భలే... బ్యాచిలర్స్ బర్త్‌డే!
ABN , Publish Date - Feb 22 , 2026 | 10:09 AM
పాతికేళ్లు వచ్చాయంటే చాలు... తెలిసిన ప్రతీ ఒక్కరు ‘పెళ్లెప్పుడు?’ అని అడిగేస్తుంటారు. ఈ మాటలు ముఖ్యంగా పెళ్లికాని ప్రసాదులను ఇబ్బంది పెడు తుంటాయి.
పాతికేళ్లు వచ్చాయంటే చాలు... తెలిసిన ప్రతీ ఒక్కరు ‘పెళ్లెప్పుడు?’ అని అడిగేస్తుంటారు. ఈ మాటలు ముఖ్యంగా పెళ్లికాని ప్రసాదులను ఇబ్బంది పెడు తుంటాయి. అయితే డెన్మార్క్ బ్యాచిలర్స్ గురించి తెలిస్తే ‘మన దగ్గరే నయం’ అంటా రెవరైనా. ఇంతకీ... పాతికేళ్లు వచ్చినా పెళ్లి కాకుంటే డెన్మార్క్‌లో ఏం చేస్తారో తెలుసా?
ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంస్కృతి సంప్రదాయాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని వందల ఏళ్లుగా వస్తున్న ఆచారాలను ఇప్పటి తరం కొనసాగిస్తుండటమే విశేషం. డెన్మార్క్‌లో అలాంటి సంప్రదాయం ఒకటి ఉంది. కాకపోతే కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. అక్కడ పాతికేళ్లు వచ్చినా పెళ్లికాకపోతే స్నేహితులందరూ కలిసి సరదాగా పుట్టిన రోజు నాడు దాల్చిన చెక్క పొడిని ఒళ్లంతా జల్లుతారు. కొన్ని వందల ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడంటే పాతికేళ్లు వచ్చినా పెళ్లికి ఇంకా సమయం ఉందని అంటున్నారు. ఉద్యోగం సంపాదించుకుని ఆర్థికంగా కాస్త స్థిరపడిన తరువాతే పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. ముప్ఫై ఏళ్లు వస్తే కానీ పెళ్లికి సిద్ధపడటం లేదు.
పుట్టిన రోజున...
పాతికేళ్లు వచ్చాయి. ఇంకా పెళ్లి కాలేదా? అంతే... పుట్టిన రోజు వేడుక ‘సీన్’ మారి పోతుంది. కేక్ కటింగ్ స్థానంలో దాల్చిన చెక్క పొడి వచ్చేస్తుంది. స్నేహితులందరూ కలిసి బర్త్‌డే బాయ్‌ని దాల్చిన చెక్క పొడితో నింపేస్తారు. కొన్నిచోట్ల ఏకంగా ఒక పోల్‌కు కట్టేసి, దాల్చిన చెక్క పొడితో ముంచేస్తారు. దాల్చిన చెక్క పొడి ఒంటికి బాగా అంటుకునేలా నీళ్లు కూడా చల్లుతారు. కొన్నిసార్లు కోడిగుడ్లను కూడా కలుపుతారు. ఒకవేళ ముప్ఫై ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోతే దాల్చిన చెక్క పొడి స్థానంలో మిరియాల పొడిని అప్‌గ్రేడ్ చేస్తారట.
అంటే బర్త్‌డే బాయ్‌పై మిరియాల పొడి చల్లుతారు. పుట్టినరోజు నాడు సరదా కోసం ఈ కార్యక్రమం చేస్తారు. ఈ సంప్రదాయం కొన్ని వందల ఏళ్ల నుంచి అక్కడ కొనసాగుతూ వస్తోంది. యువకులకు మాత్రమే ఈ ఆచారం వర్తిస్తుందని అనుకుంటే పొరపాటు. యువతులకు కూడా ఇదే విధంగా బర్త్‌డే సెలబ్రేషన్ చేస్తారు. దాల్చిన చెక్క పొడి దులుపుకొంటే పోతుంది. కానీ కోడిగుడ్డు కలిస్తే అంత సామాన్యంగా వదలదు. మా స్నేహం కూడా అంతే అని తెలియజేయడానికి కొందరు కోడిగుడ్డు వాడతారు.
ఎలా మొదలైందంటే...
ఈ విచిత్ర ఆచారం డెన్మార్క్‌లో 16వ శతాబ్దంలో మొదలైందని చెబుతారు. అప్పట్లో డానిష్ తెగకు చెందిన యువకులు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ నగరాల మధ్య ఎక్కువ ప్రయాణాలు చేస్తుండేవారు. దాంతో సమయానికి వారికి పెళ్లిళ్లు అయ్యేవి కావు. ముప్ఫై ఏళ్లు దాటినా బ్యాచిలర్స్‌గా ఉండిపోయే వారు. వారిపై దాల్చిన చెక్క పొడిని చల్లడం ద్వారా వ్యాపారం మాత్రమే కాదు, పెళ్లి కూడా ముఖ్యమే అని గుర్తు చేసినట్లు ఉండేదట. అది కాస్త కాలక్రమంలో సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది.
సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసే సేల్స్ మ్యాన్‌లను ‘పెప్పర్ డ్యూడ్స్’ అని, ‘పెప్పర్ బ్యాచిలర్స్’ అని పిలుస్తారు. అదే యువతులైతే ‘పెప్పర్ మైడెన్స్’ అని పిలుస్తారు. దాల్చిన చెక్క పొడిని చల్లడం ఇతర దేశస్థులకు అవమానిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ డెన్మార్క్ జాతీయులు మాత్రం స్నేహానికి, ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రతీకగా చూస్తారు. డెన్మార్క్‌లో అబ్బాయిల పెళ్లి వయసు సగటు 34 కాగా, అమ్మాయిల వయసు 32గా ఉంది. అంటే నవతరంలో దాల్చిన చెక్క పొడి బారిన పడేవారు అధికంగానే ఉంటారన్నమాట.
ఈ వార్తలు కూడా చదవండి:
జీపీ భవనం కోసం అప్పు..సొంత భూమి తనఖా
Read Latest Telangana News and National News