Share News

తెలుగువారందరూ ఒక్కటే.!

ABN , Publish Date - Feb 22 , 2026 | 07:23 AM

‘‘తెలంగాణ, రాయలసీమ, కోస్తా బిడ్డల సమాహారం హైదరాబాద్‌. కాలానికి తగినట్టు ఆధిపత్యాన్ని ధిక్కరించే ప్రాంతీయ ఉద్యమాలు వస్తాయి, పోతాయి.

తెలుగువారందరూ ఒక్కటే.!

  • ఉద్యమాలు వస్తాయి, పోతాయి.. తెలుగుభాష శాశ్వతం: సీహెచ్‌ విద్యాసాగర్‌రావు

  • మామిడి హరికృష్ణకు పంపన జాతీయ పురస్కారం ప్రదానం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ, రాయలసీమ, కోస్తా బిడ్డల సమాహారం హైదరాబాద్‌. కాలానికి తగినట్టు ఆధిపత్యాన్ని ధిక్కరించే ప్రాంతీయ ఉద్యమాలు వస్తాయి, పోతాయి. అంతిమంగా మనందరి తల్లి భాష తెలుగు శాశ్వతం. తెలుగువారంతా ఒక్కటే..’’ అని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. అక్షరయాన్‌ తెలుగు రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో శనివారం బేగంపేట సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ స్టడీస్‌ (సెస్‌)లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కవి, రచయిత మామిడి హరికృష్ణకు స్వర్ణ కంకణధారణతోపాటు విద్యాసాగర్‌రావు చేతులమీదుగా ‘మహాకవి పంపన జాతీయ పురస్కారం’ ప్రదానం చేశారు. అనంతరం చిలుకూరి శాంతరామ ఉమామహేశ్వరశర్మ దంపతులకు స్ఫూర్తి పురస్కారాన్ని, చరిత్రకారుడు కందకుర్తి యాదవరావుకు విశిష్ఠ సేవా పురస్కారం, వసుంధరరెడ్డికి జానపద విజ్ఞానం పురస్కారాన్ని అందించి సత్కరించారు. మనదైన తెలంగాణ సాహిత్య చరిత్ర లిఖించుకోవాలని, అందులోనూ యుగ విభజన జరగాలని మామిడి హరికృష్ణ ఆకాంక్షించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా తాను అందించిన సేవలతో పాటు సాహిత్య సృజనకు దక్కిన గౌరవం ఈ అవార్డు అని పేర్కొన్నారు. జోస్యుల సదానందశాస్త్రి మాట్లాడుతూ.. పంప భారతం, నన్నయ భారతం మధ్య తులానాత్మక అధ్యయనం చేసిన తనకు విక్రమార్జున విజయం అనువాదానికి నాలుగేళ్లు పట్టిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాగాయని విమలక్క, నిర్వాహకురాలు అయినంపూడి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 07:24 AM