స్పేస్‌కి ఫిఫా ప్రపంచ కప్ బాల్.. వీడియో విడుదల చేసిన నాసా
ABN , Publish Date - Jun 21 , 2026 | 10:18 AM
ఫిఫా ప్రపంచ కప్ 2026 అధికారిక మ్యాచ్ బంతి ‘ట్రియొండా’ ఇప్పుడు అంతరిక్షంలో సందడి చేస్తోంది. అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు ఈ బంతిపై ప్రయోగాలు నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నీ ఆసక్తికరంగా కొనసాగుతోంది. అయితే అధికారిక మ్యాచ్ బంతి ‘ట్రియొండా’ ఇప్పుడు అంతరిక్షంలో సందడి చేస్తోంది. అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు ఈ బంతిపై ప్రయోగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పేస్‌లో ఫుట్‌బాల్ ఆడిన వ్యోమగాముల వీడియోను అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఎక్స్ వేదికగా విడుదల చేసింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న శూన్య గురుత్వాకర్షణ శక్తి (మైక్రో గ్రావిటీ)లో ఫుట్‌బాల్ డైనమిక్స్, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 2019లో చేసిన ఒక అధ్యయనాన్ని బేస్ చేసుకుని, ప్రఖ్యాత స్పోర్ట్స్ బ్రాండ్ తయారు చేసిన ఈ ట్రియొండా బంతి.. సెంటర్ ఆఫ్ మాస్ (ద్రవ్యరాశి కేంద్రం), బ్యాలెన్స్ దాని కదలికలను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాలను పరిశీలించారు. మైదానంలో ప్లేయర్లు కిక్ చేసినప్పుడు బంతి గాల్లో ఊహించిన విధంగా కదలాలంటే దాని బ్యాలెన్స్ ఎంత కచ్చితంగా ఉండాలో స్పోర్ట్స్ ఇంజనీర్లకు ఈ ప్రయోగం ద్వారా మరిన్ని హింట్స్ దొరికనున్నట్లు నాసా వెల్లడించింది. ‘భూమిపై ప్రజల జీవితాలను మెరుగుపరిచే ఎన్నో పరిశోధనల్లో ఇది కూడా ఒకటి’ అని నాసా వ్యాఖ్యానించింది.
అసలేంటీ ట్రియొండా?
ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ రూపొందించిన ట్రియొండా 2026 ఫిఫా ప్రపంచకప్ అధికారిక మ్యాచ్ బంతి. కెనడా, మెక్సికో, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్రపంచ కప్‌కు గుర్తుగా స్పానిష్ పదబంధం నుంచి ‘ట్రియొండా’ అనే పేరు పెట్టారు. మూడు దేశాలను సూచించే ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులు బంతిపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కెనడాకు ప్రతీకగా మేపుల్ ఆకు, మెక్సికోకు ఈగిల్, అమెరికాకు నక్షత్రం వంటి చిహ్నాలను కూడా బంతి రూపకల్పనలో పొందుపరిచారు. నాలుగు ప్యానెల్‌ల నిర్మాణంతో మధ్యలో త్రిభుజాకార ఆకృతి ఏర్పడేలా డిజైన్ చేశారు. సాంకేతికంగా కూడా ఈ బంతిలో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. లోతైన కుట్టు గీతలు ఉండటంతో గాల్లోకి కిక్ చేసిన సమయంలో స్థిరత్వం పెరుగుతుంది. అత్యాధునిక ‘కనెక్టెడ్ బాల్’ టెక్నాలజీతో రూపొందించిన ఈ బంతిలో సెన్సర్ చిప్ అమర్చారు. ఇది బంతి కదలికల సమాచారాన్ని తక్షణమే వీడియో అసిస్టెంట్ రిఫరీ వ్యవస్థకు చేరవేస్తుంది. దీంతో ఆఫ్‌సైడ్ నిర్ణయాలు సహా కీలక సందర్భాల్లో రిఫరీలకు మరింత కచ్చితమైన సమాచారం అందుతోంది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ ప్రవర్తనపై విమర్శలు.. తిలక్ వర్మ రియాక్షన్ ఇదే
ఫిఫా ప్రపంచ కప్: ఐవరీ కోస్ట్‌పై విజయం.. నాకౌట్‌కు జర్మనీ