Share News

మోదీ కఠినమైన నాయకుడు.. ప్రధానిపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 17 , 2026 | 09:49 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. జీ7 వేదికగా జరిగిన భేటీలో మోదీని కఠినమైన నాయకుడని అభివర్ణిస్తూనే.. భారత్‌తో అమెరికాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.

మోదీ కఠినమైన నాయకుడు.. ప్రధానిపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
PM Modi A Total Killer, A Tough Trader says Trump

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. ఈ ద్వైపాక్షిక సమావేశంలో మోదీపై ట్రంప్‌ ప్రశంసల జల్లు కురిపించారు. మోదీని అత్యంత కఠినమైన సంధానకర్తగా అభివర్ణించిన ట్రంప్‌.. ఆయనపై తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. భారత్‌కు అమెరికా మంచి మిత్రదేశమని, మోదీ నాయకత్వంలో భారత్‌కు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.


'మోదీ పైకి ఎంతో సౌమ్యంగా కనిపిస్తారు. కానీ చర్చల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ప్రపంచంలో అలాంటి నాయకులు చాలా అరుదు. భారత ప్రజల పట్ల ఆయనకు అపారమైన ప్రేమ ఉంది. అదే సమయంలో అమెరికాతోనూ మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు' అని ట్రంప్ చెప్పారు. భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలోపేతమం అవుతాయని హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యం మరింత వేగంగా విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికాలో భారతీయ పెట్టుబడులు పెరుగుతున్నాయన్న ఆయన.. దీనిని తాము స్వాగతిస్తున్నామన్నారు.


భారత్‌పై ఎవరైనా దాడిచేస్తే సాయానికి అమెరికా ముందుంటుందని ఈ సందర్భంగా ట్రంప్‌ స్పష్టం చేశారు. 'భారత్‌తో మా సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి. మోదీ నాయకత్వంలో ఆ దేశానికి ఎలాంటి ముప్పు వచ్చినా మేము అండగా ఉంటాం' అని వ్యాఖ్యానించారు.


మోదీ ఏమన్నారంటే?

ఇదే వేదికపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం దిశగా కొత్త ఆశలు చిగురిస్తున్నాయన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హోర్ముజ్‌ జలసంధి స్వేచ్ఛాయుత రవాణా అత్యంత కీలకమన్న మోదీ.. దీనిపై భారత్‌, అమెరికా కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని సూచించారు. భారత్‌-అమెరికా సంబంధాలు కొత్త ఊపు సంతరించుకున్నాయని పేర్కొన్నారు మోదీ. ఇరుదేశాల పరస్పర సహకారంతో వ్యూహాత్మక, ఆర్థిక, భద్రతా రంగాల్లో మరింత ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 17 , 2026 | 10:10 PM