Share News

యోగా సౌరభం!

ABN , Publish Date - Jun 21 , 2026 | 09:39 AM

ఉదయం 6.30 నిమిషాలు... వయసుతో నిమిత్తం లేకుండా ప్రతీరోజూ సుమారు ఆరు లక్షల మంది అతని యోగా పాఠాల కోసం ఎదురుచూస్తుంటారు.

యోగా సౌరభం!
International Yoga Day

ఉదయం 6.30 నిమిషాలు... వయసుతో నిమిత్తం లేకుండా ప్రతీరోజూ సుమారు ఆరు లక్షల మంది అతని యోగా పాఠాల కోసం ఎదురుచూస్తుంటారు. అది కూడా ఆన్‌లైన్‌లోనేనండోయ్‌! ‘హ్యాబిల్డ్‌’ పేరుతో యోగా కమ్యూనిటీని మొదలుపెట్టి... ఎనిమిది ప్రపంచ రికార్డులను సొంతం చేసుకొని... ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా మరో రికార్డు కోసం ఎదురుచూస్తున్నాడు సౌరభ్‌ బోత్రా...

యోగా మాస్టర్‌ సౌరభ్‌ సొంతూరు మహారాష్ట్రలోని ధనాజ్‌ గ్రామం. ఇంజినీరింగ్‌ చేశాడు. సాధారణంగా ఏ తల్లిదండ్రులకైనా కొడుకు ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఐదంకెల జీతంతో ఏదో ఒక కొలువు చేయాలను కుంటారు. లేదా తమ కుటుంబ వ్యాపారం చూసుకోవాలనుకుంటారు. సౌరభ్‌ చదువు పూర్తయ్యాక కుటుంబ వ్యాపారం చూసుకోవడం ప్రారంభించాడు. ఆ సమయంలో తల్లి మోకాళ్ల నొప్పులతో బాధపడడం చూశాడు. చిన్నతనం నుంచే యోగ సాధన తెలియడంతో ఆమెకు సులువైన ఆసనాలను నేర్పించి, నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా చేశాడు. దాంతో అతనికి ఒక ఆలోచన వచ్చింది. తనకు తెలిసిన యోగాతో వంద మందిని ఆరోగ్యంగా చూడాలనే ఆశతో ముందుకు సాగాలనుకున్నాడు. తండ్రికి తాను వ్యాపారాన్ని చూసుకోలేనని చెప్పాడు. స్థిర నిర్ణయంతో వెళ్లి మెడిటేషన్‌ గ్రూప్‌లో వలంటీర్‌గా చేరాడు. ఏడాది పాటు దేశంలోని చాలా చోట్ల యోగా సాధన చేయించడం మొదలు పెట్టాడు.


book4.2.jpgముగ్గురితో మొదలై...

సౌరభ్‌ యోగా నేర్పించడంతో పాటు... ప్రజల శాశ్వత అలవాట్లను మార్చే లక్ష్యంగా ఏదైనా ప్రారంభించాలను కున్నాడు. అలా ‘హ్యాబిల్డ్‌’ కమ్యూనిటీ పుట్టింది. కొవిడ్‌ సమయంలో ఉచిత ఆన్‌లైన్‌ సెషన్‌తో ఇది మొదలైంది. మొదటి సెషన్‌లో ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు. కొన్ని రోజులకు ఉచితంగా చెబితే ఎవరూ పట్టించు కోవడం లేదని నెలకు వంద రూపాయలు వసూలు చేయడం ప్రారంభించాడు. మెల్లగా ముగ్గురి నుంచి ఆ సంఖ్య వందకి చేరింది. అప్పుడే తన ఆలోచనను చెల్లెలు త్రిషాలతో పంచుకున్నాడు. ఆమె అప్పటికే లండన్‌లో ఉద్యోగం చేస్తోంది. దాన్ని వదులుకొని అన్నకు అండగా నిలబడింది. అనతికాలంలోనే వాళ్లు ఊహించని విధంగా సెషన్‌లో లక్షమంది చేరారు. ఇక అప్పటి నుంచి ‘హ్యాబిల్డ్‌’ మరింత కొత్తగా ఆలోచనలను మొదలెట్టింది.


book4.3.jpg169 దేశాలు... కోట్ల మంది...

హ్యాబిల్డ్‌ కమ్యూనిటీ ప్రతీ సోమవారం కొత్తవారి కోసం 14రోజుల ఉచిత చాలెంజ్‌, ఏడాదికి రెండుసార్లు 21 రోజుల ఉచిత చాలెంజ్‌ ప్రోగ్రామ్స్‌ ప్రవేశపెట్టింది. ఉదయం మూడు సెషన్స్‌, సాయంత్రం మూడు సెషన్స్‌ తీసుకుంటారు. యోగా ప్రేమికులు నచ్చిన సమయంలో ఎప్పుడైనా చాలెంజ్‌కు అటెండ్‌ అవ్వొచ్చు. ఈ చాలెంజ్‌ తర్వాత కొనసాగాలంటే మాత్రం నాలుగువేల రూపాయల వార్షిక రుసుముతో యోగా సెషన్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. సౌరభ్‌ సోషల్‌ మీడియా ద్వారా కూడా యోగాతో లాభాలు, చిన్న చిన్న టిప్స్‌ చెబుతుంటాడు. ఈ ఐదేళ్లలో ఏ సెషన్‌ కూడా సౌరభ్‌ మిస్సవ్వలేదు. తాను మొదలుపెట్టిన యోగాను తన శిష్యులు కొనసాగించేలా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ‘హ్యాబిల్డ్‌’లో సౌరభ్‌తో పాటు మరో 300 మంది యోగా గురువులున్నారు. ఈ కమ్యూనిటీ ద్వారా ప్రస్తుతం 169 దేశాల నుంచి 12.6 మిలియన్ల మంది యోగా శిక్షణ తీసుకున్నారంటే అతడికున్న క్రేజ్‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.


వరుస గిన్నిస్‌ రికార్డులు...

కేవలం యోగా నేర్పించడమేగాక, సౌరభ్‌ యోగాలో అనేక రికార్డులు కూడా సృష్టించాడు. 2023లో ఇంటర్నేషనల్‌ యోగాడే సందర్భంగా మొదటి రికార్డును సాధించాడు సౌరభ్‌. అప్పటి ఆన్‌లైన్‌ సెషన్‌లో 1 లక్షా 34 వేల 057మంది పాల్గొనడం ఓ రికార్డు. 2024లో యూట్యూబ్‌లో యోగా లైవ్‌ స్ట్రీమ్‌ను 2 లక్షల 46 వేల 252 మంది చూశారు. అందుకు మరో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సొంతమైంది. అదే ఏడాది ఒక్కరోజు 5లక్షల మందికి పైగా యోగా సెషన్‌, 2లక్షల మందికి పైగా మెడిటేషన్‌ క్లాస్‌లకు హాజర య్యారు. గత ఏడాది 169 దేశాల నుంచి సుమారు 7లక్షల మందికి పైగా లైవ్‌ యోగా సెషన్‌లో పాల్గొని మరో రికార్డు సృష్టించారు. ఈ ఏడాది జనవరిలో 9 లక్షల 39 వేల 41 మంది యోగా లైవ్‌ స్ట్రీమ్‌తో మరొక రికార్డు తిరగరాశారు. ‘హ్యాబిల్డ్‌’ యోగాలో ఇప్పటికే 8 రికార్డులు సొంతం చేసుకుంది. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మరో రికార్డు కోసం ప్రయత్నం జరుగుతోంది. ఏదేమైనా యోగా అంటే సౌరభ్‌ పేరు గుర్తుకురావాల్సిందే ఎవరికైనా.


ఈ వార్తలు కూడా చదవండి:

జర్నలిజంలో మీ ప్రస్థానం ఎందరికో ఆదర్శం

కౌలు రైతులకు అరకొరగానే రుణాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 21 , 2026 | 09:39 AM