ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:19 PM
పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ మద్దతుతో భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్ర గూఢచారుల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. భారత సైన్యం కదలికలపై నిఘా, ఓటీపీ-సిమ్ రాకెట్, సున్నిత సమాచారం పాక్‌కు చేరవేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ గూఢచారి సంస్థ అయిన ఐఎస్ఐ మద్దతుతో భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ ఉగ్రముఠాను ఛేదించారు ఢిల్లీ పోలీసులు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేయగా.. వారిలో ఆరుగురు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
గాజియాబాద్‌లో అరెస్టైన ఆరుగురిలో నలుగురు గతంలో పుల్వామా ప్రాంతాన్ని సందర్శించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు పంపినట్లు అనుమానిస్తున్నారు. పుల్వామా తరహాలో మరో పెద్ద దాడికి పాక్ ప్లాన్ చేస్తోందనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ ముఠా ఢిల్లీ నుంచి జమ్మూ వరకు గల ప్రముఖ రైల్వే స్టేషన్ల వద్ద సోలార్ సంబంధిత సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసి భారత సైనికుల కదలికలను గుర్తించేందుకు యత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే వీరు ఢిల్లీలోని కాంట్, హరియాణాలోని సోనిపట్ రైల్వే స్టేషన్ల వద్ద అలాంటి కెమెరాలను అమర్చినట్టు గుర్తించారు.
ఈ దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. భారతీయ ఫోన్ నంబర్లకు వచ్చే ఓటీపీలను విదేశీయులకు పంపిస్తూ వాట్సాప్, సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహించుకునేందుకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు రూ.500 నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. సిమ్ కార్డుల చోరీ, గతంలోనే యాక్టివేట్ చేసిన సిమ్‌లను కొనుగోలు చేయడం వంటివి వినియోగించినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలనూ తమ సొంత అకౌంట్ల ద్వారా కాకుండా జనసేవా కేంద్రాలు, స్థానిక దుకాణాల ద్వారా నగదు రూపంలో స్వీకరించి పోలీసుల కళ్లుగప్పేందుకు యత్నించినట్టు అధికారులు తేల్చారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయంపైనా విచారణ కొనసాగుతోందని, దేశ భద్రతకు ముప్పుగా మారే ఇలాంటి నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి:
'బాస్' పేరిట వాట్సాప్ మోసం.. రూ.10.4 కోట్లకు పైగా బురిడీ
టెలిగ్రామ్‌పై నిషేధం.. కేంద్రంపై రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ విమర్శలు..