Share News

కార్పొరేట్‌ జీవితం.. ఎప్పటికీ ముగియని పరీక్ష!.. బెంగళూరు మహిళ పోస్టు వైరల్‌

ABN , Publish Date - Aug 30 , 2026 | 09:02 PM

బెంగళూరులో మూడేళ్లుగా ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ.. కార్పొరేట్‌ ఉద్యోగ జీవితంలోని ఒత్తిడిని స్కూల్ పరీక్షలతో పోలుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు లువురు నెటిజన్లను ఆకట్టుకోవడం సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కార్పొరేట్‌ జీవితం.. ఎప్పటికీ ముగియని పరీక్ష!.. బెంగళూరు మహిళ పోస్టు వైరల్‌
Corporate Life Feels Like School Exams

ఇంటర్నెట్ డెస్క్: పాఠశాల రోజుల్లో పరీక్షలంటే ఒక రకమైన భయం. పరీక్షకు ముందు రోజు ఏం చదవాలో, ఇంకా ఎంత సిలబస్‌ మిగిలిందోననే ఆందోళన. పరీక్ష పూర్తయ్యే వరకు మనసులో ఏదో తెలియని ఒత్తిడి. ఉద్యోగంలో చేరాక ఆ భయం పోతుందని చాలామంది అనుకుంటుంటారు. కానీ కొందరికి కార్పొరేట్‌ జీవితం కూడా సరిగ్గా అలాంటి అనుభూతినే కలిగిస్తోందట. బెంగళూరుకు చెందిన ఓ మహిళ చేసిన సోషల్‌ మీడియా పోస్ట్ ప్రస్తుతం పలువురు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


బెంగళూరులో మూడేళ్లుగా ఉద్యోగం చేస్తున్న చారు గుప్తా అనే మహిళ.. కార్పొరేట్‌ ఉద్యోగ జీవితంలోని ఒత్తిడిని స్కూల్ పరీక్షలతో పోలుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. 'మూడేళ్లుగా ఉద్యోగం చేస్తున్నా.. ఇప్పటికీ నేను స్కూల్‌లోనే ఉన్నట్లు, పరీక్షలు రాస్తున్నట్లు అనిపిస్తోంది' అని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగ జీవితంలో రోజూ ఓ పరీక్షలా అనిపిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. 'ఈ రోజును ఎలాగైనా గడిపేయాలి.. రేపటి పరీక్షకు మరింత సన్నద్ధమవుతాను' అనే ఆలోచనతో రోజులు గడుస్తున్నాయన్నారు.


పని ఒత్తిడి వారాంతాల్లోనూ వెంటాడుతోందని చారు తెలిపారు. శని, ఆదివారాల్లో సెలవులే అయినా.. ల్యాప్‌టాప్‌లో పూర్తి చేయాల్సిన పనులే గుర్తుకొస్తాయని ఆమె చెప్పారు. పనిచేయాల్సి ఉందని ఆందోళనతో పడుతూనే.. దాన్ని మొదలుపెట్టేందుకు మాత్రం మనసు రాకపోవడం మరో సమస్యగా మారుతోందని వివరించారు. 'ఆదివారం రాత్రి వచ్చే వరకు ఆందోళన, భయం వెంటాడుతూనే ఉంటాయి. ఇక వేరే మార్గం లేదనిపించినప్పుడు ల్యాపీ ఓపెన్అ చేసి అత్యవసరమైన పనులు పూర్తిచేసి మూసేస్తాం. ఆ తర్వాత.. రేపటి రోజును కూడా ఎలాగైనా గట్టెక్కించేలా చూడమని దేవుణ్ని ప్రార్థిస్తాం. నేనిలా ఎందుకు ఉన్నాను?' అని తనను తాను ప్రశ్నించుకున్నారామె.


సోషల్ మీడియాలో వైరల్ అయిన చారు గుప్తా పోస్టుకు నెటిజన్లు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. 'ఇదే మా పరిస్థితి.. శనివారం అంటేనే ఎంతో ఇష్టం. మరుసటి రోజు ఆఫీసు ఉండదు కదా!' అని ఒకరు వ్యాఖ్యానించగా, 'ఇది అచ్చం పరీక్ష రాస్తున్నట్లే ఉంటుంది. కానీ తేడా ఏంటంటే ఇక్కడ ఇతరులను అడిగి సాయం తీసుకోవచ్చు' అని కామెంట్ చేశారు. తాము చేసిన పనికి సరైన ప్రశంసలు దక్కకపోవడం, అదే సమయంలో ఇతరులు తమ పనిపై ఆధారపడి ప్రయోజనం పొందడం కూడా ఉద్యోగుల్లో నిరాశకు కారణమవుతోందని మరికొందరు స్పందించారు.


పని పూర్తికాకపోతే ఏమవుతుందోనన్న భయం.. పూర్తిచేయాలనే ఒత్తిడి.. చేయాల్సిన పనిని చివరి నిమిషం వరకు వాయిదా వేయడం.. ఆ తర్వాత హడావుడిగా పూర్తి చేయడం.. మళ్లీ మరుసటి రోజు గురించి ఆందోళన చెందడం. ఈ రకమైన సైకిల్ చాలామంది ఉద్యోగుల జీవితంలో సాధారణంగా మారిందని నెటిజన్ల ద్వారా తెలుస్తోంది. స్కూల్లో పరీక్షలు ముగిశాక విద్యార్థులకు విరామం లభిస్తుంది. కానీ ఉద్యోగ జీవితంలో మాత్రం ఒక పని పూర్తైన వెంటనే మరో పని, మరో గడువు ఎదురవుతూనే ఉంటుంది. అందుకే 'కార్పొరేట్‌ లైఫ్‌ అంటే ఎప్పటికీ ముగియని పరీక్షలాంటిదే' అన్న చారు గుప్తా పోలిక నెటిజన్లను ఇంతగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.


ఇవీ చదవండి:

ప్లాస్టిక్ భూతం మధ్యన బోసిపోయిన రావిచెట్టు

షార్ప్‌ బ్రెయిన్‌ కావాలా?.. రోజువారీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి..

Updated Date - Aug 30 , 2026 | 09:35 PM