Share News

మార్చిలో పానీ మొబైల్ యాప్

ABN , Publish Date - Feb 22 , 2026 | 09:02 AM

ఎవరైనా నీళ్లు వృథా చేస్తుంటే.. చూసి ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉంటున్నారా.? నీటితో వాహనాలు కడిగేవారిపై ఫిర్యాదు చేస్తే స్పందించడం లేదని దిగులు చెందుతున్నారా? ఇక దిగులు వీడండి. మార్చి మొదటి వారంలో వాటర్ బోర్డు ప్రత్యేకంగా పానీ మొబైల్ యాప్ తీసుకురాబోతుంది.

మార్చిలో పానీ మొబైల్ యాప్
Hyderabad Water Board

  • తాగునీరు వృథా చేస్తే క్లిక్‌మనిపించు..!

  • ఫొటోకు రూ.200 బహుమతి

  • పౌరులను భాగస్వామ్యం చేస్తున్న వాటర్ బోర్డు

హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి21 (ఆంధ్రజ్యోతి): ఎవరైనా నీళ్లు వృథా చేస్తుంటే.. చూసి ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉంటున్నారా.? నీటితో వాహనాలు కడిగేవారిపై ఫిర్యాదు చేస్తే స్పందించడం లేదని దిగులు చెందుతున్నారా? ఇక దిగులు వీడండి. మార్చి మొదటి వారంలో వాటర్ బోర్డు ప్రత్యేకంగా పానీ మొబైల్ యాప్ తీసుకురాబోతుంది. ఇళ్లు, అపార్ట్మెంట్, కాలనీల్లో ఎవరైనా తాగునీటిని వృథా చేస్తుంటే.. మీ మొబైల్‌తో ఒక్క ఫొటో క్లిక్ మనిపించి, దానిని పానీ యాప్‌లో ఆప్ లోడ్ చేయండి.. రూ.200 బహుమతిగా పొందండని అధికారులు సెలవిస్తున్నారు.

అయితే, సాంకేతిక పరిజ్ఞానంతో సంబంధిత నివాసాన్ని గుర్తించి వెంటనే పెనాల్టీ విధిస్తామని చెబుతున్నారు. పెనాల్టీ చెల్లించకపోతే ట్యాంకర్ బుక్ కాకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని పేర్కొంటున్నారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి వ్యయ ప్రయాసాల కోర్చి నగరానికి తీసుకొస్తున్న జలాలను నగర వాసులు పెద్దఎత్తున వృథా చేస్తున్నారు. ఒక కిలోలీటర్‌కు రూ.45ల వరకూ ఖర్చు చేసి గృహ కనెక్షన్లకు నెలకు 20కిలోలీటర్ల నీళ్లను ఉచితంగా అందిస్తున్నారు. మరిన్ని అవసరాలకు రూ.10 చొప్పున ఛార్జీ వసూలు చేస్తున్నారు.


నీటి సరఫరా ఆర్థికంగా భారమైనప్పటికీ వినియోగదారులకు మేలు చేకూర్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. కాగా నగరంలో చాలామటుకు ఇళ్లు, వాహనాలు కడుగుతూ తాగునీళ్లను వృథా చేస్తుండడాన్ని వాటర్ బోర్డు అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇకపై నీటి వృథాను అరికట్టేందుకు అధికారులతోపాటు పౌరులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ఇందుకు ప్రత్యేకంగా పానీ యాప్‌ను తీసుకువస్తున్నారు. తాగునీటిని వృథా చేస్తున్న ఫొటో తీసి యాప్‌లో అప్లోడ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లొకేషన్ ఆధారంగా ఇంటిని గుర్తించి వాటర్ బోర్డు అధికారులు జరిమానా విధించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ట్రయల్ నిర్వహిస్తున్న పానీయాప్‌ను మరో పది రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.


ఫొటోకు రూ.200

తాగునీరు వృథా చేసేవారిని గుర్తించి ఫొటో తీస్తే పౌరులకు రూ.200ల ప్రోత్సాహాకాన్ని అందించనున్నారు. నీటిని వృథా చేసేవారిపై పెనాల్టీ విధించగా.. అందులో నుంచే ఒక ఫిర్యాదు ఫొటోకు రూ.200ల చొప్పున చెల్లిస్తామని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. అలాగే నీటి వృథా చేసిన వారికి రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకూ జరిమానా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

పెళ్లికళ వచ్చేసిందే బాలా..

టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హౌస్ అరెస్ట్

Updated Date - Feb 22 , 2026 | 09:05 AM