Share News

సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:04 AM

అఫ్ఘానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 110 నాటౌట్‌) కెరీర్‌లో రెండో శతకంతో ఫామ్‌ను చాటుకోగా..

సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

  • మూడో వన్డే కూడా భారత్‌దే

  • జైస్వాల్‌ అజేయ శతకం

  • రోహిత్‌ హాఫ్‌ సెంచరీ

  • హష్మతుల్లా సెంచరీ వృథా

  • అఫ్ఘానిస్థాన్‌కు నిరాశే

చెన్నై: అఫ్ఘానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 110 నాటౌట్‌) కెరీర్‌లో రెండో శతకంతో ఫామ్‌ను చాటుకోగా.. వెటరన్‌ రోహిత్‌ శర్మ (69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 79) అర్ధసెంచరీతో మెరిశాడు. ఇక పేసర్‌ ప్రసిద్ధ్‌ క్రిష్ణ (5/23) కెరీర్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేయడంతో శనివారం అఫ్ఘాన్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌ 9 వికెట్లతో నెగ్గింది. దీంతో 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. వన్డే సారథిగా గిల్‌కిదే తొలి సిరీస్‌ కావడం విశేషం. ముందుగా అఫ్ఘాన్‌ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ హష్మతుల్లా షాహిదీ (102) సెంచరీతో ఆకట్టుకోగా, ఒమర్జాయ్‌ (50) రాణించాడు. టాప్‌-5 ఆటగాళ్లను ప్రసిద్ధ్‌ పెవిలియన్‌ చేర్చాడు. ప్రసిద్ధ్‌ ధాటికి 36/4 స్కోరుతో కష్టాల్లో పడ్డ జట్టును షాహిదీ-ఒమర్జాయ్‌ జోడీ ఆదుకుంది. 19 ఓవర్లపాటు క్రీజులో నిలిచిన ఈ జోడీలో ఒమర్జాయ్‌ను ప్రిన్స్‌ అవుట్‌ చేయడంతో ఐదో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత నబీ (21)తో ఆరో వికెట్‌కు షాహిదీ 57 రన్స్‌ జోడించాడు. అనంతరం 20 పరుగుల వ్యవధిలోనే చివరి 5 వికెట్లు నేలకూలాయి. స్వల్ప ఛేదనలో భారత్‌ 28.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 224 రన్స్‌ చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ప్రసిద్ధ్‌, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా గిల్‌ నిలిచారు.

ఓపెనర్ల హవా: ఛేదనలో భారత్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు జైస్వాల్‌, రోహిత్‌ సుదీర్ఘంగా క్రీజులో నిలవగా, చక్కటి సమన్వయంతో పోటాపోటీ బౌండరీలతో లక్ష్యం వైపు సాగారు. తొలి ఓవర్‌లోనే జైస్వాల్‌ మూడు ఫోర్లతో 23 రన్స్‌ వచ్చాయి. ఆ తర్వాత రోహిత్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో పవర్‌ప్లేలో జట్టు 81 రన్స్‌తో నిలిచింది. ఇద్దరూ హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో ఓ దశలో మ్యాచ్‌ను వీరే ముగిస్తారనిపించింది. కానీ 23వ ఓవర్‌లో రోహిత్‌ వెనుదిరగడంతో తొలి వికెట్‌కు 170 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. అప్పటికే భారత్‌ ఛేదన దరిదాపుల్లోకి వచ్చింది. 28వ ఓవర్‌లో శ్రేయాస్‌ (20 నాటౌట్‌) రెండు సిక్సర్లతో ఆకట్టుకోగా.. జైస్వాల్‌ తర్వాతి ఓవర్‌లోనే 6,4,6తో తన సెంచరీతో పాటు మ్యాచ్‌ను కూడా ముగించాడు.

Updated Date - Jun 21 , 2026 | 04:04 AM