అలా... పాట నా ప్రాణమైంది!
ABN , Publish Date - Jul 26 , 2026 | 07:44 AM
జాస్మిన్ శాండ్లస్... పాటల పల్లకీలో ఊరేగుతూ, లైవ్‌షోలతో దుమ్మురేపుతోంది. ‘ధురంధర్’ పాటలతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఈ పంజాబీ గాయని ఇటీవల స్టేజీపైనే తన కాబోయే భాగస్వామిని ప్రేక్షకులకు పరిచయం చేసి చర్చనీయాంశంగా మారింది.
జాస్మిన్ శాండ్లస్... పాటల పల్లకీలో ఊరేగుతూ, లైవ్‌షోలతో దుమ్మురేపుతోంది. ‘ధురంధర్’ పాటలతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఈ పంజాబీ గాయని ఇటీవల స్టేజీపైనే తన కాబోయే భాగస్వామిని ప్రేక్షకులకు పరిచయం చేసి చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న కబుర్లివి...
ఆ పాట పాడింది నేనే
‘ధురంధర్’లోని సూపర్‌హిట్ సాంగ్ ‘శరారత్’ ఎంతగా హిట్టయ్యిందో అందరికీ తెలుసు. ఆ పాట పాడటమే కాదు... రాసింది కూడా నేనే అని చాలా తక్కువమందికి తెలుసు. ఈ పాటకన్నా ముందే నేను తెలుగులో కూడా పాటలు పాడాను. మెగాస్టార్ నటించిన ‘ఖైదీ నంబర్ 150’లో దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో ‘రత్తాలు.. రత్తాలు’ అంటూ తెలుగు తెరకు పరిచయమయ్యా.
దైవభక్తి ఎక్కువే...
నాకు దైవ భక్తి ఎక్కువ. విదేశాల నుంచి ఇండియాకి వచ్చాక అది ఎక్కువైంది. ఉజ్జయినీలోని మహాకాళేశ్వర ఆలయ సందర్శన చేసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యా. నాకు తెలియకుండానే ఏడ్చేశా. అలాగే బృందావన్‌కి వెళ్లినప్పుడు ఆ రాధ, రాణి పిలిచినట్లు అనిపించింది. అక్కడి నుంచి వచ్చే ముందు రాధాకృష్ణుల ప్రతిమ తెచ్చుకున్నా. నిద్రపోయే ముందు, నిద్ర లేవగానే కృష్ణుడిని చూస్తే ప్రశాంతంగా ఉంటుంది.
వేల పాటలు రాశా..
నాకు పాటలు రాయడమంటే పిచ్చి. అందుకే నా చేతిలో ఎప్పటికీ ఒక పుస్తకం ఉంటుంది. నా ఫీలింగ్స్ అన్నింటికీ అక్షర రూపం ఇస్తా. కొన్నిసార్లు ఒక లైన్ రాస్తా... ఒక్కోసారి పాట మొత్తం ఒకేసారి రాసేస్తుంటా. పుస్తకం అందుబాటులో లేకపోతే నా ఫోన్‌లో రికార్డ్ చేసుకుంటా. నేను పాట రాస్తున్నంతసేపు దేవుళ్లు నా పక్కనే నిలబడి రాయించినట్లు ఫీలవుతా.
అది పూర్తిగా నా వ్యక్తిగతం...
ఢిల్లీలో సంగీత కచేరీ జరుగుతున్నప్పుడు వేలాదిమంది అభిమానుల మధ్య... నాకు కాబోయే భర్త శేఖర్ చౌదరిని పరిచయం చేశా. మాకు నిశ్చితార్థం కూడా జరిగిందని వేలికి ధరించిన ఉంగరం చూపించా. దాంతో అతను ఏం చేస్తాడు? ఎవరు? అంటూ ఆరాలు తీస్తున్నారు. అతని గురించి నేను ఇప్పుడే ఎవరికీ చెప్పదలుచుకోలేదు. అది పూర్తిగా నా వ్యక్తిగతం. కాకపోతే నన్ను ఇన్‌స్టాలో ఫాలో అయ్యేవాళ్లకు అతను సుపరిచితుడే.
అమ్మానాన్న కష్టాలు...
ఇండియాలో ఉన్నప్పుడు మా పరిస్థితి బాగుంది. మేము న్యూయార్క్‌లో దిగేటప్పటికీ నా వయసు 12 ఏళ్లుంటాయి. అమెరికా వెళ్లాక నాన్న కుటుంబ పోషణ కోసం గ్యాస్ స్టేషన్‌లో పనిచేసేవారు. అమ్మ కూడా చెర్రీస్ ఏరే కూలీగా పని చేసి కుటుంబాన్ని ఆదుకుంది. కొన్ని రోజుల తర్వాత నాన్న కోర్టులో పంజాబీ నుంచి ఇంగ్లీష్‌లో అనువదించే లీగల్ ఇంటర్‌ప్రెటర్‌గా మారిన తర్వాత... మా జీవితం మారింది. ఆ సమయంలో స్నేహితులు లేకపోవడంతో పాటల్ని ఆశ్రయించా. అలా పాట నా ప్రాణమైంది.
సంగీతమే నా ప్రపంచం...
నాకు చిన్నతనం నుంచే సంగీత ప్రపంచం తెలుసు. నా పదహారవ ఏట పంజాబీలో ‘ముస్కాన్’ పేరుతో తొలి మ్యూజిక్ ఆల్బమ్ వచ్చింది. ఆ తర్వాత డైమండ్, ఇల్లీగల్ వెపన్, గులాబీ... ఇలా వరుస ప్రైవేట్ ఆల్బమ్స్ చేశా. 2014లో సల్మాన్‌ఖాన్ నటించిన ‘కిక్’లో ‘యార్ నా మిలే’ పాటతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టా. అభిమానులు నన్ను ‘గులాబీ క్వీన్’ అని పిలుస్తారు. ఇటీవలే ‘ది డ్రీమ్ గర్ల్ ఇండియా’ పేరుతో దేశమంతా కన్సర్ట్‌లను విజయవంతంగా పూర్తి చేశా.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News