Share News

భయం నీడలో మీడియా!

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:19 AM

అప్పుడు తప్పు అన్నవాళ్లు ఇప్పుడు ఒప్పు అంటున్నారు. అప్పుడు ఒప్పు అన్నవాళ్లు ఇప్పుడు తప్పు అంటున్నారు. నాడు అన్నా హజారే ఆమరణ దీక్ష చేయగా నేడు సోనమ్‌ వాంగ్‌ చుక్‌ దీక్ష చేశారు. అప్పుడు కేంద్రంలో...

భయం నీడలో మీడియా!

అప్పుడు తప్పు అన్నవాళ్లు ఇప్పుడు ఒప్పు అంటున్నారు. అప్పుడు ఒప్పు అన్నవాళ్లు ఇప్పుడు తప్పు అంటున్నారు. నాడు అన్నా హజారే ఆమరణ దీక్ష చేయగా నేడు సోనమ్‌ వాంగ్‌ చుక్‌ దీక్ష చేశారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ఉండగా ఇప్పుడు నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. నాటి ప్రభుత్వం ఉద్యమకారుల డిమాండ్లకు తలొగ్గి ఉన్నత స్థానాల్లో అవినీతిని అరికట్టేందుకు లోక్‌పాల్‌ బిల్లును తీసుకురాగా, నేటి ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ విషయంలో మాత్రం తెగేదాకా లాగి, చివరకు అంగీకరించింది. అప్పుడు అన్నా హజారేకు తోడుగా నిలిచిన అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆ తర్వాత ఆమ్‌ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేసి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎదిగి ప్రస్తుతం మాజీ సీఎంగా మిగిలారు– ఇప్పుడు బొద్దింకల జనతా పార్టీ అని ప్రకటించుకున్న అభిజీత్‌ దీప్కే రేపు ఏమవుతారో తెలియదు. నీట్‌ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రం లీక్‌ అవడంతో ప్రారంభమైన ప్రస్తుత ఉద్యమం ఇప్పుడు తీవ్రమై దేశ రాజకీయాలను కుదిపేసింది. రాజకీయంగా అత్యంత బలశాలి అని అందరూ భావిస్తున్న ప్రధాని మోదీ ఒక మెట్టు దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించక తప్పలేదు. విద్యార్థుల కోసం విద్యార్థులతో ప్రారంభమైన ఈ ఉద్యమం ప్రతిపక్షాల చేతికి ఆయుధం అందించింది. అన్నా హజారే దీక్ష వల్ల లోక్‌పాల్‌ చట్టం వచ్చినా దేశంలో ఉన్నత స్థానాల్లో అవినీతి ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు సోనమ్‌ వాంగ్‌ చుక్‌, అభిజీత్‌ దీప్కే వంటి వారి వల్ల ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసినా ప్రశ్నపత్రాల లీకేజీలు ఆగిపోతాయని చెప్పలేము. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అభిజీత్‌ దీప్కే అనే దళిత యువకుడు ప్రకటించిన కాక్రోచ్‌ జనతా పార్టీ ఈ స్థాయిలో ప్రభావం చూపడం ఏమిటి? సోనమ్‌ వాంగ్‌చుక్‌ ప్రారంభించిన ఆమరణ దీక్షకు యువత భారీగా స్పందించడానికి కారణం ఏమిటి? ఢిల్లీ జంతర్‌ మంతర్‌లో అన్ని వేల మంది పోగవడానికి ఏమిటి కారణం? వంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ కావడం దారుణం అనే అనుకుందాం. అయితే ఆ సంఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని నీట్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహించింది. ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. అంటే వివాదం అంతటితో ముగిసినట్టే కదా? అయినా నీట్‌ పరీక్ష పేరిట వివాదం ఇంకా సజీవంగా ఉండటం ఏమిటి? అంటే యువతలో ఈ స్థాయిలో అసంతృప్తి నెలకొనడానికి వేరే కారణం ఏదో ఉంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్షాలను ముప్పుతిప్పలు పెడుతూ ప్రశ్నించే గొంతులను కట్టడి చేయగలిగిన ప్రధాని మోదీ, ఇప్పుడు మాత్రం ఒక మెట్టు దిగడానికి కారణం ఏమిటి? దీన్నిబట్టి మన దేశంలో రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని స్పష్టమవుతోంది. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కుదురుకోకపోవడం ఏమిటి? నిన్నటి వరకు ప్రజలకు పెద్దగా పరిచయం లేని అభిజీత్‌ దీప్కే అనే యువకుడు కాక్రోచ్‌ జనతా పార్టీని ప్రకటించడం ఏమిటి? వేల మంది యువతీ యువకులు బొద్దింకలుగా మారి ఢిల్లీని చుట్టుముట్టడం ఏమిటి? అని ప్రశ్నించుకుంటే ప్రజల్లో ఏ స్థాయిలో అసహనం గూడుకట్టుకుందో అర్థమవుతుంది.


న్యాయ వ్యవస్థ వైఖరితో..

ఈ మొత్తం ఉదంతం నేపథ్యంలో ఆత్మవిమర్శకు ఏ ఒక్క వ్యవస్థ కూడా మినహాయింపు కాదని స్పష్టమవుతోంది. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన నాలుగు వ్యవస్థలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలపై ప్రజలు ఇదివరకే విశ్వాసం కోల్పోగా, ఇప్పుడు న్యాయ వ్యవస్థ, మీడియాపై కూడా విశ్వాసం కోల్పోతున్నారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తమను దగా చేస్తున్నాయని భావిస్తున్న ప్రజలకు న్యాయ వ్యవస్థ–మీడియా వద్ద కూడా ఉపశమనం లభించడం లేదా? అని ప్రశ్నించుకుంటే అవుననే సమాధానం వస్తోంది. యువతను బొద్దింకలతో పోల్చుతూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో కాక్రోచ్‌ జనతా పార్టీ పుట్టుకురావడం, ఆ పార్టీకి యువత ఆకర్షితులు కావడం ఏమిటి? అని ప్రశ్నించుకుంటే అన్ని వేళ్లూ న్యాయ వ్యవస్థ వైపే చూపుతున్నాయి. అధికారానికి న్యాయ వ్యవస్థ లొంగిపోయిందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం తాజాగా చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్టుగా ఉన్నాయి. యువతను బొద్దింకలతో పోల్చడంపై విమర్శలు చెలరేగినా సంయమనం పాటించకుండా, ఇప్పుడు జంతర్‌ మంతర్‌ వద్ద పోలీసుల లాఠీచార్జి దెబ్బలను వీక్షించాలన్న పిటిషనర్‌ వినతిపై స్పందిస్తూ, తమకు అంత సమయం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నేటి తరానికి ఓపిక తక్కువ అని రెచ్చగొట్టే విధంగా సుప్రీంకోర్టు తాజాగా మరో వ్యాఖ్య చేసింది. సమయం, సందర్భం చూసుకోకుండా సర్వోన్నత న్యాయస్థానం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సమస్య మరింత జటిలం అవుతోంది. ప్రజల్లో కోల్పోతున్న విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించాల్సింది పోయి అసందర్భ వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోయడం ఏమిటి? ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధిత ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిన గురుతర బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంది. న్యాయ వ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోందన్న భావన ప్రజల్లో విస్తృతంగా వ్యాపించిన ప్రస్తుత తరుణంలో న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాల్లో ఉండేవారు చేసే వ్యాఖ్యల ప్రభావం సమాజంపై బలంగా ఉంటుంది కదా? అయినా యథాలాపంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యం కాదా? జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేస్తున్నవారు పోలీసులపై దాడి చేశారా? పోలీసులే ఆందోళనకారులను దారుణంగా కొట్టారా? అన్న విషయం పక్కన పెడితే, సదరు వీడియోలను చూసే సమయం తమకు లేదని న్యాయవ్యవస్థ వ్యాఖ్యానించడం యువతను రెచ్చగొట్టడం కాదా? దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గమనంలోకి తీసుకోవలసిన బాధ్యత న్యాయ వ్యవస్థపై లేదా? యువతను బొద్దింకలతో పోల్చినందుకే కాక్రోచ్‌ జనతా పార్టీ పుట్టుకొచ్చిన విషయం విస్మరిస్తే ఎలా? ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం అంతరించింది. ఈ కారణంగానే అభిజీత్‌ దీప్కే అనే అనామకుడు ప్రకటించిన కాక్రోచ్‌ జనతా పార్టీకి యువత మద్దతు ఇస్తోంది. తెరపైకి వచ్చిన నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ అంశం మాత్రమే మనకు కనిపిస్తోంది గానీ దీని వెనుక ప్రజల్లో, ముఖ్యంగా యువతలో గూడుకట్టుకున్న నిరాశా నిస్పృహలను ప్రస్తుత పరిణామాలు ఎత్తిచూపుతున్నాయి. అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం తెరమరుగైనట్టుగానే ఇప్పుడు కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమం కూడా మటుమాయం కావొచ్చు.


అయితే ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పేరుకుపోతున్న నిరాశా నిస్పృహలు అలాగే మిగిలి ఉంటాయి. ఫలితంగా ఏ చిన్న సంఘటన జరిగినా ఆందోళనలు పుట్టుకురావొచ్చు. కొత్త సంస్థలు, పార్టీలు ఆవిర్భవించవచ్చు. ఎవరెవరో నాయకులుగా ఎదగవచ్చు. నాడు అన్నా హజారే చేపట్టిన ఉద్యమం వల్లనే అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకుడిగా ఎదిగారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆవిర్భవించింది. అయితే అదే కేజ్రీవాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై జైలుకు కూడా వెళ్లారు. కేజ్రీవాల్‌ అవినీతికి పాల్పడ్డారా? లేదా? అన్నది ఎప్పటికి తేలుతుందో తెలియదు. అయితే ఇలాంటి సంఘటనల వల్ల ప్రజలు ఎవరినీ నమ్మలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితులలో ప్రజలకు మిగిలిన ఏకైక ఆశా దీపం న్యాయ వ్యవస్థ మాత్రమే. ఇప్పుడు ఆ న్యాయ వ్యవస్థ కూడా అసందర్భ ప్రేలాపనలతో ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసుకుంటోంది. దేశంలోని వివిధ హైకోర్టుల న్యాయమూర్తులు ఇటీవల చేసిన వ్యాఖ్యలను బట్టి సర్వోన్నత న్యాయ స్థానంపై వారికి కూడా నమ్మకం పోతున్నట్టుగా ఉంది. ఈ పరిణామం ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

మీడియాకు ఏమైంది?

ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా విషయానికి వద్దాం. మిగతా వ్యవస్థలపై విశ్వాసం కోల్పోయినట్టుగానే ప్రజలు ఇప్పుడు మీడియాపై కూడా నమ్మకం కోల్పోతున్నారు. ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద చోటుచేసుకున్న సన్నివేశాలే ఇందుకు నిదర్శనం. జాతీయ మీడియా అని మనం పిలుచుకొనే హిందీ–ఇంగ్లిషు వార్తా చానళ్ల ప్రతినిధులను జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనకారులు ఎద్దేవా చేశారు. ‘గోదీ మీడియా గో బ్యాక్‌’ అని నినాదాలు చేశారు. మీడియాపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు అనడానికి ఇదొక సంకేతం. ఈ విషయంలో ప్రధాన బాధ్యత మీడియాదే. ప్రభుత్వాలకు భయపడి సమస్యలను ప్రధాన మీడియా తొక్కి పెడుతోంది అన్న భావన ఇప్పుడు ప్రజల్లో విస్తృతంగా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన మీడియా తన స్వతంత్రతను కోల్పోయిందన్న భావన ప్రజల్లో ఏర్పడింది. ప్రముఖ మీడియా సంస్థలు అదానీ, అంబానీల చేతుల్లోకి వెళ్లిపోవడం కూడా ఇందుకు ఒక కారణం. గతంలో అన్నా హజారే దీక్ష చేపట్టినప్పుడు మీడియాపై ఒత్తిళ్లు లేవు. ఫలితంగానే ప్రజలకు వాస్తవాలు తెలిశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి లోక్‌పాల్‌ బిల్లు తీసుకురావడానికి అంగీకరించింది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌, బొగ్గు కుంభకోణం, 2జీ స్పెక్ట్రం వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మీడియా సంస్థలు భయం నీడలో పనిచేస్తున్నాయి. ప్రభుత్వాలను ఎదిరించి నిలబడలేని స్థితిలో ఉన్నాయి. అయోధ్య రామమందిరానికి ప్రజలు ఇచ్చిన విరాళాలు చోరీకి గురైనా జాతీయ మీడియా పెద్దగా పట్టించుకోకపోవడం కూడా ఇందులో భాగమే. నీట్‌ వ్యవహారం కూడా అంతే. కాక్రోచ్‌ జనతా పార్టీని ప్రధాన మీడియా పట్టించుకోకపోయినా సోషల్‌ మీడియా భుజాన వేసుకుంది. అయితే సోషల్‌ మీడియా వల్ల ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి ఉంటుంది. దీనికి ఇప్పుడు ఏఐ తోడైంది. జంతర్‌ మంతర్‌ వద్ద యువత చేస్తున్న దీక్ష విషయమే తీసుకుందాం. దీక్ష చేస్తున్నవాళ్లు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడినట్టుగా బీజేపీ మద్దతుదారులు వీడియోలను సోషల్‌ మీడియాలో పెట్టగా, ఆందోళనకారులపై పోలీసులు అమానుషంగా దాడి చేసినట్టుగా కాక్రోచ్‌ జనతా పార్టీ మద్దతుదారులు అనేక వీడియోలను చూపిస్తున్నారు. దీంతో తప్పు ఎవరి వైపు ఉందో తెలుసుకోలేని పరిస్థితి! ఉన్నది ఉన్నట్టుగా చూపించాల్సిన ప్రధాన మీడియా వివిధ కారణాల వల్ల ఆ పని చేయడం లేదు. వివిధ సందర్భాలలో సమస్యలను కప్పిపుచ్చడం వల్ల అవి పెరిగి పెద్దవవుతున్నాయి.


సోనమ్‌ వాంగ్‌చుక్‌ ప్రారంభించిన దీక్షకు ప్రారంభంలోనే అన్నా హజారే చేసిన దీక్షకు ఇచ్చినట్టుగా కవరేజీ ఇచ్చి ఉంటే ప్రభుత్వం అప్పుడే చర్యలు తీసుకొని ఉండేది కదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే కాదని చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీడియా సంస్థలపై ఒత్తిడి తెచ్చి సమస్యలను కప్పిపెడితే అవి ముగిసిపోవని, లోలోపల రగులుతూ ఉంటాయని ప్రభుత్వాలు గ్రహించాలి. కాక్రోచ్‌ జనతా పార్టీ ఆందోళనలే ఇందుకు నిదర్శనం. పరిస్థితి చేయి దాటిపోతోందని ఇప్పుడు గ్రహించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్‌ వాంగ్‌చుక్‌తో ముందుగానే చర్చలు జరిపి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు కదా? ఆయన దీక్షను మీడియా సంస్థలు కూడా పట్టించుకోలేదు. దీంతో సమస్య ముదిరే దాకా దాని తీవ్రత తెలియలేదు. సోషల్‌ మీడియా ఇంతలా విస్తరించిన ఈ కాలంలో ఏ విషయాన్ని కూడా దాచిపెట్టలేమని ప్రభుత్వాలు, ప్రధాన మీడియా సంస్థలు గ్రహించాలి. సమస్య ఏదైనా సకాలంలో గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అవశ్యం.

ఆత్మపరిశీలన తక్షణావసరం!

యువత బొద్దింకలుగా మారి దేశ రాజధాని ఢిల్లీని చుట్టుముట్టే పరిస్థితి ఎందుకొచ్చింది? ఇప్పుడు చర్చలు అంటూ రంగప్రవేశం చేసిన కేంద్ర మంత్రులు సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్షను ప్రారంభించిన మొదట్లోనే ఈ పని చేసి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు కదా? ప్రశ్నపత్రాలు లీక్‌ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అనేక సందర్భాలలో జరిగాయి. దశాబ్దాల క్రితం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మంత్రులు రాజీనామా చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. తెలుగునాట గాలి ముద్దుకృష్ణమ నాయుడు విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడితే రాజీనామా చేశారు. కాల క్రమంలో ప్రశ్నపత్రాల లీకేజీ పరిపాటిగా మారింది. మంత్రుల రాజీనామాలకు ఇప్పటిలా ఆయా సందర్భాలలో ఆందోళనలు జరగలేదు. ఎవరూ దీక్షలు చేయలేదు కూడా. ఇప్పుడే ఈ సమస్య ఎందుకొచ్చిందంటే– ప్రజల్లో, ముఖ్యంగా యువతలో నిరాశా నిస్పృహలు పెరిగిపోతున్నాయని గ్రహించాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నాలుగు మూల స్తంభాలు తమ బాధ్యతల నుంచి దూరం జరగడం కూడా ప్రస్తుత దుస్థితికి కారణం. ఈ నేపథ్యంలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలతో పాటు న్యాయ వ్యవస్థ, మీడియా కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు కాబట్టి ప్రస్తుత సమస్య తాత్కాలికంగా సమసిపోతే పోవచ్చు గానీ ప్రధాన వ్యవస్థలు తమ బాధ్యతను గుర్తించి మెలగని పక్షంలో మరో సమస్య వచ్చినప్పుడు ఆందోళనలు ఊపందుకుంటాయి. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉన్నందువల్లే మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం.


దానిలో భాగమైనవాటిని బలహీనపరచుకుంటూ పోతే ప్రజాస్వామ్యం మనుగడే ప్రమాదంలో పడుతుంది. వ్యవస్థలకు వ్యతిరేకంగా కాకుండా వాటిల్లో జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి పోరాడవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. కాక్రోచ్‌ జనతా పార్టీ కోరుతున్నది అదే కనుక అందులో అభ్యంతరం చెప్పాల్సింది ఏమీ లేదు. రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒక సామాన్యుడైన అభిజీత్‌ దీప్కే ప్రారంభించిన కాక్రోచ్‌ జనతా పార్టీ వెనుక నిలబడాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందో రాజకీయ పార్టీలు ప్రశ్నించుకోవాలి. సామాన్య ప్రజలు చేపట్టిన ఆందోళనకు దిగి రావాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో పాలకులు కూడా గ్రహించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను, ప్రత్యర్థులను భయపెడుతూ ఎంతో కాలం మనుగడ సాగించలేమని పాలకులు గుర్తించాలి. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం కాదు– ప్రజాస్వామ్యం మౌలిక సూత్రాలను ఆచరించి అమలు చేస్తామన్న నమ్మకాన్ని పాలకులు ప్రజల్లో కల్పించినప్పుడు సమస్యలు ఆదిలోనే పరిష్కారం అవుతాయి. అటువంటి ప్రజాస్వామిక వాతావరణంలో బొద్దింకలు పుట్టుకురావని పాలకులు తెలుసుకోవాలి!

ఆర్కే

ఈ వార్తలనూ చదవండి:

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

Updated Date - Jul 26 , 2026 | 12:19 AM