జేఎస్జేడీ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు..
ABN , Publish Date - Jul 26 , 2026 | 07:53 AM
జన శక్తి జనతా దళ్ (జేఎస్జేడీ) అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్‌కు జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. పాట్నాలో నీట్ పేపర్ లీక్ అంశంపై శనివారం విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
బిహార్: జన శక్తి జనతా దళ్ (జేఎస్జేడీ) అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్‌కు జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. పాట్నాలో నీట్ పేపర్ లీక్ అంశంపై శనివారం విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం దక్ బంగ్లా చౌరాహా సమీపంలో అదుపులోకి తీసుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. దీంతో ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను బేయూర్ సెంట్రల్ జైలుకు తరలించారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారం, ఢిల్లీలో విద్యార్థుల అణచివేత వంటి చర్యలను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు, సామాజిక సంస్థలు శనివారం బిహార్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో పాట్నా రోడ్లపైకి వేలాది మంది విద్యార్థులు, యువత వచ్చారు. ఈ సందర్భంగా నిరసనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారి హింసాత్మక ఘటనలకు దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసు వాహనాలపై నిరసనకారులు దాడి చేశారు. వాటిని ధ్వంసం చేసి తలగబెట్టారు. ట్రాఫిక్ లైట్లను సైతం పగలకొట్టారు.
ఈ సమయంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా జేఎస్జేడీ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ నిరసనలో పాల్గొన్నారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఆయన పాట్నాలోని రామ్ గులామ్ చౌక్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తేజ్ ప్రతాప్ డిమాండ్ చేశారు. వారి డిమాండ్లు న్యాయమైనవేనని, తమ పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పారు. అవసరమైతే విద్యార్థులు, యువత కోసం ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
రామ్ గులామ్ చౌక్‌కు చేరుకున్న పోలీసులు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, నేడు కోర్టుకు సెలవు కావడంతో సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తేజ్ ప్రతాప్ తరఫు న్యాయవాది తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
వాంగ్‌చుక్ దీక్ష.. ఉద్యమానికి ఊపిరి
ఎస్‌బీఐ మేనేజర్‌పై దాడి.. కేంద్ర మాజీ మంత్రి కుమార్తెపై కేసు నమోదు..