కడప అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. గొడ్డలి పార్టీ అధినేతకు సీఎం చంద్రబాబు సవాల్
ABN , Publish Date - Oct 05 , 2026 | 01:01 PM
గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని.. ఈ విధ్వంసాన్ని సరిచేస్తామని ఎన్నికల ముందు చెప్పామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
కడప, అక్టోబర్ 5: గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని.. ఈ విధ్వంసాన్ని సరిచేస్తామని ఎన్నికల ముందు చెప్పామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు(సోమవారం) జిల్లాలో పర్యటించిన సీఎం, డిప్యూటీ సీఎం పవన్.. జల్‌జీవన్ మిషన్ 2.0-అమరజీవి జలధార పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ 3.0ను చేపట్టామన్నారు. మదనపల్లె హార్టికల్చర్ హబ్‌తో రాయలసీమ దశ-దిశ మారబోతోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. కర్మయోగి ద్వారా ప్రతి ఉద్యోగిలో నైపుణ్యం పెంచుతామని వెల్లడించారు. పాన్ IITద్వారా టెక్నాలజీని తదుపరి దశకు తీసుకెళ్తామని.. పాన్ IIT కౌన్సిల్ అమరావతిలో ఏర్పాటు కాబోతుందని తెలిపారు.
కడప అభివృద్ధిపై చర్చకు సిద్ధం అంటూ గొడ్డలి పార్టీ అధినేతకు ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. కేంద్రం నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు తీసుకుందని.. ఏపీ కంటే చిన్న రాష్ట్రం అసోం రూ.34వేల కోట్లు తీసుకుందని తెలిపారు. గతంలో ఉన్న ప్రభుత్వం కేవలం రూ.2,016 కోట్లు తీసుకుందని.. గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ అంటూ విరుచుకుపడ్డారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం తన కోరిక అని చెప్పుకొచ్చారు. కరవు సమయంలోనూ 2వేల టీఎంసీలు సముద్రం పాలయ్యాయన్నారు. నదుల అనుసంధానంతో 4 రాష్ట్రాలకు సాగునీటి కష్టాలు తొలగుతాయని తెలిపారు.
లిక్కర్ స్కాంలో అంతిమ లబ్ధిదారు గొడ్డలి పార్టీ అధినేత అని వేళ్లు చూపిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. సమాధానం చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. వాళ్లు నేరాలు చేసి ఎదుటివారిపై ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. కుట్రలే గొడ్డలి పార్టీ సిద్ధాంతమన్నారు. వివేకా హత్య కేసులో వాస్తవాలన్నీ బయటకు వచ్చాయన్నారు. వివేకా హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామని స్పష్టంచేశారు. గత ప్రభుత్వంలో గ్రూప్1లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ‘నేను 2019 సీఎంను కాదు.. 4.0 సీఎంని’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారంటూ వృద్ధుడికి బెదిరింపులు.. లక్షల్లో వసూలు
విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు శంకుస్థాపన.. 4 వేల మంది కళాకారులతో భారీ కార్నివాల్
Read Latest AP News And Telugu News