కౌలు రైతులకు అరకొరగానే రుణాలు
ABN , Publish Date - Jun 21 , 2026 | 06:27 AM
రాష్ట్రంలో కౌలు రైతులకు పంట రుణాలివ్వడంలో వాణిజ్య బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వాధినేతల విజ్ఞప్తి మేరకు బ్యాంకర్లు కంటి తుడుపుగా రుణ వితరణ చేస్తున్నారు.
లక్ష్యంలో సగం కూడా ఇవ్వని బ్యాంకర్లు
ప్రభుత్వ ఆదేశాలనూ పట్టించుకోని వైనం
అమరావతి, జూన్ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కౌలు రైతులకు పంట రుణాలివ్వడంలో వాణిజ్య బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వాధినేతల విజ్ఞప్తి మేరకు బ్యాంకర్లు కంటి తుడుపుగా రుణ వితరణ చేస్తున్నారు. రాష్ట్రంలో 2023 నుంచి 2026 మార్చి వరకు కౌలు రైతులకు నిర్ధేశించిన రుణ లక్ష్యంలో సగం కూడా రుణాలివ్వని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో నామమాత్రంగానే రుణాలిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024-25 కన్నా.. 2025-26లో కొంత ఆశాజనకంగా బ్యాంకర్లు స్పందించారు. గత నాలుగేళ్లలో పంట సాగుదారు హక్కు పత్రం(సీసీఆర్సీ) ఉన్న కౌలు రైతులకు వివిధ జాతీయ బ్యాంకులు ఇచ్చిన రుణ గణాంకాలను పరిశీలిస్తే.. 2025-26లో మాత్రమే రుణ లక్ష్యంలో సగానికి పైగా పంపిణీ చేశారు. 2023 మార్చికి 2,58,310 ఖాతాలకు రూ.2,191.3కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని, కేవలం 69,832 ఖాతాలకు రూ.905.8కోట్లు మాత్రమే ఇచ్చారు. 2024మార్చికి 2,58,310 ఖాతాలకు రూ.2,191.3 కోట్లు ఇవ్వాలన్న లక్ష్యంలో కేవలం 37,243ఖాతాలకు రూ.323.7కోట్లు మాత్రమే ఇచ్చారు. 2025 మార్చికి 2,58,310 ఖాతాలకు రూ.2,100కోట్ల పంపిణీ లక్ష్యంలో 41,205ఖాతాలకు రూ.510కోట్లు, 2026 మార్చికి 2,94,395ఖాతాలకు రూ.3వేల కోట్ల రుణ లక్ష్యంలో 2,03,432 ఖాతాలకు రూ.1,666.2 కోట్లు అందజేశారు. 2022-23లో 41శాతం, 2023-24లో 15శాతం, 2024-25లో 24ు, 2025-26లో 56శాతం వివిధ బ్యాంకులు రుణాలిచ్చాయి. 2026-27లో వ్యవసాయ రంగానికి రూ.3.60లక్షల కోట్లు రుణాలివ్వాలని నిర్ణయించగా, ఇందులో పంట రుణాల కింద రూ.2లక్షల కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంకర్ల కమిటీ ప్రకటించింది. ఈ మొత్తంలో కౌలు రైతులకు సుమారు రూ.5వేల కోట్లు రుణాలివ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రభుత్వాలు లక్ష్యాలు నిర్ధేశించినా బ్యాంకర్లు కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు.