Share News

విత్తనాలు పండిస్తున్నాడు!

ABN , Publish Date - Feb 22 , 2026 | 10:57 AM

టమాటా, చిక్కుడు, వంకాయ... మార్కెట్‌కు వెళ్తే ఎవరైనా తప్ప కుండా అడిగేది వాటినే కదా! కానీ ఒక చిన్న ప్రశ్న ఎవరైనా, ఎప్పుడైనా వేసుకున్నారా? ఈ టమాటా ఎక్కడిది? టమాటాల్లో 170 రకాలు, వంకాయల్లో 90 రకాలు, చిక్కుడులో 30 రకాలు న్నాయని తెలుసుకుంటే ఆశ్చర్య మేస్తుంది.

విత్తనాలు పండిస్తున్నాడు!

టమాటా, చిక్కుడు, వంకాయ... మార్కెట్‌కు వెళ్తే ఎవరైనా తప్ప కుండా అడిగేది వాటినే కదా! కానీ ఒక చిన్న ప్రశ్న ఎవరైనా, ఎప్పుడైనా వేసుకున్నారా? ఈ టమాటా ఎక్కడిది? టమాటాల్లో 170 రకాలు, వంకాయల్లో 90 రకాలు, చిక్కుడులో 30 రకాలు న్నాయని తెలుసుకుంటే ఆశ్చర్య మేస్తుంది! వాటిలో కొన్నయినా మన జీవితంలో రుచి చూశామా? ఈ రకాలన్నీ ఎక్కడో విదేశాల నుంచి దిగుమతి చేసిన హైబ్రిడ్‌ రకాలు కాదు. మన పూర్వీకులు మన నేల కోసం, మన వాతావరణం కోసం సృష్టించిన దేశీయ వారసత్వ పంటలు. అలాంటి పాత రుచులను, పాత పంటలను, పాత విత్తనాలను భవిష్యత్‌ తరాలకు అందించాలనే తపనతో ఒక యువకుడు మొదలుపెట్టిన ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరం. అతని పేరు గోకుల్‌ రాజ్‌.


book7.2.jpgమిలమిల మెరిసే కూరగాయల మధ్య ఒక సందేహం. కొనేప్పుడు చూస్తే అన్నీ తాజాగా మెరిసిపోతుంటాయి. కానీ వంట చేసినప్పుడు రుచి మాయమవుతోంది. అదే విషయం గోకుల్‌ రాజ్‌ను బాగా ఆలోచింపజేసింది. ‘మన తాతల కాలం నాటి విత్తనాలు ఏమయ్యాయి? అవి ఎక్కడికి పోతున్నాయి?’... ఆ ప్రశ్నే ఈరోజు 500కు పైగా దేశీయ విత్తనాల ఉద్యమంగా మారింది.


రాళ్ల మధ్య పుట్టిన విత్తనాల విప్లవం

తమిళనాడులోని సేలం జిల్లా, కమలాపురం గ్రామానికి చెందిన దొరైరాజ్‌ గోకుల్‌ ఒక రైతు కుటుంబంలో పుట్టాడు. స్కూల్‌ రోజుల నుంచే పొలం పనులు తెలుసు. 2017లో ఓ రోజు గోకుల్‌కు ఒక ఆలోచన వచ్చింది. ‘మా పొలంలో ఎక్కడా దొరకని నాటు కూర గాయలు పెంచాల’ని. కానీ అతని తండ్రి చెరకు, పసుపు, వరి వంటి వాణిజ్య పంటలే పండిస్తుంటారు. ఆయనను ఇబ్బంది పెట్టకుండా, పొలానికి సమీపంలో ఉన్న రాళ్లు రప్పలతో నిండిన భూమిని ఎంచుకున్నాడు. దాదాపు అర టన్ను రాళ్లు తొలగించి, ఆ నేలను ఒక మినీ హోమ్‌గార్డెన్‌గా మార్చాడు. మొదట ఇంటి వంట కోసం కొన్ని స్థానిక కూరగాయలు... తర్వాత అరుదైన, అంతరించిపోతున్న విత్తనాల కోసం అన్వేషణ మొదలుపెట్టి సేకరించాడు.


book7.3.jpgఅర ఎకరానికి లోపే ఉన్న నల్లరేగడి మట్టిలో పూర్తిగా ఆర్గానిక్‌ పద్ధతుల్లో సాగు మొదలైంది. తన పొలం నది సమీపంలో ఉండటంతో ప్రతీ ఏడాది వరద నష్టం వచ్చేది. అయినా వెనుకడుగు వేయలేదు. 2025లో సాగును విస్తరించాలనే తపనతో 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని నాటు విత్తనాల ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు.


దేశీయ కాయగూరల రకాలు...

ప్రస్తుతం గోకుల్‌ రాజ్‌ తోటలో ఐదొందలకు పైగా దేశీయ కాయగూరల రకాలున్నాయి. టమాటా 170 రకాలు, వంకాయలు 90 రకాలు, బెండకాయలు 20 రకాలు, సొరకాయ 50 రకాలు... ఇంకా అనేక రకాల చిక్కుడు, మిర్చి, ముల్లంగి, చిలగడ దుంపలు, ఉల్లిపాయలు, గుమ్మడికాయలు, ఆకుకూరలు, పూలు, మొక్కజొన్న... అన్నీ పురాతన పంటలే. గాలిలో పండే తీగజాతి ఆలుగడ్డలు నుంచి నేల లోపల పండే కంద, పెండలం, నల్ల పసుపు, ముల్లంగి, అరుదైన దుంపజాతులతో అతని పొలం ఒక జీవ వైవిధ్యపు మ్యూజియంలా కనిపిస్తుంది.


book7.4.jpgఅరుదైన కూరగాయలు చూసి ఇరుగు పొరుగు రైతులు, బంధువులు విత్తనాలు అడగడం మొదలు పెట్టారు. మొదట్లో ఉచితంగానే ఇచ్చాడు. ఒక ఏడాది గడిచాక అదే స్వయం ఉపాధిగా మారింది. ప్రస్తుతం అతడు కూరగాయలు కాదు, విత్తనాలే అమ్ముతాడు. ‘‘ఒక విత్తనం... వందల పంటలకు సమానం’’ అన్నది అతని నమ్మకం. ప్రస్తుతం 250కు పైగా విత్తన రకాలను వెదురు బుట్టలు, మట్టి పాత్రల్లో వేపాకులతో సహజంగా భద్రపరుస్తున్నాడు. ఈ సేంద్రీయ విత్తనాల అమ్మకాల ద్వారా నెలకు సగటున రూ.30 వేల నుంచి రూ.40 వేల ఆదాయం పొందుతున్నాడు. ‘‘నేను ఈ పని కేవలం డబ్బు కోసమే చేయడం లేదు. అంతరి స్తున్న విత్తనాలకు జీవం పోసే మార్గమిది’’ అంటున్నాడు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన గోకుల్‌ రాజ్‌ ప్రస్తుతం సామాన్య రైతు మాత్రమే కాదు... ఒక విత్తన సంరక్షకుడు. ఒక జీవ వైవిధ్య యోధుడు. మన దేశీయ విత్తనాలకు కాపలాదారు. భవిష్యత్‌ వ్యవసాయానికి అతను నాటుతున్నది కేవలం పంటలు కాదు... ఆశల విత్తనాలు.

- శ్యాంమోహన్‌, 94405 05858


ఈ వార్తలు కూడా చదవండి:

చందమామ ‘చిన్న’బోతోంది

జీపీ భవనం కోసం అప్పు..సొంత భూమి తనఖా

Read Latest Telangana News and National News

Updated Date - Feb 22 , 2026 | 10:57 AM