Share News

విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు శంకుస్థాపన.. 4 వేల మంది కళాకారులతో భారీ కార్నివాల్

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:50 PM

విజయవాడలోని సింగ్‌నగర్ స్టేడియంలో విజయవాడ ‌ఉత్సవ్ సీజన్ 2 పనులకు శంకుస్థాపన జరిగింది.

విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు శంకుస్థాపన.. 4 వేల మంది కళాకారులతో భారీ కార్నివాల్
Vijayawada Utsav,

విజయవాడ, అక్టోబర్ 5: సింగ్‌నగర్ స్టేడియంలో విజయవాడ ‌ఉత్సవ్ సీజన్ 2 పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా కుమారుడు బోండా సిద్ధార్థ, ఏపీ భవన నిర్మాణ కార్మికుల సలహా సంఘం చైర్మన్ గొట్టిముక్కల రఘు, ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ తేజస్విని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోండా సిద్దార్థ మాట్లాడుతూ.. విజయవాడ ఉత్సవ్ 2 సీజన్ ఈసారి అద్భుతంగా జరగనుందని తెలిపారు. భారత రాష్ట్రపతి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ఉత్సవాలకు రానున్నారని చెప్పారు. దుర్గమ్మ, కృష్ణమ్మ చెంత ఆధ్యాత్మికత, ఆహ్లాదంతో ప్రజలకు సరికొత్త అనుభూతిని అందిస్తాయన్నారు. పున్నమిఘాట్, ఎంబీకే స్టేడియంలో ప్రదర్శనలు ఆకట్టుకుంటాయని.. ప్రజలంతా తరలివచ్చి దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొనాలని సిద్ధార్థ కోరారు.


వైభవంగా ఉత్సవాల ఏర్పాటు: గొట్టిముక్కల రఘు

సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాల అంకురార్పణ జరిగిందని గొట్టిముక్కల రఘు తెలిపారు. మాకినేని బసవపున్నయ్య స్టేడియం, పున్నమి ఘాట్, సిద్ధార్థ ఫార్మా కాలేజీ, పవిత్ర సంగమం వద్ద వివిధ రకాల ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారని అన్నారు. ఎంపీ కేశినేని చిన్ని , బొండా ఉమామహేశ్వరరావు సారథ్యంలో ఈ ఉత్సవాలను వైభవంగా ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. స్థానిక కళాకారులతో పాటు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సాంస్కృతిక బృందాలను తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలు కళాకారులకు రాబోయే కొన్ని నెలల పాటు జీవనోపాధిగా ఉంటాయన్నారు. ఈసారి ఉత్సవాల్లో ప్రత్యేకంగా లేజర్ షోలు, డ్రోన్ షోలు, క్రాకర్ షోలు అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.


ఏలూరు రోడ్డులో భారీ కార్నివాల్: తేజశ్విని

విజయవాడ ఉత్సవ్ వేడుకలను పున్నమి ఘాట్‌తో పాటు, మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో కూడా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ తేజస్విని తెలిపారు. రాష్ట్రంలోని దాదాపు 40-45 రకాల జానపద, పరంపరాగత కళారూపాలు ఉంటాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులు, ప్రముఖ గాయకులు, భజన్ జ్యామింగ్ బృందాలు, లైవ్ బ్యాండ్స్, మ్యూజికల్ కాన్సెర్ట్‌లు ఇందులో భాగం కానున్నాయని చెప్పారు. విద్యార్థులు, యువత, మహిళలు, కుటుంబాల కోసం ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు వివిధ పోటీలు నిర్వహిస్తారన్నారు. 20వ తేదీన జరిగే ఆఖరి రోజున 3 గజరాజులు, అమ్మవారి 9 అవతారాల విగ్రహాలు, నాలుగు వేల మంది కళాకారులతో ఏలూరు రోడ్డులో భారీ కార్నివాల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ముగింపు వేడుక కార్నివాల్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారని తేజశ్విని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

పేట్ బషీరాబాద్‌లో వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి.. కేసు నమోదు

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారంటూ వృద్ధుడికి బెదిరింపులు.. లక్షల్లో వసూలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 12:50 PM