భార్య, కుమారుడు ఇద్దరు పూజారుల హత్య.. నిందితుడిపై పోలీసుల ఎన్‌కౌంటర్
ABN , Publish Date - Sep 23 , 2026 | 09:09 AM
తన భార్య, ఇద్దరు పూజారులను కాల్చి చంపాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆ వ్యక్తి మృతిచెందాడు
ఇంటర్నెట్ డెస్క్: ఒక పూజ కారణంగా నాలుగు హత్యలు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిపై ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కాల్పులు జరిపారు. తన భార్య, ఇద్దరు పూజారులను యూపీలోని అజమ్‌గఢ్‌కు చెందిన అర్వింద్ సింగ్ అనే వ్యక్తి కాల్చి చంపినట్లు తెలుస్తోంది. తన కుమారుడిపై కూడా అతడు కాల్పులు జరిపాడని సమాచారం. కాగా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో అర్వింద్ సింగ్ మృతిచెందాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. అర్వింద్ సింగ్ కొంత కాలంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడు. అతడి ప్రవర్తనపై కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. దుష్టశక్తుల ప్రభావం కారణంగానే తన భర్త ఇలా ప్రవర్తిస్తున్నాడని విశ్వసించిన అర్వింద్ భార్య ఇద్దరు పూజారులుతో కలిసి నిన్న ( మంగళవారం) తమ ఇంట్లో ఓ పూజ మొదలుపెట్టింది. సాయంత్రం ఇంటికి వచ్చి జరుగుతున్న పూజను చూసిన అర్వింద్ ఆగ్రహించాడు. అక్కడ ఉన్న పూజారులను దూషించాడు. వారిని అలా దూషించవద్దని భార్య చెప్పినందుకు అతడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోపంలో తన లైసెన్స్ గన్ తీసుకుని భార్యను కాల్చి చంపాడు. ఆ తరువాత ఇద్దరు పూజారులనూ హత్య చేశాడు. ఆపై తన ముగ్గురు పిల్లలను ఒక గదిలోకి తీసుకువెళ్లి లాక్ చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లగా గది నుంచి హంతకుడు బయటకు రాలేదు. పిల్లలను అడ్డుపెట్టుకుని అర్వింద్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించాడు. ఉదయం వరకు తాను బయటకు రానని అతడు పోలీసులకు చెప్పాడు. ఆ ఇంటిని ముట్టడించిన పోలీసు బలగాలు దాదాపు 7 గంటల వరకు నిరీక్షించాయి. అప్పటికీ అర్వింద్ బయటకు రాలేదు. తరువాత అతడు పోలీసులపై కాల్పులు జరపడం ప్రారంభించాడు. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపగా అర్వింద్ గాయపడ్డాడు. అయితే పోలీసులపై గన్ ఫైరింగ్ చేస్తున్న సమయంలో అతడు తన కుమారుడిపై కూడా కాల్పులు జరిపాడు.
అర్వింద్‌తో సహా ముగ్గురు పిల్లలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న అర్వింద్, అతడి కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరు పిల్లలు ఆందోళనలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అర్వింద్ తన పిల్లలను రక్షణ కవచంగా చేసుకుని తప్పించుకోవాలనుకున్నాడని తెలిపారు.
ఈ వార్తలూ చదవండి
ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది..?
బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఇద్దరు ప్రధాన నిందితుల అరెస్టు