‘నక్షత్రాలు’ నమిలేద్దాం!
ABN , Publish Date - Feb 22 , 2026 | 07:27 AM
‘జిహ్వకో రుచి’ అన్నట్లుగా మన చుట్టూ అనేక రకాల పండ్లు. ఒక్కోటీ ఒక్కో తీరు. దేని ప్రాముఖ్యత దానిదే. సాధారణంగా ఏ పండునైనా కట్ చేస్తే పొడవు, లేదా గుండ్రని ముక్కలుగా మారుతుంది.
‘జిహ్వకో రుచి’ అన్నట్లుగా మన చుట్టూ అనేక రకాల పండ్లు. ఒక్కోటీ ఒక్కో తీరు. దేని ప్రాముఖ్యత దానిదే. సాధారణంగా ఏ పండునైనా కట్ చేస్తే పొడవు, లేదా గుండ్రని ముక్కలుగా మారుతుంది. అదే ‘స్టార్ ఫ్రూట్’ను కట్ చేస్తే ప్లేటులో నక్షత్రాలు రాలినట్టుగా ఉంటుంది. ఎప్పుడో, ఎక్కడో చూసి ఉంటారు గానీ, చాలామంది ఈ ఫ్రూట్‌ను ట్రై చేసి ఉండరు. పోషక విలువల్లో ‘సూపర్‌స్టార్’గా చెబుతున్న ‘స్టార్ ఫ్రూట్’ విశేషాలివి...
అరటి, ఆపిల్, బొప్పాయి, సపోటా, మామిడి, దానిమ్మ పండ్లు బోర్‌కొడితే... కాస్త భిన్నమైన రుచి కోసం ‘స్టార్ ఫ్రూట్’ బెస్ట్ ఛాయిస్. దీన్నే ‘కారంబోలా’ అని కూడా పిలుస్తారు. పేరుని బట్టి ఇది విదేశీ పండులా అనిపిస్తుంది. కానీ వీటి ఉత్పత్తిలో మనదేశం మూడో స్థానంలో ఉందంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు.
సాధారణంగా లేత ఆకుపచ్చగా ఉండే ‘కారంబోలా’... మగ్గే కొద్దీ క్రమక్రమంగా పసుపుపచ్చ రంగులోకి మారుతుంది. పండు రుచి కూడా లేతగా ఉన్నప్పుడు ఒగరుగా, ఆ తరవాత పుల్లగా, ఆ తరవాత తీపిగా మారడం విశేషం. అడ్డంగా ముక్కలుగా కోసినప్పుడు నక్షత్రాకారంలో ఉంటుంది. అందుకే ‘నక్షత్ర పండు’ అని కూడా అంటారు. పండు గుజ్జు నోట్లో వేసుకోగానే ద్రాక్షను తలపిస్తుంది. ఈ పండుని పెద్దరకాలు, చిన్న రకాలు అని రెండుగా పేర్కొనవచ్చు. పెద్దవి తియ్యగా ఉంటే, చిన్నవి పుల్లగా ఉంటాయి. అన్ని పళ్లలాగానే దేశాలను బట్టి ‘స్టార్ ఫ్రూట్’లో పలు వెరైటీలున్నాయి.
పోషకాల గని...
పెరిగిన డిమాండ్ వల్ల నేడు అన్ని దేశాలలో కారంబోలాను పండిస్తున్నారు. అయితే ఉష్ణమండలాల్లో ఇది ఎక్కువగా పండుతుంది. ఆగ్నేయాసియాలో ఈ పండును విస్తృతంగా పండించడమేగాక ఆఽధునిక తరం వివిధ రూపాల్లో ఇష్టంగా ఆరగిస్తోంది కూడా. అనేక పోషకాల గనిగా స్టార్ ఫ్రూట్‌ను పేర్కొనవచ్చు. సహజసిద్ధమైన యాంటీఆక్సిడెంట్లు, లవణాలు ఈ పండులో అధికంగా ఉన్నాయి. కావునే ఆరోగ్యపరంగా ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. చాలాదేశాల్లో ఈ పండును మూలికగానూ భావిస్తారు. మన దేశంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఈ పండ్లకు సంబంధించి అతిపెద్ద సీజన్. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకూ కొన్ని చోట్ల పంట సాగులోకి వస్తోంది. కానీ ఇది తక్కువ మొత్తమే. ఈ పండు తొందరగా మగ్గుతుంది. కాబట్టి కొన్న రెండు మూడు రోజుల్లోనే తినడం మంచిది.
ఎన్నో రకాలుగా...
మార్కెట్‌లో నిగనిగలాడుతూ కనిపించే స్టార్ ఫ్రూట్‌ను ముందుగా మంచినీటిలో శుభ్రపరచాలి. తొక్క తీసే శ్రమ లేని పండు ఇది. పండు రెండువైపుల చివర్లు కత్తిరించి, ముక్కలుగా కోయాలి. మధ్యలో ఉన్న గింజల్ని తీసేసి ఎంచక్కా తినొచ్చు. ఈ పండును అనేక రూపాల్లో తీసుకొంటున్నారు.
వంటకాలు: ఆసియా దేశాలలో సీఫుడ్, షెల్‌ఫిష్ వంటకాలలో స్టార్ ఫ్రూట్‌ను ఉపయోగిస్తారు. వేరే కూరల్లో కూడా కూరగాయలా వీటిని వాడతారు.
సలాడ్స్: దోరపండుని ముక్కలుగా కోసుకుని సలాడ్స్‌లో భాగం చేసుకోవచ్చు. నిలువచేయడం: చట్నీలు, జామ్‌లు, జెల్లీలు, పుడింగ్‌లుగా మార్చి నిలువ చేయవచ్చు.
వరుగులు: మామిడి, టమాటాల్లాగే స్టార్ ఫ్రూట్‌ను ముక్కలుగా కోసి ఎండలో ఆరబెట్టి వరుగులు చేసుకోవచ్చు.
ద్రావకాలు: పళ్ల రసాలు, స్మూతీలు, కాక్‌టెయిల్స్ గ్లాసులకు అలంకరణగా ఈ పండును ఉంచి తాజాదనాన్ని పొందవచ్చు. ఇతర పండ్లతో కలిపితే తాజాదనాన్ని, శక్తిని అందించే పోషకమయ ద్రావణం సిద్ధం.
ఇవన్నీ కూడా ఆహారపరమైనవైతే... స్టార్ ఫ్రూట్ ఆకుల్ని కొన్నిరకాల చర్మవ్యాధులను తగ్గించడంలో ఉపయోగిస్తారు. వీటి ఆకులు, కొమ్మల్ని పొడిచేసి పూతగా రాస్తారు. అలాగే కొన్ని దేశాల్లో కీళ్ల నొప్పులకూ ఈ ఆకుల రసాన్ని వాడడం విశేషం. ఇంకా పాత్రలకు పట్టిన తుప్పును తొలగించడానికి కూడా ఆకుల్ని వాడతారు.
ఆరోగ్యప్రదాయిని...
‘స్టార్ ఫ్రూట్’ పేరుకు తగ్గట్టే పోషకాల పరంగా కూడా పెద్ద స్టార్ అనే చెప్పాలి. ఈ పండును ఆరగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ: ఈ పండులో అనేక రకాల ప్లాంట్ కాంపౌండ్స్ ఉన్నాయి. వీటికి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. బీటా కెరోటీన్, గాలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్, ప్రీ ఆంథోసియానిడిన్స్ లాంటివి ఉండడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వాపును తగ్గిస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. నరాలకు సంబంధించిన సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. స్టార్ ఫ్రూట్ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల శరీరంలో విటమిన్ ఎ, సి స్థాయులు పెరిగాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

పీచు పదార్థాలు: స్టార్ ఫ్రూట్‌లో పీచు పదార్థాలు ఎక్కువ. ఇవి గట్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇంకా కోలన్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తాయి. మలబద్ధకం తగ్గుతుంది. పేగుల్లో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియాకు పీచుపదార్థాలు ఇంధనంలా పనిచేస్తాయి. కొలెస్ట్రా్ట్రల్‌నూ తగ్గిస్తాయి. రక్తపోటు, చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తాయి. దాంతో గుండె పదిలంగా ఉంటుంది.
కొన్నిరకాల క్యాన్సర్ల నుంచి రక్షణ: స్టార్ ఫ్రూట్‌లో సుమారు 42 మిల్లిగ్రాముల సి విటమిన్ ఉంటుంది. అంటే మనం రోజువారీ తీసుకోవలసిన సి విటమిన్‌లో 50 శాతం ఇది. విటమిన్ సి లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ. ఇది కణాలు దెబ్బతినకుండా పరిరక్షిస్తుంది. విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ప్రోస్టేట్, పాంక్రియాస్, కాలేయం, ఊపిరితిత్తులు తదితర క్యాన్సర్ల బారిన పడకుండా రక్షణ లభిస్తుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
అందుకే ప్రతీరోజూ 75 నుంచి 90 మిల్లీగ్రాముల సి విటమిన్‌ను తీసుకోవాలని శాస్త్రీకరించారు. స్టార్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత సి విటమిన్ అందడమే కాకుండా సంపూర్ణ ఆర్యోగానికి దోహదం చేస్తుంది. అయితే ‘అతి సర్వత్రవర్జయేత్’ అన్న సూత్రం ఈ ఫలానికి బాగా వర్తిస్తుంది. స్టార్ ఫ్రూట్‌ను పరిమితంగా కాకుండా, అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశాలున్నాయి. వాంతులు, కడుపులో నొప్పితో పాటు కిడ్నీలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పండులో ఆక్సలేట్స్ ఉన్నాయి. వీటి సంఖ్య శరీరంలో పెరిగితే కిడ్నీల ఆరోగ్యానికి ప్రమాదకరం. అలాగే కిడ్నీ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవాళ్లు ఈ పండును తినే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. సీజనల్‌గా లభించే స్టార్ ఫ్రూట్‌ను కాస్త పరిమితంగా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఎంచక్కా తినొచ్చు. ఆరోగ్య సంరక్షణలో ‘స్టార్’లా కాంతివంతంగా కనిపించొచ్చు.
మలేషియా నెంబర్‌వన్...
‘స్టార్ ఫ్రూట్’ ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా మలేషియా ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఏటా ఈ దేశంలో లక్షా ఇరవై వేల టన్నుల పండ్లను ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని స్థానికంగా విక్రయించడంతో పాటు చైనా, సింగపూర్, యూరప్, మధ్య ఆసియా దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. తాజా స్టార్ ఫ్రూట్స్‌తో పాటు ప్రాసెస్ చేసిన జామ్‌లు, క్యాండీలను ఎగుమతి చేస్తున్నారు. ఆ తరవాతి స్థానం ఫిలిప్పీన్స్‌దే. అక్కడ ఏటా 70 వేల టన్నుల స్టార్‌ఫ్రూట్‌ను పండిస్తున్నారు. 60 వేల టన్నుల ఉత్పత్తితో భారతదేశం మూడో స్థానంలో ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ పండ్ల ఉత్పత్తిలో ముందున్నాయి.
పోషక విలువలివి...
వంద గ్రాముల స్టార్ ఫ్రూట్‌లో పోషక విలువలు ఈ విధంగా ఉంటాయి...
శక్తి: 26 కిలో క్యాలరీలు
కార్బోహైడ్రేట్‌లు: 5 గ్రాములు
ప్రొటీన్: ఒక గ్రాము
కొవ్వులు: 400 మిల్లీగ్రాములు
పీచుపదార్థాలు: 3 గ్రాములు
సహజ చక్కెరలు: 4 గ్రాములు
ఈ వార్తలు కూడా చదవండి:
జీపీ భవనం కోసం అప్పు..సొంత భూమి తనఖా
Read Latest Telangana News and National News