ఫంగస్ ఫర్నిచర్
ABN , Publish Date - Jun 21 , 2026 | 08:21 AM
మట్టి, కలప, వెదురు, రబ్బరు, తోలు, ప్లాస్టిక్, గాజు, పింగాణీ... ఇలా రకరకాల పదార్థాలతో చేసిన వస్తువులను చూశాం.
మట్టి, కలప, వెదురు, రబ్బరు, తోలు, ప్లాస్టిక్, గాజు, పింగాణీ... ఇలా రకరకాల పదార్థాలతో చేసిన వస్తువులను చూశాం. ఇప్పుడు సరికొత్తగా ఫంగస్‌తో వస్తువులు తయారుచేస్తున్నారు. కుర్చీలు, బల్లలు, సోఫాలు.. ఇలా ఒకటేమిటి, ఇంటి అలంకరణలో ఫంగస్... అదే శిలీంధ్రాల ట్రెండ్ మొదలవుతోంది. ఆశ్చర్యంగా అనిపిస్తున్నా పర్యావరణ పరిరక్షణకు ఇదో చక్కని మార్గం అంటున్నారు శాస్త్రవేత్తలు. అనేక ప్రయోగాల బాట పట్టిన ‘ఫంగస్’ ఫర్నిచర్ డిజైనింగ్‌పై ప్రత్యేక కథనం ఇది.
సింగపూర్‌లో ఇటీవల ‘డిజైన్ వీక్’ ఎగ్జిబిషన్ జరిగింది. అక్కడ ఓ గాజు కాఫీ టేబుల్ అందరి దృష్టినీ అమితంగా ఆకర్షించింది. సన్నసన్నని పుట్టగొడుగుల వలయాకృతిపైౖ రెండు కిలోల బరువున్న గాజు ఫలకాన్ని నిలబెట్టారు. పుట్టగొడుగుల్లో నీళ్లే అధికం. పైగా ఇవి స్పాంజ్‌లా చాలా మెత్తగా ఉంటాయి. మరి అంతటి బరువుని ఎలా మోయగలుగుతున్నాయి? ఇదే శిలీంధ్రజాలం (మైసీలియం) మాయ. సింగపూర్‌కి చెందిన ‘బివైడర్’ అనే సంస్థకు చెందిన డిజైనర్లు ఈ కాఫీ టేబుల్ తయారుచేసి ఎగ్జిబిషన్‌లో పెట్టారు. ఆసక్తికరమైన ఈ టేబుల్ గురించి తెలుసుకుని, దాన్ని కొనేందుకూ చాలామంది ముందుకు వచ్చారట. ఇలాంటి ఎన్నో సంస్థలు నేడు ప్రపంచవ్యాప్తంగా శిలీంధ్రాలతో కుర్చీలు, టేబుళ్లు, సోఫాలు, ఫోమ్, పార్టిషన్ గోడలు... ఇలా ఎన్నో ఎన్నో రూపొందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఫర్నిచర్ డిజైనింగ్‌లో తాజా అద్భుతం ఫంగసే అంటే నమ్మగలరా? అసలు శిలీంధ్రాలలో ఈ కొత్త కోణం ఏమిటి?
అచ్చులుగా పోసి...
వర్షాకాలం మొదలవ్వగానే అక్కడక్కడా నేల లోంచి బయటికి వచ్చి పలుకరిస్తుంటాయి పుట్టగొడుగులు. ఇవి ఫంగస్ జాతికి చెందినవి. అటు మొక్కల్లా అన్పించినా సొంతంగా ఆహారాన్ని తయారుచేసుకోలేవు. అలా అని జంతువుల కోవలోకీ రావు. అందుకే ఇవి ప్రత్యేక శిలీంధ్ర రాజ్యంలోకి వస్తాయి. ఈస్ట్‌లు, మోల్డ్‌లు, పుట్టగొడుగులు లాంటివి ఈ వర్గంలోకి వస్తాయి. శిలీంధ్రాలు, పుట్టగొడుగుల వేర్ల వ్యవస్థే ‘మైసీలియం’. ఇది బూజులాగా వలయంగా పరుచుకుని ఉంటుంది. దాని ప్రత్యేక అల్లికను ‘వుడ్ వైడ్ వెబ్’ అనీ, ‘ఫంగల్ ఇంటర్నెట్’ అనీ పిలుస్తారు. నేల నుంచి లేదా కుళ్లిపోతున్న పదార్థాల నుంచి పోషకాలను సేకరించి జీవులు పెరిగేలా ఈ వేర్లు ఉపయోగపడతాయి. శాస్త్రపరంగా దీన్ని ‘బయో ఇంటెలిజెన్స్’ అంటారు. ఈ గుణమే పారిశ్రామిక రంగాన్ని ఫంగస్ చుట్టూ తిరిగేలా చేస్తోంది.
అయితే పారిశ్రామిక రంగంలో ఎంచుకున్న వస్తువుల ఆకారంలో అచ్చులను తయారుచేసి వాటిల్లో మైసీలియం ఉంచి, ఆహారం, నీళ్లు అందిస్తారు. అప్పుడిక అది చకచకా పెరగడం ప్రారంభిస్తుంది. పూర్తిగా అచ్చు అంతా పెరిగాక... అప్పుడు నిర్జలీకరణం చేస్తారు. లేదా వేడి చేయడం ద్వారా అందులోని శిలీంధ్రాలు చనిపోయేలా చేస్తారు. కాబట్టి ఆ వస్తువులో వాటి పెరుగుదల అక్కడితో ఆగిపోతుంది. ఈ పద్ధతిలో మెత్తని, వస్త్రాల్లాంటి వాటితో పాటు గట్టిగా, దృఢంగా ఉండే ఇటుకల లాంటివి కూడా తయారుచేస్తున్నారు. మైసీలియంలో ఉన్న ప్రత్యేకత వల్ల ఇది సాధ్యం అవుతోంది. ఈ పద్ధతిలో ఆకట్టుకునే ఫర్నిచర్‌ను కూడా రూపొందిస్తున్నారు సృజనాత్మక పారిశ్రామిక వేత్తలు.
గోడల్ని పెంచుదాం...
ముంబైకి చెందిన ‘అనోమలియా’ అనే ఆర్కిటెక్చర్ సంస్థ ‘గోడలను పెంచుదాం’ అనే సృజనాత్మక ఆలోచనతో ముందుకు వచ్చింది. సియోల్‌లో జరిగిన ‘’బయన్నేల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ అర్బనిజమ్ 2025’ ఎగ్జిబిషన్‌లో ఈ సంస్థ మైసీలియంతో చేసిన గోడను ప్రదర్శించింది. మైసీలియం, వ్యవసాయ వ్యర్థాలతో తయారైన మైకోబ్లాక్స్, ప్యానల్స్‌తో ఈ గోడను నిర్మించడం విశేషం. ప్రతీ బ్లాక్ కూడా కిలోన్నర మాత్రమే బరువు ఉంటుంది కానీ... అది ఒకటిన్నర టన్నుల బరువు మోయగలగడం విశేషం. ఇందులోంచి గాలీ, వెలుతురు ప్రసరిస్తాయి. అంటే గోడ ఓ అడ్డంలా కాకుండా పారదర్శకమైన పరదాలా ఉంటుందన్నమాట.
అక్కడితో ఆగకుండా ఈ సంస్థ ‘మైకోలివింగ్ సిరీస్’ పేరున సోఫాలు, బల్లలు, ఆర్మ్‌ఛైర్ మొదలైనవాటిని రూపొందించింది. స్టీల్ ఫ్రేమ్ మీద మైసీలియంతో చేసిన ఫోమ్, లెదర్‌ను వాడడం విశేషం. వస్తువులను బట్టి వీటి ధర 250 నుంచి 3000 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. సింగపూర్‌నకు చెందిన మైసీలియమ్ స్టార్టప్ ‘మిల్లి’ సౌండ్ ప్రూఫ్ ప్యానెల్స్‌ను తయారుచేస్తోంది. స్కూల్స్, హోటల్స్‌లో వీటిని ఉపయోగించాలన్నది ఆలోచన. ఇంటి అలంకరణకు అవసరమైన పెన్సిల్ కప్పులు, ల్యాంపులు, శిల్పాలు... ఇలా ఎన్నింటినో వీళ్లు తయారుచేస్తున్నారు. నెదర్లాండ్స్‌లో వీటన్నింటితో పాటు స్లిప్పర్లు కూడా తయారుచేస్తున్నారు.
ఏమిటీ ప్రత్యేకత?
గృహోపకరణాలు తయారుచేయడానికి ప్రస్తుతం మట్టి నుంచి గాజు దాకా ఎన్నో రకాల పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ కాదని ఫంగస్‌తో వస్తువులను తయారుచేయడం ఏమిటి? అనే సందేహం రావడం సహజమే. అయితే ప్రపంచంలో కర్బన వినియోగం విపరీతంగా పెరిగింది. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భూమిని పరిరక్షించడానికి ఫంగస్‌లు ఓ చక్కని మార్గం. ఎందుకంటే పర్యావరణంలో గొప్ప రీసైక్లర్‌గా పనిచేస్తుంది. కుళ్లిపోయిన వస్తువులు నేలలో కలిసిపోయేలా ప్రకృతికి సహాయం చేస్తున్నాయి. పైగా ఇవి ప్రకృతిలో పెద్ద ఎత్తున సహజంగా లభ్యమవుతున్నాయి.
అందుకే శిలీంధ్రాలతో వస్తు ఉత్పత్తిలో ఎలాంటి రసాయనాలూ వాడడం లేదు. ఒకవేళ ఆ ఉత్పత్తుల జీవన కాలం ముగిసినా, నేలలో సులభంగా కలిసిపోతాయి. హానికారక వ్యర్థాలు అసలే లేవు. కాబట్టి ఈ ఉత్పత్తులన్నీ ఎకో ఫ్రెండ్లీ అని సుస్థిర అభివృద్ధి పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్లాస్టిక్, రబ్బర్, కలప, తోలు లాంటి పర్యావరణ హానికారక పదార్థాలను శిలీంధ్రాలతో పెద్దఎత్తున మార్చే రోజులు త్వరలో వస్తాయని ఇంటీరియర్ డిజైనర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణానికి మేలు కలిగించే ఏ పరిణామం అయినా మంచిదే కదా. అందుకే ‘ఫంగస్ ఫర్నిచర్’ అనేది... విభిన్నమైనదే కాదు, విశిష్టమైనది కూడా.
ప్రయోగాలు ఘనం!
శిలీంధ్రాలతో ఫర్నిచర్ అంటే వినడానికి కొత్తగా అనిపిస్తుంది. కానీ గత కొంతకాలంగా వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రయోగశాలల్లో ‘మైకోమీట్’, ‘మైకోప్రొటీన్’ లాంటి కృత్రిమ మాంసాన్ని ఇప్పటికే తయారు చేస్తున్నారు. ఇందులో ఎక్కువ పీచుపదార్థాలు, ప్రొటీన్లు ఉండడం విశేషం. అదేవిధంగా కృత్రిమ తోలును తయారుచేసి బ్యాగులు, జాకెట్లు, బెల్టులు తదితర లెదర్ ఉత్పత్తులను రూపొందిస్తున్నారు. ఇంకో అడుగు ముందుకేసి ఫంగస్‌తో దుస్తులనూ తయారుచేయడం విశేషం. ‘డెల్’ లాంటి సంస్థలు తమ ఉత్పత్తుల ప్యాకేజింగ్‌లో మైసీలియంతో చేసిన కవర్లనే వాడుతున్నాయి.
మ్యూజియమూ ఉందండోయ్
ఆమ్‌స్టర్‌డ్యామ్ నగర వింతల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది ‘మైక్రోపియా’. కనిపించని సూక్ష్మజీవుల ప్రపంచాన్ని కళ్ల ముందు ఆవిష్కరించే మ్యూజియం ఇది. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి మ్యూజియం లేదు. ఇక్కడ శిలీంధ్రాలతో తయారుచేసిన వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. అంతేకాదు ‘స్కాన్ యువర్‌సెల్ఫ్’ స్కానింగ్ చేసే యంత్రం ముందు నిలుచోగానే మన శరీరం మీద, లోపల ఉన్న కోట్లాది సూక్ష్మకణాల గురించి తెలియజేస్తుంది. ‘ఇద్దరు వ్యక్తులు ముద్దు పెట్టుకున్నప్పుడు ఒకరి నుంచి మరొకరికి ఎన్ని సూక్ష్మక్రిములు వ్యాప్తిచెందాయో తెలిపే ‘కిస్ ఓ మీటర్’ ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఈ మ్యూజియానికే హైలైట్‌గా ‘లైవ్ మైక్రోబ్ వాల్’ గురించి చెప్పుకోవాలి. పేద్ద గోడ మీద ప్రత్యేకంగా తయారుచేసిన పాత్రల్లో పెరుగుతోన్న 40 రకాల సూక్ష్మక్రిములను చూడొచ్చు. వీటిని ల్యాబ్ టెక్నీషియన్ల్లు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి:
జర్నలిజంలో మీ ప్రస్థానం ఎందరికో ఆదర్శం
Read Latest AP News And Telangana News And International News And Telugu News