ఆ ఇల్లొక మయసభ!
ABN , Publish Date - Jun 21 , 2026 | 10:10 AM
మెట్లు ఉంటాయి. కానీ వాటిగుండా ఎక్కడికీ వెళ్లలేరు. తలుపులు ఉంటాయి. కానీ తలుపు తీసి, అడుగు వేస్తే పైఅంతస్తులో నుంచి కిందపడిపోతారు.
మెట్లు ఉంటాయి. కానీ వాటిగుండా ఎక్కడికీ వెళ్లలేరు. తలుపులు ఉంటాయి. కానీ తలుపు తీసి, అడుగు వేస్తే పైఅంతస్తులో నుంచి కిందపడిపోతారు. పదుల సంఖ్యలో గదులు, వేల కిటికీలు, తలుపులు ఉన్న ఆ సౌధంలో అడుగుకో రహస్యం దాగి ఉంది. అందుకే శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఇంటిని ‘మిస్టరీ హౌస్’ అని పిలుస్తారు. ఈ భవనంలో అడుగుపెట్టాలంటే ఆసక్తి ఉంటే సరిపోదు. గుండె ధైర్యం కావాలి. ఇంతకీ ఈ మాయా మాన్షన్ ఎక్కడుందంటే...
వించెస్టర్ మిస్టరీ హౌస్... క్యాలిఫోర్నియా లోని సాన్‌జోస్ ప్రాంతంలో ఉన్న ఓ రహస్య భవనం. బయటి నుంచి చూసే వారికి సాధారణ భవనంలానే కనిపిస్తుంది. కానీ అందులోకి అడుగుపెట్టిన తరువాతే తెలుస్తుంది. అదొక అంతుచిక్కని వింతైన పురాతన మాన్షన్ అని. 160కి పైగా గదులు, 40 పడకగదులు, రెండు బేస్‌మెంట్లతో రాజకోటను తలపించేలా ఉంటుంది. సాధారణంగా ఎంత పెద్ద ఇల్లయినా కిటికీలు పదుల సంఖ్యలో ఉంటాయి. కానీ ఈ ఇంటికి మాత్రం ఆశ్చర్యంగా 10 వేల కిటికీలున్నాయి. ఇక తలుపుల సంఖ్య తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. పదులు కాదు, వందలు కాదు... 2 వేల తలుపులున్నాయి. మాన్షన్‌లోని అన్ని తలుపులు లాక్ చేసి ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ రావడానికే ఒక రోజు పడుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక లోపల వింతలు విశేషాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే అక్కడి ప్రజలు ఈ భవనాన్ని ‘మిస్టరీ హౌస్’గా పిలుస్తుంటారు.
అంతా మాయ...
తలుపు ఉందంటే అక్కడ మరొక గది ఉండి తీరాలి. లేదంటే బయటకు దారైనా ఉండాలి. కానీ ఈ మిస్టరీ హౌస్‌లో మాత్రం అలా ఉండదు. తలుపు తెరిస్తే అక్కడ మీకు గది కనిపించదు. మూసి వున్న తలుపులు తెరిచి, పొరపాటున కాలు బయటికి పెడితే మొదటి అంతస్తు నుంచి కింద పడిపోవడం ఖాయం. ఇక కిటికీలకు అత్యంత ఖరీదైన టిఫ్ఫానీ గ్లాస్‌ను ఉపయోగించారు. అయితే వెలుతురు పడే అవకాశం లేని చోట కూడా కిటికీలను ఏర్పాటు చేయడం వెనక ఆంతర్యం ఏమిటో అంతుచిక్కదు. కొన్నిచోట్ల మెట్లుంటాయి. కానీ అవి నేరుగా సీలింగ్‌కు తగులుతాయి. ఇలాంటి రకరకాల వింతలు, విశేషాలు ఈ భవనంలో అడగడుగునా కనిపిస్తాయి.
36 ఏళ్ల పాటు మరమ్మతులు
సారా వించెస్టర్ అనే మహిళ పేరు మీదుగా ఈ మాన్షన్‌కు ‘వించెస్టర్ మిస్టరీ హౌస్’ అని పేరు పెట్టారు. 1886లో వించెస్టర్ 8 గదుల ఫాంహౌస్‌ను కొనుగోలు చేశారు. ఆ తరువాత ఆ ఇంటికి మరమ్మతులు చేయించడం ప్రారంభించారామె. అయితే ఆ మరమ్మతులు 36 ఏళ్ల పాటు కొనసాగాయట. ఈ రోజు డబ్బుతో లెక్కిస్తే... ఆ ఇంటి మరమ్మతుల కోసమే అక్షరాలా రూ.52 కోట్లు ఖర్చు చేశారు. 1922లో వించెస్టర్ మరణించడంతో మరమ్మతులు ఆగిపోయాయి. 1906లో ఆ ప్రాంతంలో సంభవించిన భూకంపం వల్ల ఇంటిలో కొంతభాగం దెబ్బతింది. ఆ భాగాన్ని ఇప్పటికీ చూడొచ్చు.
రకరకాల కథనాలు
ఈ ‘మిస్టరీ హౌస్’ గురించి రకరకాల కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వించెస్టర్‌ను దెయ్యాలు వెంటాడటంతో అతీంద్రియ శక్తులు కలిగిన ఒక వ్యక్తి సలహాను అడిగారట. ఆమె భర్త కనిపెట్టిన రైఫిల్ వల్ల చనిపోయినవారు దెయ్యాలుగా మారి ఆమెను వెంటాడాయని చెబుతారు. పశ్చిమ దిశలో ఒక ఇల్లు కొనుక్కుని, కట్టడం ఎప్పటికీ ఆపొద్దని అతీంద్రియ శక్తులున్న వ్యక్తి ఆమెకు సలహా ఇచ్చాడట. అందుకే ఆమె నిరంతరం మరమ్మతులు చేయిస్తూనే వెళ్లారు. నిర్మాణం ఆపితే తాను చనిపోతానని నమ్మిందని ఒక కథనం ప్రచారంలో ఉంది. వించెస్టర్ రోజుకో పడకగదిలో నిద్రించేదని, వేర్వేరు దారుల్లో నడిచేదని, దెయ్యాలను తప్పుదోవ పట్టించేందుకు అన్ని తలుపులు ఏర్పాటు చేయించిందని స్థానికులు చెబుతారు.
1990లో పారాసైకాలజిస్ట్, సైకిక్ ఇన్వెస్టిగేటర్ అయిన క్రిస్టోఫర్ చాకోన్ ఈ మిస్టరీ కట్టడంపై పరిశోధన చేశారు. అనేక మందిని కలిసి ఆ భవంతితో వారికున్న అనుభవాలను తెలుసుకున్నారు. 2018లో ‘వించెస్టర్’ పేరుతో హాలీవుడ్ సినిమా కూడా విడుదలయ్యింది. ఈ మిస్టరీ హౌస్‌ను ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు. కనీస ఛార్జీలు చెల్లించి సందర్శకులు ఈ భవంతిలోకి ప్రవేశించొచ్చు... కంగాళీ కట్టడంతో కంగారుపడొచ్చు. భయంతో బయటకు వచ్చి, తీరిగ్గా నవ్వుకోనూవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
జర్నలిజంలో మీ ప్రస్థానం ఎందరికో ఆదర్శం
Read Latest AP News And Telangana News And International News And Telugu News