పనీర్ పదనిసలు...
ABN , Publish Date - Jul 26 , 2026 | 08:22 AM
రెస్టారెంట్‌కు వెళితే పాలక్ పనీర్, పనీర్ 65, గార్లిక్ పనీర్, చిల్లీ పనీర్ వంటి పలురకాల వంటకాలు నోరూరిస్తాయి.
రెస్టారెంట్‌కు వెళితే పాలక్ పనీర్, పనీర్ 65, గార్లిక్ పనీర్, చిల్లీ పనీర్ వంటి పలురకాల వంటకాలు నోరూరిస్తాయి. అంతేనా... పనీర్‌తో చేసే పరోటా, కథీ రోల్, పిజ్జా వంటివి పిల్లలకు ఆల్‌టైమ్ ఫేవరెట్. అందుకే హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి పనీర్ వంటింట్లోకి కూడా వచ్చేసింది. వంటింట్లో పనీర్ వంటకాల ఘుమఘుమలు ఇంటిల్లిపాదికి తెగ నచ్చేస్తున్నాయి. అయితే మార్కెట్లో లభించే పనీర్‌లో కల్తీలు రాజ్యమేలుతున్న తరుణంలో కాస్త అప్రమత్తత అవసరమే.
భారతీయ వంటకాల్లో పనీర్‌ది ప్రత్యేక స్థానం. ఉత్తరాదివారే కాకుండా దక్షిణాదిలో కూడా స్టార్టర్‌గా, స్నాక్‌గా, మెయిన్ కోర్సు వంటకాల్లో భాగంగా పనీర్‌ను విరివిగా వాడటం చూడొచ్చు. పాలను విరగ్గొట్టి, దానిని పలుచని వస్త్రంలో వడగట్టి, నీరంతా పిండేయాలి. వస్త్రంతో సహా పనీర్‌ను చదరపు ఆకారంలో మడిచి, దానిపై బరువైన రాయి, లేదా గిన్నెను పెడితే చక్కని పనీర్ తయారవుతుంది. పాలను విరగ్గొట్టడానికి సాధారణంగా నిమ్మరసం, వెనిగర్‌ను వినియోగిస్తారు. పనీర్‌కు ఉన్న డిమాండ్ వల్ల మార్కెట్‌లో రెడీమేడ్ ప్యాకెట్లు లభిస్తున్నాయి.
ఏది అసలు? ఏది నకిలీ??
విషాదం ఏమిటంటే... నిత్యం వివిధ రకాల వంటల్లో వాడే పనీర్ కూడా కల్తీకి గురవుతోంది. అందుకే పనీర్‌ను కొనేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నమ్మదగ్గ బ్రాండ్ల పనీర్‌ను చూసి మాత్రమే కొనడం మంచిది. ప్యాకెట్ మీద ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) లైసెన్స్ ఉందో లేదా చెక్ చేసుకోవాలి. వాసన పసిగట్టడం మరచిపోకూడదు. చాలా తక్కువ ధర ఉన్న పనీర్‌ను కొనకుండా ఉండడమే మంచిది. ఏది మంచి పనీర్? ఏది కల్తీది? అనేది సులభంగానే పసిగట్టవచ్చు. మంచి పనీర్‌ను గుర్తించేందుకు ఇళ్లల్లోనే చేసుకునే చిన్న చిన్న పరీక్షలున్నాయి. అవేమిటంటే...
నీళ్ల పరీక్ష: తాజాగా తీసుకున్న పనీర్‌ను గిన్నెలోని నీటిలో వేస్తే అది అడుగుకు చేరాలి. నీళ్లలో తేలుతోందంటే మాత్రం అది సహజసిద్ధమైన పనీర్ కాదని గుర్తించాలి.

అయోడీన్ పరీక్ష: పనీర్‌ను అయిదు నిమిషాలు నీళ్లలో ఉడికించి, చల్లారాక దానిపై కొన్ని అయోడిన్ చుక్కలు వేయాలి. ఒకవేళ అది నీలం రంగులోకి మారితే అందులో స్టార్చ్ ఉందని, కల్తీ అయ్యిందని లెక్క.
కందిపప్పు పరీక్ష: పనీర్‌ను నీటిలో కాసేపు ఉడికించి, పూర్తిగా చల్లార్చాలి. ఓ పనీర్ ముక్కని కందిపప్పు మీద పది నిమిషాలు పెడితే అది రంగు మారకుంటే మంచి పనీరని అర్థం. అదే ఎర్ర రంగులోకి మారితే అందులో హానికారక పదార్థాలు ఉన్నాయని అర్థం.
నిమ్మరసం పరీక్ష: పనీర్ మీద నిమ్మరసం వేస్తే అందులోంచి బుడగలు బుడగలుగా వస్తే అది కల్తీదని అర్థం.
వేడి పరీక్ష: ఓ బాణలిలో పనీర్ ముక్కని వేడి చేస్తే, ఎలాంటి నూనె పదార్థాలను విడుదల చేయకుండా పనీర్ శుద్ధంగా కరిగితే అది మంచిదని... ఒకవేళ చాలా నూనె పదార్థాలని విడుదల చేస్తే అది కల్తీదని ఇట్టే గ్రహించవచ్చు.
రుచితో పాటు ఆరోగ్యం...
ఇక పనీర్‌తో చేసే వంటకాల విషయానికొస్తే... ఇంటర్నెట్‌లో సర్చ్ చేస్తే వందల వెరైటీల వంటకాల లిస్టు కనిపిస్తుంది. పనీర్‌కే ఉండే ప్రత్యేకమైన తేలికపాటి పాల తత్వం వల్ల వనమూలికలు, సుగంధద్రవ్యాలు, కూరగాయలు, పండ్లు... ఇలా ఏ కాంబినేషన్‌తో అయినా పనీర్ వంటకాల్ని తక్కువ సమయంలోనే హాయిగా తయారుచేసుకోవచ్చు. అందుకే పనీర్‌ను ‘మిక్స్‌డ్ సూపర్‌స్టార్’ అని సరదాగా పిలుస్తారు.
కేవలం ‘పాలక్ పనీర్’, ‘పనీర్ టిక్కా’ అనే కాదు... ఇష్టమైన కాంబినేషన్లలో వెరైటీ వంటకాలను ఎన్నింటినో చేసుకోవచ్చు. పనీర్‌తో చేసే వంటకాలకు టైం పెద్దగా పట్టదు. అలాగే పనీర్‌ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. పనీర్‌ను హెల్దీతో పాటు టేస్టీ అని కూడా అంటారు.

ఎముకల నిర్మాణంలో: పనీర్‌లో క్యాల్షియం, విటమిన్ డి అధికంగా ఉంటాయి. ఇవి రెండూ కూడా ఎముకల నిర్మాణంలో ఉపయోగపడేవే. దంతాల ఆరోగ్యానికి కూడా పనీర్ దోహదపడుతుంది. కండరాల నిర్మాణంలో, నాడీవ్యవస్థ చక్కని పనితీరుకు క్యాల్షియం మంచిది.
క్యాన్సర్ నివారిణి: పనీర్‌లో స్పింగోలిపిడ్స్, అధిక మొత్తంలో ప్రొటీన్లు ఉండడం వల్ల ప్రొస్టేట్, కొలన్ క్యాన్సర్‌లు రాకుండా నివారిస్తుందని శాస్త్రపరిశోధనలు తెలియజేస్తున్నాయి.

బరువు తగ్గేందుకు: మిగతా కొవ్వుల్లా కాకుండా పనీర్‌లో ఫ్యాటీ యాసిడ్స్ చిన్న చిన్న గొలుసుల్లా ఉంటాయి. అందుకే ఇది సులభంగా జీర్ణమవుతుంది. అంటే పనీర్ తీసుకోవడం వల్ల కొవ్వు శరీరంలో నిల్వ కాకుండా... వెంటనే జీర్ణమై తక్షణ శక్తిని విడుదల చేస్తుంది. పైగా కాస్త పనీర్ తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. చాలా సేపటి వరకు ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి పనీర్ మంచిది. ఇందులోని ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీయాసిడ్స్ వల్ల కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వాళ్లకి ఉపశమనం లభిస్తుంది. గర్భిణుల ఆరోగ్యానికీ పనీర్ ఎంతో మేలు చేస్తుంది.

జీర్ణ వ్యవస్థ పనితీరుకు: పనీర్‌లో ఎక్కువ మొత్తంలో ఖనిజాలు ఉండడం విశేషం. ఇందులో ఉన్న మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి ఖనిజాల వల్ల చక్కగా జీర్ణం అవుతుంది. రక్తపోటును పొటాషియం అదుపులో పెడుతుంది. పనీర్ తీసుకోవడం వల్ల గుండెపోటు నివారించవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇంకా పొటాషియం శరీరంలో ద్రావణాల్ని నిలుపుతుంది. దీనివల్ల కండరాల నొప్పి రాకుండా నివారించవచ్చు. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు పనీర్ తినడం ద్వారా ఆ సమయంలో వచ్చే కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

చర్మ సంరక్షణ: పనీర్‌కు సంబంధించి మరో గొప్ప విషయం ఇందులో సెలీనియం ఉంటుంది. కాంతివంతమైన చర్మానికి సెలీనియం ఎంతో అవసరం. హిమోగ్లోబిన్ శాతం పెరగాలన్నా పనీర్‌ను ఆశ్రయించాల్సిందే. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. పిల్లలకు పనీర్ తినిపించడం వల్ల వారి ఎదుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది.
చక్కెర వ్యాధి నివారణ: సాధారణంగా మధుమేహం ఉన్నవాళ్లు పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటారు. కానీ పనీర్‌లో మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో పెడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువ కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
ఇలా పనితీరులో ఉన్న విశేష గుణాలు, వండడంలో సౌలభ్యం వల్ల యమ్మీ ఆహారంగా పనీర్ నేడు విస్తృతంగా వినియోగంలోకి వచ్చింది. కాకపోతే కొనేముందు కాస్త జాగ్రత్తగా పరిశీలించి తీసుకుంటే... అసలైన పనీర్ మజాను అన్ని కాలాల్లో ఎంచక్కా ఆస్వాదించొచ్చు.
వేగన్ పనీర్
పనీరంటేనే గేదె లేదా ఆవు పాల నుంచి తయారుచేసేది. అయితే ఈమధ్య వేగన్ పద్ధతిలో పనీర్‌లు వచ్చేశాయి. లాక్టోస్ పడని వాళ్లకి చక్కని ఛాయిస్ వేగన్ పనీర్. పైగా ఇందులో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. వేగన్ పనీర్‌లు ఎలా ఉంటాయంటే...
ప్లాంట్ పనీర్: సోయా, కొబ్బరి, ఆల్మండ్స్‌తో ఈ పనీర్‌ను తయారుచేస్తారు.
జీడిపప్పు పనీర్ : ఆల్మండ్స్, జీడిపప్పు, వాల్‌నట్ ఆయిల్స్‌తో తయారుచేస్తారు.
తోఫు: పూర్తిగా సోయాతో తయారుచేయడం వల్ల ఇందులో ప్రొటీన్ శాతం చాలా ఎక్కువ. ఇటీవల ఇళ్లల్లో ఎక్కువగా ఈ పనీర్‌ను వాడుతున్నారు. ఇందులో గ్లూటెన్ ఫ్రీ, కొలెస్ట్ర్లాల్ ఫ్రీ ఆప్షన్లు కూడా మార్కెట్‌లో లభిస్తున్నాయి.
పోషకాలివే...
వంద గ్రాముల పనీర్‌లో...
శక్తి: 265 క్యాలరీలు
కొవ్వులు: 20.8 గ్రాములు
ప్రొటీన్లు: 18.3 గ్రాములు
కార్బోహైడ్రేట్‌లు: 1.2 గ్రాములు
క్యాల్షియం: 208 మిల్లిగ్రాములు
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News