీమవరపు పురుషోత్తం, గొట్టిపాటి నాగేశ్వరరావు, జీవీ అమరేశ్వరరావు, సూర్యదేవర రామ్‌మోహన్‌రావు, కొప్పిశెట్టి, పానుగంటి, ఎన్.ఎస్. నాగిరెడ్డి... వీళ్ళంతా అప్పట్లో స్టార్ డిటెక్టివ్ రైటర్స్. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. వీళ్ళ మధ్య విపరీతమైన పోటీ ఉండేది. ఎవరి పుస్తకం ఎక్కువ పోతోందో తెలుసుకోవడానికి పబ్లిషర్స్ సర్వేలు కూడా చేస్తుండేవారు. విశ్వప్రసాద్ ఎంత గొప్ప డిటెక్టివ్ రచయితో, అంత గొప్ప పబ్లిషర్. ఆయన క్రియేట్ చేసిన డిటెక్టివ్ భగవాన్ చాలామందికి హాట్ ఫేవరెట్. ‘మాయలాడి, జోకర్, రాజా రాణి, జానీ వాకర్’ లాంటివి ఆయన రాసిన పాపులర్ డిటెక్టివ్ నవలలు. 1951లో ‘ఇదేనా లోకం’ నాటికతో ఆయన రచనా ప్రస్థానం మొదలైంది. మద్రాసుకు మకాం మార్చిన తర్వాత 1959లో ‘భగవాన్ పబ్లికేషన్స్’ స్థాపించి తాను రాసిన డిటెక్టివ్ నవలలతో పాటు ప్రముఖుల రచనలను ప్రచురించారు. ‘జగత్ కిలాడీలు’తో పాటు పలు చిత్రాలకు ఆయన పనిచేశారు.
డిటెక్టివ్ రచనే ఆయన వృత్తి...
సంతకం తప్ప అస్సలు ఇంగ్లీష్ రాని గిరిజశ్రీ భగవాన్, ఇంగ్లీష్ నవలల స్థాయిలో డిటెక్టివ్ పుస్తకాలు రాశారు. ఆయన నవలలు అన్నీ సినిమాటిక్ యాక్షన్ తో ఉండేవి. 1963 - 1987 మధ్యకాలంలో 900కి పైగా డిటెక్టివ్ నవలలు రాశారు. ‘ఎర్రపెట్టెలో ఏముంది?’ ఆయన రాసిన తొలి డిటెక్టివ్ రచన. ఆయన డిటెక్టివ్ పేరు నర్సన్, అతని అసిస్టెంట్ కృపాల్. ఎక్కడా ఉద్యోగంలో చేరకుండా డిటెక్టివ్ రచననే తన వృత్తిగా స్వీకరించారు. ‘గూండా, రుస్తుం, కలెక్టర్ విజయ‘ తదితర చిత్రాలకు కథలు సమకూర్చారు. ఆయన అసలు పేరు తాండకి వెంకట లక్ష్మీ నరసింహారావు. తన భార్య గిరిజ పేరును కలం పేరుగా తీసుకున్నారు. ఆయన పాతికేళ్ళ క్రితం ఆధ్యాత్మిక రచనల వైపు మళ్ళారు.
చివరి డిటెక్టివ్ స్టార్ రైటర్
నిన్న మొన్నటి వరకూ మధుబాబు అంటే ఎవరికీ తెలియదు. ఎక్కడో హనుమాన్ జంక్షన్‌లో టీచర్‌గా ఉద్యోగం చేస్తూ తానెవరో తెలియకుండా పుంఖానుపుంఖాలుగా డిటెక్టివ్ నవలలు రాశారు. ఆయన సృష్టించిన ‘షాడో’ అయితే... తెలుగు డిటెక్టివ్ చరిత్రలో ఓ సూపర్‌స్టార్. నిజం చెప్పాలంటే అప్పటివరకూ డిటెక్టివ్ నవలల పంథా వేరు. మధుబాబు దానిని మరో లెవల్‌కు తీసుకెళ్ళారు. ఆయనవి డిటెక్టివ్ నవలలు అనేకంటే స్పై థ్రిల్లర్స్ అనాలి. ఇప్పుడు ‘ధురంధర్’ 1, 2 సినిమాలు చూసి ఆహా ఓహో అంటున్నాం. మధుబాబు అప్పుడెప్పుడో తన షాడోను కరాచీకి పంపారు. షాడోను వెండితెరపైకి, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకెళ్ళాలని కొందరు నిర్మాతలు ప్రయత్నించారు. అదెప్పుడు కార్యరూపం దాల్చుతుందో చూడాలి. ఆయన తన తొలి డిటెక్టివ్ నవల ‘వాంటెడ్ డెడ్ ఆర్ ఎలైవ్‘ను కేవలం మూడు రోజుల్లో రాేసశారు. దానికి ఆయన అందుకున్న పారితోషికం యాభై రూపాయలు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయన కలం పరుగులు పెడుతూనే ఉంది. అడవి బాపిరాజు ‘గోన గన్నారెడ్డి’ నవల స్ఫూర్తితో ‘షాడో’ పేరును మధుబాబు క్రియేట్ చేశారు. 175కు పైగా డిటెక్టివ్ నవలలు రాసిన మధుబాబు, చిట్టచివరి స్టార్ డిటెక్టివ్ రైటర్ అని చెప్పాలి.
ఆ ఘనత ఆయనదే...
ఏ పాపులర్ డిటెక్టివ్ రచయిత పేరు తీసుకున్నా, వారి కెరీర్‌ని కచ్చితంగా మలుపు తిప్పింది మాత్రం ఎం.వి.యస్. పబ్లికేషన్సే. దీని ఓనర్ మట్టా వెంకటేశ్వర్లు శెట్టి. డిటెక్టివ్ రచనా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 1970 - 71లో మద్రాసులోని కోడంబాకం ఏరియాలో నాలుగు అంతస్తుల బిల్డింగ్‌లో ఈయన ఆఫీస్ పెట్టారు. అందులోనే ప్రెస్ కూడా ఉండేది. విశ్వప్రసాద్, విజయబాపినీడు, సత్యానంద్, కృష్ణమోహన్, మధుబాబులతో తొలిసారిగా డిటెక్టివ్ నవలలు రాయించిన ఘనత ఆయనదే. అలానే అప్పట్లో ప్రముఖ రచయిత ధనికొండ హనుమంతరావు ‘క్రాంతి ప్రెస్’లో చాలా డిటెక్టివ్ నవలలు అచ్చు అయ్యేవి. అక్కడ అచ్చుతప్పులు ఉండవని చాలా గొప్పగా చెప్పేవాళ్ళు.
డిటెక్టివ్ పత్రికలు...
డిటెక్టివ్ నవలలు విరివిగా వస్తున్న సమయంలోనే ప్రత్యేకంగా అపరాధ పరిశోధన మీద కొన్ని పత్రికలూ వచ్చాయి. టెంపోరావ్ ‘టెంపో‘ ఆంగ్ల పత్రికతో పాటు, వై.వి. రావుతో కలిసి ‘డిటెక్టివ్‘ మాసపత్రిక తీసుకొచ్చారు. హైదరాబాద్‌కు చెందిన శ్యామ దామోదర్ రెడ్డి ‘అపరాధ పరిశోధన’ (అపన) పేరుతో 1965లో ఓ మాసపత్రికను ప్రారంభించారు. ప్రధాన పత్రికలో డిటెక్టివ్ కథలు వేేస్త, అనుబంధంలో మూడు నవలలను అందించేవారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి, ఎం.వి.వి. సత్యనారాయణ, పి. చంద్రశేఖర్ ఆజాద్, ప్రతాప రవిశంకర్, వి.ఎస్.రావు, ముద్దా సురేశ్, బొమ్మిడి అచ్చారావు, తిరుమలశ్రీ, రంకిరెడ్డి రాము, అజీజ్, కురుమద్దాలి విజయలక్ష్మి, సామవేదుల, గీతారాణి, విద్వాన్, షీలాదేవి, సికిందర్ తదితరులకు ‘అపన’ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇది 1988లో ఆగిపోయింది. ‘రివాల్వర్’, ‘పత్తేదారు’, ‘మేధావి’, ‘క్రైమ్’ వంటి పేర్లతో కూడా డిటెక్టివ్ పత్రికలు వచ్చాయి.
అణా లైబ్రరీలతో జీవనోపాధి
1960-70- 80-90లలో అంటే సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఏ బడ్డీ కొట్టు చూసినా డిటెక్టివ్ నవలలు, చెట్టు మీద వాలిన పక్షుల్లా వేలాడుతూ ఉండేవి. డిటెక్టివ్ నవల అంటే అప్పట్లో చాలా చిన్న చూపే కానీ, దానికంటూ ఓ ప్రత్యేక క్రేజ్ ఉంది. ఓ సెపరేట్ సామ్రాజ్యమే ఉంది. ఈ డిటెక్టివ్ నవలల పేరు చెప్పి ఎంతోమంది పబ్లిషర్లు ఇల్లు, పొలాలు కొనుక్కున్నారు! ఎంతోమంది రచయితలు తమ ఆదాయం పెంచుకున్నారు! ఎంతోమంది కుర్రకారు పాఠకులుగా పరివర్తన చెందారు! ఈ నవలల్ని అద్దెకిచ్చే లైబ్రరీలను ‘అణా లైబ్రరీలు’ అని పిలిచేవారు. అప్పట్లో రోజుకి పుస్తకం అద్దె అణా. ఇలాంటివి ప్రతి ఊళ్ళోనూ ఉండేవి. ఈ అణా లైబ్రరీల వల్ల ఎన్ని కుటుంబాలు బతికాయో!
రీప్రింట్‌తో జోష్
తెలుగు రాష్ర్టాలలో ప్రతీ ఏటా బుక్ ఎగ్జిబిషన్స్ బాగానే జరుగుతున్నాయి. దాంతో పాపులర్ రచనలే కాకుండా అప్పటి డిటెక్టివ్ పుస్తకాలను రీ-ప్రింట్ చేస్తున్నారు. 1917లో కర్నూలులో ప్రచురితమైన ‘చతురిక’ అనే తెలుగు నవల ఇటీవల తిరిగి వెలుగులోకి వచ్చింది. ఇది షెర్లాక్‌హోమ్స్‌కు ప్రభావితమైన గూఢచారి కథనంగా నిలుస్తుంది. ఈ నవల రాసింది ఉయ్యాలవాడ రామచంద్రరావు. కొవ్వలి, టెంపోరావ్, కొమ్మూరి, మధుబాబు సాహిత్యం ఈ తరానికి కూడా అందుబాటులోకి వచ్చింది. కొమ్మూరి సాంబశివరావు 80 డిటెక్టివ్ నవలలను 2013లో రీప్రింట్ చేసింది ‘సాహితీ ప్రచురణలు’ సంస్థ. విజయవాడకు చెందిన ఈ సంస్థ అధినేత లక్ష్మీ మాట్లాడుతూ, ‘డిటెక్టివ్ నవలలు ఎవర్ గ్రీన్.
ఈ రోజుకీ కొమ్మూరి, మధుబాబు నవలలు ప్రతీ రోజూ ఒక్కటైనా ఆన్‌లైన్‌లో అమ్మకాలు జరుగుతుంటాయి‘ అన్నారు. విజయవాడకు చెందిన క్లాసిక్స్ బుక్స్ అధినేత రాము కొన్నేళ్ళుగా కొవ్వలి, టెంపోరావ్, విశ్వప్రసాద్ తదితరుల ఎంపిక చేసిన డిటెక్టివ్ పుస్తకాలను పబ్లిష్ చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ‘నవోదయ బుక్‌హౌస్’ నిర్వాహకుల్లో ఒకరైన కోటేశ్వరరావు, ‘డిటెక్టివ్‌లకు ఇప్పటికీ డిమాండ్ ఉంది. హిట్టూ కాదు ఫ్లాపూ కాదు... యావరేజ్‌గా పోతూనే ఉంటాయి’ అన్నారు. తెలుగు సాహిత్యాన్నంతా డిజిటలైజ్ చేేస యజ్ఞం చేపట్టిన ‘మనసు ఫౌండేషన్’ మన్నం రాయుడు - ఈ డిటెక్టివ్ నవలల్ని చిన్నచూపు చూడటం లేదు. తెలుగులో వచ్చిన డిటెక్టివ్ నవలలన్నింటినీ డిజిటలైజ్ చేేస ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 600 వరకూ డిటెక్టివ్ నవలలు ేసకరించగలిగారు. పది పీహెచ్‌డీలు చేేసంత చరిత్ర డిటెక్టివ్ సాహిత్యానికి ఉందంటారాయన.
ఓటీటీలకు పనికొస్తాయి...
సినిమా, ఓటీటీల్లో ఇప్పుడంతా క్రైమ్ ఇన్వెస్టిగేషన్లమయం. దాంతో రచయితలూ, దర్శకులూ ఆ జానర్ కోసం జల్లెడ పడుతున్నారు. విదేశీ వెబ్ సిరీస్‌లు చూస్తూ ఇన్‌స్పయిర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, మన దగ్గర బోలెడంత నిధి ఉంది. ఆ నిధి పేరు - ‘డిటెక్టివ్ నవలలు’! కొంచెం ఓపిక, తీరిక ఉంటే, ఇవే పెద్ద రిసోర్సుల్లా ఉపయోగపడతాయి. ‘ధురంధర్’ సినిమా కాన్సెప్ట్‌తో మధుబాబు ఎప్పుడో ‘షాడో’ నవల రాశారని చెప్పాం కదా. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో! ఏ పుస్తకంలో ఏ పాయింటుందో! మనింట్లో ‘లాకర్’ పెట్టుకుని బయట లోన్ తీసుకోవడం దేనికి!? కాపీ అని కాదు... ఇన్‌స్పిరేషన్... అంతే! ఆ విధంగానే మన ‘డిటెక్టివ్’లకు పూర్వ వైభవం వస్తే అంతే చాలు!
పులగం చిన్నారాయణ, వడ్డి ఓం ప్రకాశ్ 88977 98080
‘1971లో నేను ఉద్యోగం వెతుక్కుంటూ మద్రాసు చేరాను. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఎంవీయస్ పబ్లికేషన్స్ ఎడిటర్ కృష్ణమోహన్, భానోదయ పబ్లికేషన్స్ అధినేత డాక్టర్ మల్లికార్జునరావుతో పరిచయం ఏర్పడింది. వారి కోరిక మేరకు డిటెక్టివ్ నవలలు కొన్ని రాశాను. ఆ తర్వాత కొంతకాలానికి సినిమా రచయితగా అవకాశాలు రావడంతో డిటెక్టివ్ నవలలు రాయలేదు. ఇటీవల విడుదల చేసిన నా కథా సంపుటి ‘వెన్నెల్లో చీకటి రహస్యం’లో నేను రాసిన ఓ డిటెక్టివ్ నవలను పొందుపరిచాను.’’
సత్యానంద్, సినీ రచయిత
‘‘నేనందరికీ సినిమా పాటల రచయితగానే తెలుసు కానీ, నేను కూడా ఆరు డిటెక్టివ్ నవలలు రాశాను. సినిమా ప్రయత్నాల్లో ఉన్నప్పుడే విజయలక్ష్మీ పబ్లికేషన్స్‌వారు నన్నో డిటెక్టివ్ నవల రాయమని అడిగారు. అందులో ‘బ్లూ బుల్స్’ ఒకటి. ‘మిస్టర్ మిసైల్’, ‘వెపన్స్ గేలరీ’ అనేవి గుర్తున్నాయి. నా డిటెక్టివ్ పేరు ‘స్టిక్కర్’. సాయంత్రం 6 గంటలకు మొదలుపెడితే ఉదయం 7 గంటలకు ఒక నవల పూర్తి చేసేవాణ్ణి. వంద పుస్తకాలకు కాంట్రాక్ట్ ఇస్తామన్నారు. అప్పటికే నేను పాటలు రచయితగా సక్సెస్ కావడంతో వాటి జోలికి పోలేదు’’
భువన చంద్ర, గీత రచయిత
‘‘కొమ్మూరి సాంబశివరావుగారి డిటెక్టివ్ నవలలు చదివాక నాకు కూడా డిటెక్టివ్ రచనలు చేయాలనిపించింది. ‘అపరాధ పరిశోధన’ మాసపత్రికలో 25 వరకూ డిటెక్టివ్ కథలు రాశాను. నేను సృష్టించిన స్పెషల్ డిటెక్టివ్ పేరు ‘పృథ్వీరాజ్’. ‘పోలీస్ రిపోర్ట్’ అనే మాసపత్రికలో ‘క్లూ’ పేరుతో ఓ డిటెక్టివ్ శీర్షిక నిర్వహించాను. ‘ఆంధ్రజ్యోతి’ డైలీలో కూడా పదేళ్ళ చిన్నపిల్ల డిటెక్టివ్ గా పాఠకులు పరిష్కరించే శీర్షిక నడిపాను. ‘స్రవంతి’ వారపత్రికలో ‘కొమ్మూరి’ వారి పాత నవలల్ని సీరియలైజ్ చేశాను. డిటెక్టివ్ పుస్తకాలు చదివే అలవాటు పోయుండొచ్చు కానీ, క్రైమ్ సాహిత్యం వెనకబడలేదన్నది నా అనుభవం.’’
మల్లాది వెంకట కృష్ణమూర్తి, నవలా రచయిత
‘’నా పదిహేనేళ్ళ వయసులో ‘వానర్ దేవ్’ పేరుతో మెదడు మార్పిడి కథాంశంతో తొలిసారి ఓ డిటెక్టివ్ నవల రాశాను. ‘వానర దేవ్’లో కారు లోపల్నించి స్లైడ్ ప్రొజెక్టర్ ఫోకస్ చేసి నంబరు ప్లేట్ మీద అంకెలు మార్చే సన్నివేశమొకటి కేవలం నా ఊహలోంచి పుట్టింది. ఇటీవల జరిగిన ఓ నేరంలో - నేరస్థుడు అదే టెక్నిక్ వాడినట్లు విని ఆశ్చర్యపోయాను. ‘అపన’లో వచ్చిన నవలలన్నీ పుస్తకాలుగా వచ్చాయి. డిటెక్టివ్ సాహిత్యం అంతరించిపోలేదు. ఏదో రూపంలో ఇప్పటికీ పాఠకుల్ని అలరిస్తూనే ఉంది.’’
వసుంధర, జంట రచయితలు
‘’1973 లో నా తొలి డిటెక్టివ్ నవల అచ్చయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ రచనలు చేస్తూనే ఉన్నాను. ఆరు నెలల క్రితమే ‘గోల్డెన్ షాడో’ పుస్తకం రాశాను. షాడో కథానాయకుడిగా 180 పుస్తకాల వరకూ వచ్చాయి. షాడో సిరీస్‌ను సినిమాలుగా, వెబ్ సిరీస్‌గా తీస్తామని చాలామంది నిర్మాతలు నా దగ్గరకు వచ్చారు. అయితే షాడోకు ఓ ముఖాన్ని ఇవ్వడం అంత సులువు కాదని నా అభిప్రాయం. షాడోను పుస్తకాల్లో చదివి ఆనందించడమే సరైన పద్ధతి అని నాకు అనిపిస్తుంది.’’
మధుబాబు, డిటెక్టివ్ షాడో సృష్టికర్త
భయంకర్ అంటే కొవ్వలి! ఆయన సహస్రాధిక నవలల రచయిత. అయితే శ్రీభయంకర్ పేరుతో డిటెక్టివ్ నవలలు రాసిన వ్యక్తి గురించి చాలామందికి తెలియదు. ఆ పేరుతో వందల డిటెక్టివ్ పుస్తకాలు రాసిన వ్యక్తి యర్నాగుల సుధాకరరావు! ఆయన వయసు 72 ఏళ్లు. 1971లో రచనలు చేేస తొలినాళ్ళలో బి.బి.యస్., బీఎంకే పబ్లికేషన్స్ సంస్థల వాళ్ళు తన సొంత పేరును తీేససి, శ్రీభయంకర్ పేరుతో నవలలను ప్రచురించారని, ఆ తర్వాత అదే పేరుతో డిటెక్టివ్ నవలలు రాశానని ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
జర్నలిజంలో మీ ప్రస్థానం ఎందరికో ఆదర్శం
Read Latest AP News And Telangana News And International News And Telugu News