టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హౌస్ అరెస్ట్
ABN , Publish Date - Feb 22 , 2026 | 08:22 AM
కామారెడ్డి పర్యటన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావును పోలీసులు ఆదివారం నాడు హౌస్ అరెస్ట్ చేశారు.
నిజామాబాద్, ఫిబ్రవరి 22: కామారెడ్డి, బాన్సువాడ పర్యటన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావును పోలీసులు ఇవాళ (ఆదివారం) హౌస్ అరెస్ట్ చేశారు. శనివారం నాడు బాన్సువాడ, కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి వేళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి బాన్సువాడ, కామారెడ్డికి వెళ్లేందుకు ఆయన సమాయత్తమయ్యారు. దీంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాంచందర్ రావుని ముందస్తుగా హౌస్ పోలీసులు అరెస్టు చేశారు.
అసలేం జరిగిందంటే..?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఇటీవల జరిగాయి. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆయన తండ్రి కలిసి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల్ని మరో కాలేజీకి కట్టబెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలను నిరూపించాలంటూ కాంగ్రెస్ నేతలను ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇదే అంశంపై కింద స్థాయి నేతలు సైతం సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకున్నారు. ఇక శనివారం సరస్వతీ శిశు మందిర్ వద్దకు ఆధారాలతో రావాలంటూ ఎన్ఎస్‌యూఐ నేత సందీప్‌కు ఎమ్మెల్యే ఫోన్ చేశారు. దాంతో వివాదం మరింత ముదిరింది.
ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత.. బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వచ్చారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు.. ఆ కారును ధ్వంసం చేసి తగులబెట్టారు. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో టీ బీజేపీ చీఫ్ బాన్సువాడ, కామారెడ్డిలో పర్యటించాలని నిర్ణయించారు. దాంతో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీశైలంలో భక్తులకు తృటిలో తప్పిన ప్రమాదం
For TG News And Telugu News