Share News

ఎస్‌బీఐ క్యాప్స్‌ కమిటీని నియమించండి

ABN , Publish Date - Jul 26 , 2026 | 06:08 AM

మెట్రో మొదటి దశ యాజమాన్య బదిలీకి సహకరించాలని, ఆస్తుల మదింపు కోసం ప్రతిపాదించిన ఎస్‌బీఐ క్యాప్స్‌ కమిటీని త్వరగా నియమించాలని..

ఎస్‌బీఐ క్యాప్స్‌ కమిటీని నియమించండి

  • కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖకు సీఎస్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌ సిటీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మెట్రో మొదటి దశ యాజమాన్య బదిలీకి సహకరించాలని, ఆస్తుల మదింపు కోసం ప్రతిపాదించిన ఎస్‌బీఐ క్యాప్స్‌ కమిటీని త్వరగా నియమించాలని కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు కోరారు. సీఎంరేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎస్‌.. కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో మెట్రో మొదటిదశ పనులు చేపట్టిన ఎల్‌అండ్‌టీ నుంచి ప్రాజెక్టును టేకోవర్‌ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మెట్రో ఆస్తులు, అప్పులు, కమర్షియల్‌ భవనాలతోపాటు మెట్రో రైల్‌ కార్యకలాపాలపై మరోసారి పరిశీలించిన తర్వాతనే అనుమతుల విషయాన్ని ఆలోచిస్తామని, ఇందుకోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ కమిటీని నియమిస్తామని గత జూన్‌ 24న కేంద్ర మంత్రులు తెలిపారు. ఈ ప్రకటన చేసి నెల గడిచినా ఇప్పటి వరకు కమిటీ ఏర్పాటు కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నిరుత్సాహానికి గురవుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎస్‌, మెట్రో ఎండీలు ఢిల్లీకి వెళ్లి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులను కలిసినట్లు తెలిసింది. ఎస్‌బీఐ క్యాప్స్‌ కమిటీని ఎప్పుడు నియమిస్తారు? ఎందుకు ఆలస్యం జరుగుతోంది? అనే వివరాలను తెలుసుకున్నట్లు సమాచారం.

Updated Date - Jul 26 , 2026 | 06:09 AM