Share News

స్కూలు పుస్తకంలో తన కథే ఓ పాఠంగా..!

ABN , Publish Date - Jul 26 , 2026 | 09:23 AM

తల్లి నుంచి విడిపోయిన అడవి ప్రాణిని కాపాడి, ప్రేమతో పెంచిన ఓ కుటుంబం. వారి మానవత్వం, ప్రకృతి పట్ల బాధ్యత... ఇప్పుడు కోట్లమంది విద్యార్థులు చదివే పదో తరగతి పాఠ్యపుస్తకంలో ఓ పాఠంగా చేరింది!

స్కూలు పుస్తకంలో తన కథే ఓ పాఠంగా..!
Assam wildlife, baby civet rescue

తల్లి నుంచి విడిపోయిన అడవి ప్రాణిని కాపాడి, ప్రేమతో పెంచిన ఓ కుటుంబం. వారి మానవత్వం, ప్రకృతి పట్ల బాధ్యత... ఇప్పుడు కోట్లమంది విద్యార్థులు చదివే పదో తరగతి పాఠ్యపుస్తకంలో ఓ పాఠంగా చేరింది!

అది 2009వ సంవత్సరం. అస్సాంలోని నాగావ్‌ జిల్లా, టెటెలిసోరా గ్రామం. విపరీతమైన గాలులు. పొడుగాటి కొబ్బరి చెట్టుపై నున్న గూడు నుంచి ఓ పునుగుపిల్లి పిల్ల కింద పడిపోయింది. అప్పటికి అది పుట్టి 15 రోజులు దాటి వుండదు. తల్లి ఎక్కడా కనిపించలేదు. ఆకలి, భయంతో వణికిపోతోంది. తల్లిపాలు లేకుండా బతకడం అసాధ్యం. జాలిపడిన ఊరిజనం దాన్ని స్థానిక వన్యప్రాణి సంరక్షకుడైన ధరిణి సైకియా దగ్గరకు తీసుకువెళ్లారు. నది ఒడ్డున ఉన్న తాటాకు ఇంట్లో ధరిణి భార్య అంజలి తన ఆరునెలల బిడ్డ గిబన్‌కి పాలు ఇస్తోంది. కళ్లు ఇంకా పూర్తిగా తెరవని ఆ చిన్ని పునుగు పిల్లిని చూసి ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. ‘నా మూడో బిడ్డలా చూసుకుంటాను’ అని అనుకుంది. ప్రేమతో దానికి తన చనుబాలు ఇచ్చి, ప్రాణం నిలిపింది. అలా ఆ పునుగు పిల్లిని మూడు నెలలపాటు సాకటంతో అది కోలుకుంది. దానికి ‘భకత్‌’ అనే పేరు పెట్టారు.


book4.2.jpgఆ చిన్నారి పునుగు (ఏషియన్‌ పామ్‌ సివెట్‌) ఇల్లంతా స్వేచ్ఛగా తిరిగేది. చెట్లమీద కెక్కి ఎంత తిరిగినా, ఇంట్లోకి వచ్చేసేది. చిన్నారి గిబన్‌తో పాటు సరదాగా ఆడుకునేది. ఆ కుటుంబం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంట వెళ్లేది. ఊళ్లో అందరూ ఆ అనుబంఽధాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. ఈ విషయం డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌ రోమెల్‌ షణ్ముగానికి తెలిసింది. అక్కడి వెళ్లి పది రోజులు ఆ కుటుంబంతో గడిపి ఎన్నో ఫొటోలూ, వీడియోలూ తీశాడు. కొంతకాలానికి ఆ పునుగుపిల్లికి తనదైన సహజ పరిసరాల్లో, వాతావరణంలో నివసించే అవకాశం ఇవ్వాలని... అటవీశాఖ సహాయంతో దాన్ని అడవిలో వదిలేశారు. రోజులు గడిచేకొద్ది భకత్‌ కథ నెమ్మదిగా మరుగునపడింది.


book4.3.jpgఆహ్లాదకర ఆశ్చర్యం

ఈలోగా చిన్నారి గిబన్‌ పెరిగి పెద్దయ్యి, టెన్త్‌ క్లాస్‌కు వచ్చాడు. ఈ ఏడాది ఎన్‌సీఈ ఆర్‌టీ ఇంగ్లిష్‌ వర్క్‌బుక్‌లో ‘వర్డ్స్‌ అండ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌-2’ తెరిచి చదువుతుంటే.. అతడి కళ్లు ఆనందాశ్చర్యాలతో పెద్దవయ్యాయి. కారణం... తన తండ్రి ఫొటో! తననూ, తన చిన్నప్పటి నేస్తం పునుగుపిల్లినీ ఎత్తుకుని వున్న ఫొటో అది! మరో ఫొటోలో చిన్నప్పుడు తమ అన్నదమ్ముల మధ్య నిద్రిస్తున్న భకత్‌! ‘ధరిణి లేకపోతే నేను బతికి ఉండేదాన్ని కాదు’ అంటూ అది తన కథ చెపుతున్నట్టుగా ఆ ‘బేబీ భకత్‌’ పాఠం సాగింది. తల్లిదండ్రుల దగ్గరకు పరుగెత్తుకెళ్లి... పుస్తకంలో పాఠం సంగతి చెప్పాడా అబ్బాయి. నిజానికి ఆ తొలి నెలల జ్ఞాపకాలు అతడికి గుర్తు లేవు. తల్లిదండ్రులు చెబితే గానీ ఆ ఫొటోల్లో తాను ఉన్నానని గ్రహించలేదు. తాను స్కూల్లో చదివే పాఠ్యపుస్తకంలో తమ కుటుంబ గాథే పాఠంగా ఉండటం ఏ విద్యార్థికైనా నమ్మశక్యంగా ఉండదు కదా! అస్సాంలోని మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన... దేశవ్యాప్తంగా విద్యార్థులు చదివే పాఠ్యాంశంగా మారటం స్థానికులను సంతోషంలో ముంచెత్తింది.


book4.4.jpgఅపోహలెన్నో...

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే... పునుగుపిల్లులు అడవికి రైతుల్లాంటివి. పండ్లు తిన్న తర్వాత వాటి విత్తనాలను అడవిలో వివిధ ప్రాంతాలకు వ్యాప్తి చేస్తాయి. దాంతో కొత్త మొక్కలు వేర్వేరు ప్రాంతాల్లో పెరుగుతాయి. ఎలుకలను నియంత్రించి పంటలకు కూడా పరోక్షంగా మేలుచేస్తాయి. అందుకే అవి కనిపిస్తే... ఆ ప్రాంతంలోని అడవి ఆరోగ్యంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తారు.

ప్రాణి సంరక్షణ అనేది తరచూ చిన్న దయ తోనే ప్రారంభమవుతుందని దేశవ్యాప్తంగా ఉన్న తరగతి గదుల్లో ఈ కథ గుర్తుచేస్తోంది. అసలిది కేవలం ఒక జంతువు రక్షణను కాకుండా ప్రకృతి... మనుషుల మధ్య అపూర్వ సంబంధం, త్యాగం, ప్రేమలను చాటుతోంది. పునుగు పిల్లులపై సమాజంలో ఎన్నో మూఢనమ్మకాలున్నాయి. ‘సమాధులు తవ్వేది’ అనే అర్థంలో దిల్లీలో వీటిని ‘కబర్‌ బిజ్జు’ అని వ్యవహరిస్తారు. కోల్‌కతాలో ‘భమ్‌’ (పిల్లలను ఎత్తుకువెళ్లేది), మహారాష్ట్రలో ‘కాందేచోర్‌ ’ (ఉల్లిపాయల దొంగ) అనీ పిలుస్తారు. ఈ అపోహలను తొలగించుకుని, వాటిని ప్రేమించాలని నేర్పుతుందీ పాఠం. ఒక చిన్న ప్రాణిపై చూపే కరుణ... ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి భకత్‌ పాఠమే ఉదాహరణ.


book4.5.jpgమీకు తెలుసా?

- పునుగుపిల్లి ఎర్రచందనం, గంధపు చెక్కలకు తన గ్రంథుల నుంచి వచ్చే జవాది (పునుగు) అనే సుగంధ ద్రవ్యాన్ని అంటిస్తుంది. ఆ సమయంలో దాని చర్మం ద్వారా వెలువడే పదార్థమే పునుగు తైలం. దీని ఖరీదు చాలా ఎక్కువ.

- ఇవి కాఫీ కాయలను తిని గింజలను విసర్జిస్తాయి. ఈ గింజలతో తయారు చేసిన కాఫీకి చాలా డిమాండ్‌ ఉంది.

- పరిమళ ద్రవ్యాల్లో ఉపయోగించే కస్తూరి కోసం వేటాడటం వల్ల వీటి మనుగడకు ముప్పుగా మారాయి. అందుకే మనదేశంలో ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయి.


book4.6.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

భయం నీడలో మీడియా!

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 26 , 2026 | 09:30 AM