Share News

అమెరికా అదరహో సాంబా సాహో!

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:08 AM

మథియాస్‌ కున్హా డబుల్స్‌ గోల్స్‌తో అదరగొట్టడంతో.. ఐదుసార్లు చాంపియన్‌ బ్రెజిల్‌ ఫిఫా వరల్డ్‌కప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.

అమెరికా అదరహో సాంబా సాహో!

  • బ్రెజిల్‌ తొలి విజయం

  • నాకౌట్‌కు యూఎస్ఏ

  • వరల్డ్‌క్‌పలో మరో ఆతిథ్య దేశం అమెరికా నాకౌట్‌కు దూసుకెళ్లగా.. ఐదుసార్లు చాంపియన్‌ బ్రెజిల్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. మొరాకో నాకౌట్‌ రేసులోకి దూసుకురాగా.. హైతీ, తుర్కియే జట్లు టోర్నీ నుంచి అవుటయ్యాయి.

ఫిలడెల్ఫియా: మథియాస్‌ కున్హా డబుల్స్‌ గోల్స్‌తో అదరగొట్టడంతో.. ఐదుసార్లు చాంపియన్‌ బ్రెజిల్‌ ఫిఫా వరల్డ్‌కప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌-సిలో శనివారం జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్‌ 3-0తో హైతీని చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో హైతీ నాకౌట్‌ ఆశలు గల్లంతయ్యాయి. మథియాస్‌ కున్హా (23వ, 36వ నిమిషం) రెండు గోల్స్‌ చేయగా.. ఫస్టాఫ్‌ ఇంజూరీ టైమ్‌లో వినీసియస్‌ జూనియర్‌ (45+3వ) బ్రెజిల్‌కు మూడో గోల్‌ అందించాడు. ఈ మ్యాచ్‌లో సాంబా జట్టు పసికూన హైతీపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. వినీసియస్‌ కొట్టిన కిక్‌.. గోల్‌ కీపర్‌కు తగిలి రీబౌండ్‌ కాగా.. అక్కడే కాచుకొన్న కున్హా లాఘవంగా బంతిని గోల్‌లోకి పంపి బ్రెజిల్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. మరో 13 నిమిషాల తర్వాత పవర్‌ఫుల్‌ కిక్‌తో మరో గోల్‌ చేసి ఫ్యాన్స్‌లో జోరు నింపాడు. స్టాపేజ్‌ టైంలో వినీసియస్‌ గోల్‌ చేయడంతో బ్రెజిల్‌ 3-0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. అయితే, సెకండాఫ్‌లో మాత్రం ఇరుజట్లూ గోల్‌ చేయడంలో విఫలమయ్యాయి. ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో మొరాకో 1-0తో స్కాట్లాండ్‌పై గెలిచింది. ఆట ఆరంభమైన 71 సెకన్లలోనే మొరాకో ప్లేయర్‌ ఇస్మాయిల్‌ సైబరి గోల్‌ చేశాడు. ఈ విజయంతో మొరాకో రౌండ్‌-32 ఆశలను సజీవంగా నిలబెట్టుకొంది.

7.jpg

ఆసీస్‌ను చిత్తుచేసి..

ఆతిథ్య దేశం అమెరికా ప్రపంచక్‌పలో జోరుమీదున్నది. వరుసగా రెండో విజయంతో యూఎస్‌ జట్టు నాకౌట్‌ రౌండ్‌కు చేరుకుంది. గ్రూప్‌-డిలో శనివారం జరిగిన మ్యాచ్‌లో అమెరికా 2-0తో ఆస్ట్రేలియాను ఓడించింది. 11వ నిమిషంలో ఆస్ట్రేలియా డిఫెండర్‌ కామెరూన్‌ బర్జస్‌ సెల్ఫ్‌ గోల్‌తో అమెరికా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక, తొలి అర్ధభాగం ముగియడానికి కాస్త ముందు అమెరికా ఆటగాడు అలెక్స్‌ ఫ్రీమన్‌ 43వ నిమిషంలో హెడర్‌ గోల్‌ చేశాడు. మొదట ఆఫ్‌సైడ్‌గా ప్రకటించిన ఈ గోల్‌ను వీడియో అసిస్టెంట్‌ రెఫరీ (వీఏఆర్‌) సమీక్ష అనంతరం గోల్‌గా నిర్ధారించారు.


తుర్కియేకు పరాగ్వే చెక్‌

గ్రూప్‌-డిలో జరిగిన పోరులో పరాగ్వే 1-0తో తుర్కియేపై గెలిచింది. 2వ నిమిషంలోనే మథి యాస్‌ గలర్జా గోల్‌తో పరాగ్వే 1-0 ఆధిక్యంలోకెళ్లింది. వరుసగా రెండో ఓటమితో తుర్కి యే రౌండ్‌-32 ఆశలు గల్లంతయ్యాయి.

5.jpg

ఒకేరోజు 2 ఫాస్టెస్ట్‌ గోల్స్‌

టర్కీతో మ్యాచ్‌లో పరాగ్వే ఆటగాడు మథియాస్‌ గలర్జా 64వ సెకనులోనే గోల్‌ కొట్టి ఈ ప్రపంచకప్‌లో వేగవంతమైన గోల్‌ను నమోదు చేశాడు. అయితే, అంతకంటే ముందు స్కాట్లాండ్‌తో జరిగిన పోరులో మొరాకో ఆటగాడు ఇస్మాయిల్‌ సైబరి 71వ సెకనులో చేసిన గోల్‌ ఈ టోర్నీలో రెండో వేగవంతమైన గోల్‌గా నిలిచింది.

6.jpg

నోరు మూసుకున్నాడు.. రెడ్‌కార్డ్‌ చూపాడు

ఫిఫా నిబంధనలు ఉల్లంఘించి.. నోటికి చేయి అడ్డుపెట్టుకొని మాట్లాడినందుకు పరాగ్వే ప్లేయర్‌ మిగ్యుయెల్‌ మిరోన్‌కు రెడ్‌కార్డ్‌ చూపారు. ఇలా నోరు మూసుకున్నందుకు ఫిఫా కప్‌లో రెడ్‌కార్డ్‌కు గురైన తొలి ఆటగాడిగా మిగ్యుయెల్‌ మిరోన్‌ చెత్త రికార్డును మూటగట్టుకొన్నాడు. నోటికి చేతిని అడ్డుపెట్టుకొని కొందరు ఆటగాళ్లు జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తుండడంతో.. వాటిని కట్టడి చేసేందుకు ఫిఫా ఇలాంటి నిబంధనను అమలు చేస్తోంది.

నెదర్లాండ్స్‌ ‘పాంచ్‌’ స్వీడన్‌పై గెలుపు

స్వీడన్‌తో జరిగిన గ్రూప్‌ ‘ఎఫ్‌’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 5-1తో ఘనవిజయం సాధించింది. బ్రియాన్‌ బ్రాబే (5వ, 17వ నిమిషాల్లో), కోడీ గాక్‌పో (47, 54), సమ్మర్‌విల్లే (89) గోల్స్‌ సాధించగా.. స్వీడన్‌ తరఫున ఎలాంగ (59) ఏకైక గోల్‌ అందించాడు.

Updated Date - Jun 21 , 2026 | 04:08 AM