Share News

వైభవ్ ప్రవర్తనపై విమర్శలు.. తిలక్ వర్మ రియాక్షన్ ఇదే

ABN , Publish Date - Jun 21 , 2026 | 07:58 AM

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా నేడు భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టీ నెలకొంది.

వైభవ్ ప్రవర్తనపై విమర్శలు.. తిలక్ వర్మ రియాక్షన్ ఇదే
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా నేడు భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టీ నెలకొంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లంక సూపర్ ఓవర్లో భారత్‌పై గెలిచింది. మ్యాచ్ ముగిసిన తర్వాత లంక ఆటగాడు విషెన్ హలంబాగె పెవిలియన్‌కు వెళ్తున్న వైభవ్‌ను రెచ్చగొట్టడంతో.. వైభవ్ అతడిపై దూసుకెళ్లాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన అనంతరం వైభవ్ ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై భారత్-ఎ కెప్టెన్ తిలక్ వర్మ స్పందించాడు.


‘వైభవ్ ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. మైదానంలో ఉద్వేగాలు సహజం. అలా అని ఆ విషయంపై ప్లేయర్‌ ఒత్తిడి తీసుకోవడం సరైంది కాదు. వైభవ్‌కు నేను అదే చెప్పాను.. ఆ ఘటనను అక్కడే వదిలేసి తన సహజశైలిలో స్వేచ్ఛగా ఆడుతూ ఆటను ఆస్వాదించాలని సూచించాను. ఇప్పటి వరకు అతడు సాధించిన విజయాలన్నీ సానుకూల దృక్పథంతో ఆడటం వల్లే వచ్చాయి. కాబట్టి వైభవ్ ప్రవర్తన, ఆటతీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక కెప్టెన్‌గా వైభవ్‌కు ఎప్పుడూ అండగా ఉంటా. ఫైనల్‌లో అతడు రాణిస్తాడని ఆశిస్తున్నాం. ఒకసారి లయ అందుకుంటే మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించే సత్తా అతడికి ఉంది’ అని తిలక్ వర్మ వెల్లడించాడు.


అంత సులభం కాదు..

ఇక త్వరలో ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌లతో జరిగే టీ20 సిరీస్‌ల కోసం తిలక్‌ వర్మను భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అదే పర్యటనలో వైభవ్‌ తొలిసారి సీనియర్‌ భారత జట్టుతో ప్రయాణించనున్నాడు. అయితే అండర్‌-19 స్థాయి నుంచి సీనియర్‌ క్రికెట్‌కు మారడం అతడికి పెద్ద సవాలేనని తిలక్‌ అభిప్రాయపడ్డాడు. ‘అండర్‌-19 క్రికెట్‌ నుంచి వచ్చి ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇప్పుడు సీనియర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 15 ఏళ్ల కుర్రాడు ఈ ఘనతను సాధించడం అంత సులభం కాదు. కానీ అతడు అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడు. అవకాశం దొరికితే ఒంటిచేత్తో మ్యాచ్‌ను ముగించగలడు’ అని తిలక్ వర్మ స్పష్టం చేశాడు.


ఇవి కూడా చదవండి:

అవకాశం వచ్చినప్పుడే నిరూపించుకోవాలి: రవి బిష్ణోయ్

అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్: భారత్ క్లీన్‌స్వీప్

Updated Date - Jun 21 , 2026 | 07:58 AM