Share News

మేఘాలయ రాజ'కీ'యం.. బీజేపీలో విలీనం దిశగా యూడీపీ ఎమ్మెల్యేలు

ABN , Publish Date - Aug 30 , 2026 | 06:06 PM

మేఘాలయలో యూడీపీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. యూడీపీలో అసంతృప్తి పెరుగుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి.

మేఘాలయ రాజ'కీ'యం.. బీజేపీలో విలీనం దిశగా యూడీపీ ఎమ్మెల్యేలు

ఇంటర్నెట్ డెస్క్: మేఘాలయ రాజకీయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయా? ఎమ్మెల్యేలను విలీనం చేసుకోవడం ద్వారా అసెంబ్లీలో బీజేపీ తమ బలాన్ని పెంచుకోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ప్రతిపక్ష పార్టీల నుంచి కాకుండా, మిత్రపక్షానికి చెందిన శాసనసభ్యులే పార్టీ ఫిరాయించేందుకు సిద్ధమవుతున్నారనే ఆరోపణలు వస్తుండటం కొసమెరుపు.


మేఘాలయలో యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ(యూడీపీ)కి చెందిన 9 మంది శాసనసభ్యులు, బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. యూడీపీలో అసంతృప్తి పెరుగుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. సీఎం కాన్‌రాడ్ సంగ్మాకు అత్యంత సన్నిహితుడిగా భావించే పార్టీ అధ్యక్షుడు మెట్‌బా లింగ్డోపై పలువురు శాసనసభ్యులు అసంతృప్తిగా ఉన్నారనే ఆరోపణలూ ఉన్నాయి. అంతేకాకుండా యూడీపీ ఎమ్మెల్యేలు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మధ్య ఇటీవల జరిగిన భేటీతో ఈ ఊహానాలకు మరింత బలం చేకూరినట్టైంది. కానీ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(FCRA), ఇతర అంశాలకు సంబంధించిన అంశాలపైనే చర్చ జరిగిందని యూడీపీ తెలిపింది.


కాగా.. అక్కడ బీజేపీ లాగే యూడీపీ కూడా అధికార ఎన్‌పీపీ నేతృత్వంలోని కూటమిలో భాగం. 60 మంది శాసనసభ్యులున్న అసెంబ్లీలో యూడీపీకి 12 మంది, బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ కనీసం 8 మంది శాసనసభ్యులు ఫిరాయిస్తే, మూడింట రెండొంతుల మెజారిటీని సాధిస్తారు కాబట్టి ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అధిగమించే అవకాశముంది. అప్పుడు బీజేపీ బలం రెండంకెల సంఖ్యకు చేరుతుంది. ఇదే జరిగితే.. బీజేపీకి మంత్రి పదవుల్లో అధిక వాటా ఇవ్వాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.


ఇవీ చదవండి:

ప్లాస్టిక్ భూతం మధ్యన బోసిపోయిన రావిచెట్టు

షార్ప్‌ బ్రెయిన్‌ కావాలా?.. రోజువారీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి..

Updated Date - Aug 30 , 2026 | 07:31 PM