సీఐ నాగరాజు అరెస్ట్‌కు రంగం సిద్ధం..
ABN , Publish Date - Jun 21 , 2026 | 07:49 AM
సస్పెన్షన్ వేటు పడిన కృష్ణ లంక సీఐ నాగరాజును ఆదివారం అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అతడిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయనే ప్రచారం సాగుతోంది.
విజయవాడ, జూన్ 21: సస్పెన్షన్ వేటు పడిన కృష్ణ లంక సీఐ నాగరాజును ఆదివారం అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అతడిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయనే ప్రచారం సాగుతోంది. సాయికృష్ణ నిర్బంధం, హత్యాయత్నం కింద సీఐ నాగరాజుపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
మరో వైపు సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆదివారం మూడో రోజు విచారణ కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు కృష్ణ లంక పోలీస్టేషన్‌లో స్టేషన్ సిబ్బందితోపాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఏసీపీ దైవ ప్రసాద్ బృందం విచారించింది. సాయి కృష్ణ లాకప్ డెత్.. దహనం చేశారంటూ అతడి తల్లి విజయలక్ష్మీ ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో శనివారం కృష్ణ లంకలోని స్వర్గపురి శ్మశానవాటికలో సిబ్బంది నుంచి పటమట సీఐ పవన్ కిషోర్ వివరాలు సేకరించారు. ఆ క్రమంలో మే 23 నుంచి 25వ తేదీ వరకు అనాథ మృతదేహాలకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు. అదే సమయంలో బస్టాండు నుంచి స్వర్గపురి వరకు ఉన్న సీసీ టీవీ కెమెరాలను కూడా గుణదల సీఐ పరిశీలించారు.
ఇంకో వైపు ఇదే కేసులో క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ విచారణ ఆధారంగా ఏసీపీ దైవ ప్రసాద్ బృందం సాక్ష్యాలను సేకరిస్తోంది. అలాగే సీఐ నాగరాజుతో పాటు ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై విచారణ అధికారులు ఆరా తీస్తున్నారు. శనివారం టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ లతా కుమారిని మరోసారి విచారణకు పిలిచి స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు.
సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కమిషనరేట్ పరిధిలోని జగ్గయ్యపేట, మైలవరం, గుణదల, వన్ టౌన్, సత్యనారాయణపురం, పటమట సీ.ఐలతో కీలక ఆధారాల కోసం నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజులుగా సాయికృష్ణ మిస్టరీని ఛేదించేందుకు అతడి తల్లి విజయలక్ష్మి చెప్పిన అంశాల ఆధారంగా ఆయా ప్రాంతాల పరిధిలో విచారణ గోప్యంగా కొనసాగుతుంది. సీఐ నాగరాజు అరెస్ట్‌తో ఈ కేసు విచారణ ఒక కొలిక్కి వస్తుందని పోలీస్ అధికారులు భావిస్తున్నారు. దీంతో అతడి అరెస్ట్‌కు రంగం సిద్ధమైందనే ప్రచారం సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పెద్దల పాదాలకు నమస్కరించడం వల్ల కలిగే ప్రయోజనాలు..
సీఎం చంద్రబాబుతో ప్రాణాయామం చేయించిన బాబా రామ్‌దేవ్
For More AP News And Telugu News