యూపీలో బీజేపీ రాజ్యసభ ఎంపీలకు షాక్.. అభ్యర్థుల లిస్టులో లేని పేర్లు..
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:35 PM
ఉత్తర్‌ప్రదేశ్‌లో పది రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16న ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 8 స్థానాలకు గానూ బీజేపీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొన్ని రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు సమీపించిన వేళ కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరి, బి.ఎల్. వర్మలకు షాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ కోసం బీజేపీ అధిష్ఠానం విడుదల చేసిన జాబితాలో వీరి పేర్లు లేవు. అలాగే ఇప్పటికే ఆ స్థానాల్లో ఎంపీలుగా ఉన్న మిగిలిన వారినీ ఆ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించలేదు. అరుణ్ సింగ్, సీమా ద్వివేది, నీరజ్ శంకర్, బ్రిజ్ లాల్, గీతా శక్య ఆ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. వీరిని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. అక్కడ ఈ నెల 16న పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఎనిమిది స్థానాలు బీజేపీ, రెండు స్థానాలు సమాజ్‌వాది పార్టీ గెలిచే అవకాశాలున్నాయి.
ఈ సందర్భంగా 8 స్థానాలకు గానూ కాషాయ పార్టీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ధరంపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాశ్ పాల్, ప్రియాంక సింగ్ రావత్, గోపి కృష్ణా పాండే, రామ్ ప్రతాప్ సింగ్ చౌహన్, శృతి గంగ్వార్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. అయితే ఈ జాబితాను పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు.. బీజేపీ విభిన్న అభ్యర్థులను ఎంచుకోవాలని భావించిందని చెబుతున్నారు. వీరిలో ఇద్దరు ఓబీసీ అభ్యర్థులు, ఇద్దరు షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు ఉన్నారు. అలాగే ఇద్దరు అగ్ర వర్ణాల వారూ ఉన్నారు. జాబితాలో ఇద్దరు మహిళా అభ్యర్థులకు చోటు దక్కింది. 2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో బీజేపీ ఇప్పటి నుంచి రాజకీయ కసరత్తులు చేస్తోందని పలువురు పేర్కొంటున్నారు.
ఈ వార్తలూ చదవండి
అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..