ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మారుతున్న పరిణామాలు
ABN , Publish Date - Jul 25 , 2026 | 04:29 PM
కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత న్యూఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత న్యూఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీకి రావాలని మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌కు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం షిండేకు కూడా ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. కీలక నేతలకు హైకమాండ్ పిలుపుతో రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. కేంద్రం భారీ మార్పులకు సిద్ధం అవుతోందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో సీఎం మార్పు జరుగబోతోందని అన్నారు. ఫడణవీస్‌కు కేంద్ర విద్యాశాఖను ఇవ్వబోతున్నారని చెప్పారు.
కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కొంత కాలంగా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేయాలని కేంద్రం భావించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ప్రధాని విదేశీ పర్యటనల కారణంగా ఈ ప్రక్రియ కొంతకాలం పాటు వాయిదా పడినట్టు సమాచారం. ఇక పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రధాన్ సహా ఇతర మంత్రులు తప్పుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈలోపు విద్యార్థుల నిరసనలు మిన్నంటాయి. విపక్షలా నిరసనల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పార్లమెంటు కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే వాయిదా పడుతోంది.
తాజాగా విద్యాశాఖ మంత్రి తప్పుకోవడంతో ఆ శాఖ ఎవరికి కేటాయిస్తారన్న ఉత్కంఠ మొదలైంది. ఇతర ప్రభుత్వ శాఖల విషయంలో ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది. నిన్న రాత్రి కేంద్రం 12 శాఖల సెక్రటరీలకు స్థాన చలనం కలిగించింది. వారిలో విద్యాశాఖ సెక్రటరీ కూడా ఉన్నారు. దీంతో, మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై కేంద్రం పూర్తిస్థాయి దృష్టి పెట్టనుందా? అన్న చర్చ జరుగుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
కేంద్రానికి యువత గుణపాఠం చెప్పింది: ప్రియాంక గాంధీ
ప్రియురాలితో మాట్లాడుతున్నాడని సహోద్యోగి హత్య..