జీపీ భవనం కోసం అప్పు..సొంత భూమి తనఖా
ABN , Publish Date - Feb 22 , 2026 | 06:22 AM
గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేపట్టడమే పాపమైనట్లుగా.. ఆ మాజీ సర్పంచ్‌కు ఇప్పుడు కష్టాలొచ్చిపడ్డాయి.
లోన్ తీర్చలేదంటూ భూమి వేలానికి వరంగల్ డీసీసీబీ నిర్ణయం
మాజీ మహిళా సర్పంచ్‌కు తప్పని కష్టాలు
కొడకండ్ల, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేపట్టడమే పాపమైనట్లుగా.. ఆ మాజీ సర్పంచ్‌కు ఇప్పుడు కష్టాలొచ్చిపడ్డాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండలం పెద్దబాయితండాకు చెందిన వాంకుడోతు సునీత సర్పంచ్‌గా ఉన్నప్పుడు 2022-23లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేపట్టాలని తలచారు. ఇందుకోసం వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) కొడకండ్ల బ్రాంచ్ నుంచి రూ.5లక్షల లోన్ తీసుకున్నారు. పూచీకత్తుగా సునీత దంపతులు 2.03 ఎకరాల భూమికి సంబంధించి పట్టా పాస్‌బుక్ తనఖా పెట్టి అప్పు తెచ్చారు. రుణ వాయిదాలు ముగిసినందున చట్టం ప్రకారం ఆ భూమిని వేలం వేసి రుణాన్ని వసూలు చేస్తామని స్పష్టం చేస్తూ బ్రాంచ్ మేనేజర్ ప్రకటన విడుదల చేశారు. సర్వే నంబర్లు 348/ఎఫ్/1, 182/కే/1, 175లోని భూములపై లావాదేవీలు జరపకూడదని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం పెద్దబాయితండా గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బ్యాంక్ అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పంచాయతీ భవనం కోసం తెచ్చిన లోన్‌ను వ్యక్తిగతంగా ఎలా కట్టాలంటూ సునీత భర్త రమేశ్ ప్రశ్నించారు. ప్రభుత్వ బిల్లులు రాకముందే తమ భూమిని ఎలా వేలం వేస్తారని ఆవేదన చెందారు.