Share News

ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది..?

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:42 AM

ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్‌ వాకోడే (22) ఆత్మహత్య ఘటనలో ముంబై పోలీస్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ విభాగం రంగంలోకి దిగింది. పరీక్ష హాల్‌, హాస్టల్‌తోపాటు క్యాంప్‌సలోని పలు ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ఆత్మహత్యకు ముందు జరిగిన వరుస పరిణామాలను తెలుసుకోవడంపై దృష్టి పెట్టారు.

ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది..?
iit mumbai

  • ఐఐటీ బాంబే విద్యార్థి కేసులో ముమ్మరంగా దర్యాప్తు..

  • సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు

ముంబై, సెప్టెంబరు 22: ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్‌ వాకోడే (22) ఆత్మహత్య ఘటనలో ముంబై పోలీస్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ విభాగం రంగంలోకి దిగింది. పరీక్ష హాల్‌, హాస్టల్‌తోపాటు క్యాంప్‌సలోని పలు ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ఆత్మహత్యకు ముందు జరిగిన వరుస పరిణామాలను తెలుసుకోవడంపై దృష్టి పెట్టారు. బీటెక్‌ రెండో సంవత్సరం విద్యార్థి అయిన సాహిల్‌ వాకోడే గత శుక్రవారం సాయంత్రం హాస్టల్‌ గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకోవడం తెలిసిందే. ప్రొఫెసర్‌ సూర్యనారాయణ కుల వివక్ష చూపడం, మానసికంగా వేధించడం వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించడంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడం తెలిసిందే. కేసు తీవ్రత దృష్ట్యా దీన్ని సాధారణ పోలీసు విభాగం నుంచి క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. తమ కుమారుడి మరణానికి ప్రొఫెసర్‌ సూర్యనారాయణ, డైరెక్టర్‌ శిరీష్‌ కేదారే వేధింపులే కారణమని, వారిని అరెస్ట్‌ చేయాలని సాహిల్‌ తల్లిదండ్రులు మరోసారి డిమాండ్‌ చేశారు. అయితే.. సాహిల్‌ విద్యా సంస్థలోని ఎస్సీ/ఎస్టీ సెల్‌కు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఐఐటీ బాంబే ఫ్యాకల్టీ ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ రాజ్‌కుమార్‌ పంత్‌ తెలిపారు. మరోవైపు, ఐఐటీ బాంబే యాజమాన్యం హాస్టళ్ల గదుల్లో సీలింగ్‌ ఫ్యాన్లు తొలగించి, వాటి స్థానంలో వాల్‌ మౌంటెడ్‌ ఫ్యాన్లు (గోడకు అమర్చే) ఏర్పాటు చేయిస్తోంది.


ప్రొఫెసర్‌కు ఐఐటీ ఢీల్లీ ఫ్యాకల్టీ సైతం మద్దతు

ఐఐటీ బాంబే అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ డీన్‌ పదవి నుంచి తొలగింపునకు గురైన ప్రొఫెసర్‌ సూర్యనారాయణకు తాజాగా ఐఐటీ ఢిల్లీ బోధనా సిబ్బంది సైతం సంఘీభావం ప్రకటించారు. ఇన్విలేజటర్‌ విధుల్లో నిబంధనల ప్రకారం నడుచుకున్న ప్రొఫెసర్‌ను లక్ష్యంగా చేసుకోవడం సరికాదంటూ ఐఐటీ బాంబే ఫ్యాకల్టీ సోమవారం క్యాంప్‌సలో ర్యాలీ చేయగా, ఐఐటీ మద్రాస్‌ ఫ్యాకల్టీ సైతం మద్దతు ప్రకటించడం తెలిసిందే. ఇక మరీ ముఖ్యంగా ప్రొఫెసర్‌ సూర్యనారాయణకు తాము వ్యతిరేకం కాదని ఐఐటీ బాంబే విద్యార్థులు స్పష్టం చేశారు. ప్రొఫెసర్‌ తప్పు చేశారని తాము చెప్పడం లేదని.. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆయన్ను పరిపాలనా బాధ్యతల నుంచి తప్పించాలన్నదే తమ డిమాండ్‌ అని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడాన్ని కూడా వారు వ్యతిరేకించారు.

ఈ వార్తలను చదవండి

ఆ నోటీసులకు కారణం ఏంటి.. ఈసీకి సుప్రీం ప్రశ్న

యూపీఐ పేమెంట్స్‌పై కేంద్రం క్లారిటీ

Updated Date - Sep 23 , 2026 | 05:42 AM