Share News

రష్యాకు పెట్రోల్ సరఫరాదారుగా భారత్.. రిఫైనరీలపై దాడులతో ఇంధన కొరత..

ABN , Publish Date - Aug 30 , 2026 | 05:53 PM

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యా ఇప్పుడు పెట్రోల్ కోసం భారత్‌పై ఆధారపడుతోంది. రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు పెరగడంతో దేశీయ పెట్రోల్ ఉత్పత్తి భారీగా దెబ్బతింది.

రష్యాకు పెట్రోల్ సరఫరాదారుగా భారత్.. రిఫైనరీలపై దాడులతో ఇంధన కొరత..
India petrol exports to Russia

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యా ఇప్పుడు పెట్రోల్ కోసం భారత్‌పై ఆధారపడుతోంది. రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు పెరగడంతో దేశీయ పెట్రోల్ ఉత్పత్తి భారీగా దెబ్బతింది. దీంతో మాస్కో విదేశాల నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో భారత్ కీలక సరఫరాదారుగా మారింది (India petrol exports to Russia).


ఇంధన రంగ విశ్లేషణ సంస్థ వొర్టెక్సా ప్రకారం.. జూన్, జులై నెలల్లో భారత్ నుంచి రష్యాకు దాదాపు 10 లక్షల బ్యారెళ్ల పెట్రోల్ సరఫరా అయింది. ఆగస్టులోనూ ఈ సరఫరా కొనసాగినట్లు సమాచారం. ఆగస్టులో రష్యా సముద్ర మార్గంలో దిగుమతి చేసుకున్న పెట్రోల్ రోజుకు సగటున 1.25 లక్షల బ్యారెళ్ల రికార్డు స్థాయికి చేరింది. భారత్‌తో పాటు టర్కీ, మొరాకో కూడా రష్యాకు పెట్రోల్ సరఫరా చేస్తున్నాయి. అయితే ఆ రెండు దేశాలతో పోల్చితే భారత్ నుంచి సరఫరా భారీగా జరిగింది (Russia fuel shortage).


గుజరాత్‌లోని వడినార్ రిఫైనరీ నుంచి రష్యాకు చమురు ఎగుమతి జరుగుతోంది. ఈ రిఫైనరీని నయారా ఎనర్జీ నిర్వహిస్తోంది. ఇందులో రష్యాకు చెందిన చమురు దిగ్గజం రోస్‌నెఫ్ట్‌కు సుమారు 49 శాతం వాటా ఉంది. భారత్ భారీగా రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. అదే చమురును భారత్‌లోని రిఫైనరీల్లో శుద్ధి చేసి పెట్రోల్‌ను తిరిగి రష్యాకే ఎగుమతి చేస్తున్నారు. రష్యాలో ముడి చమురు కొరత లేదు. అసలు సమస్య రిఫైనింగ్ సామర్థ్యం (Russia petrol imports).


రష్యా చమురు శుద్ధి కేంద్రాలు, ఇంధన మౌలిక వసతులపై ఉక్రెయిన్ వరుసగా డ్రోన్ దాడులు చేస్తోంది (India Russia oil trade). జులై, ఆగస్టు నెలల్లో రష్యా రిఫైనరీలపై 32 దాడులు జరిగినట్లు 'వొర్టెక్సా' తెలిపింది. అంటే దాదాపు ప్రతి రెండు రోజులకు ఒక దాడి జరిగినట్టే. ఈ దాడుల కారణంగా రష్యా దేశీయ పెట్రోల్ ఉత్పత్తి భారీగా పడిపోయింది. రిఫైనరీలు దెబ్బతినడంతో ముడి చమురు ఉన్నప్పటికీ దాన్ని అవసరమైన స్థాయిలో పెట్రోల్‌గా మార్చలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన సరఫరాపై పరిమితులు విధించాల్సి వచ్చింది.


ఇవి కూడా చదవండి..

బ్యాంకులు, ఆసుపత్రులు, నైట్‌క్లబ్‌లలోనూ పెళ్లి రిజిస్ట్రేషన్.. చైనాలో ఎందుకిలా చేస్తున్నారంటే..


పెళ్లి రద్దు చేశారని దారుణం.. యువతి, ఆమె సోదరిపై యాసిడ్ దాడి..

Updated Date - Aug 30 , 2026 | 05:53 PM