Share News

'బాస్' పేరిట వాట్సాప్ మోసం.. రూ.10.4 కోట్లకు పైగా బురిడీ

ABN , Publish Date - Jun 17 , 2026 | 03:44 PM

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ అధికమవుతూనే ఉన్నాయి. సరికొత్త దారులను ఎంచుకుంటూ కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. కేటుగాళ్లు పన్నిన వాట్సాప్ వలకు ఓ ఉద్యోగి తన సంస్థకు ఏకంగా రూ.10 కోట్లకుపైగా నష్టాన్ని మిగిల్చాడు. అసలేం జరిగిందంటే.?

'బాస్' పేరిట వాట్సాప్ మోసం.. రూ.10.4 కోట్లకు పైగా బురిడీ
INOX Group WhatsApp Scam

ఇంటర్నెట్ డెస్క్: ఓ వాట్సాప్ సందేశాన్ని నమ్మిన సంస్థ ఉద్యోగి చేసిన పొరపాటు ఆ కంపెనీకి రూ.10.4 కోట్లకుపైగా నష్టాన్ని మిగిల్చింది. ఐనాక్స్ గ్రూప్‌నకు చెందిన ఓ ఉన్నతాధికారి పేరుతో గుర్తుతెలియని వ్యక్తి పంపిన సందేశాల ఆధారంగా కంపెనీ ఖాతా నుంచి మొత్తం 63 విడతల్లో భారీ మొత్తాన్ని బదిలీ చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నలుగురు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు.


ముంబైకి చెందిన ఐనాక్స్ గ్రూప్స్ అకౌంట్స్ విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న గిరీశ్ అమీన్‌కు జూన్ 3న ఓ గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను ఐనాక్స్ గ్రూప్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) సిద్ధార్థ్ జైన్‌నని పరిచయం చేసుకున్నాడు. ఆ నంబర్‌ను తన పర్సనల్ నంబర్‌గా సేవ్ చేసుకోమని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నాడు. వాట్సాప్ డీపీలోనూ సిద్ధార్థ్ జైన్ ఫొటో ఉండటంతో అమీన్‌కూ ఎలాంటి అనుమానం రాలేదు. ఆ తర్వాత తానో ఎమర్జెన్సీ మీటింగ్‌లో ఉన్నానని చెబుతూ.. వివరాలేమీ అడక్కుండా కొన్ని బ్యాంక్ అకౌంట్స్ నంబర్స్ పంపించి కంపెనీ ఖాతా నుంచి నగదు పంపమని ఆదేశించాడు.


తొలుత రూ.46.5 లక్షల బదిలీతో ప్రారంభమైన ఈ వ్యవహారం జూన్ 3 నుంచి 15 వరకు కొనసాగింది. ఇలా మొత్తం 63 ట్రాన్సాక్షన్స్ ద్వారా మొత్తం రూ.10,40,71,924 నగదు పలు ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ అయింది. ఆ తర్వాత సదరు చెల్లింపులకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లు కావాలని అధికారికంగా సిద్ధార్థ్ జైన్‌ను సంప్రదించాడు అమీన్. తానెలాంటి ఆదేశాలివ్వలేదని సిద్ధార్థ్ చెప్పడంతో అసలు విషయం బయటపడింది. దీంతో అమీన్ పోలీసులను ఆశ్రయించాడు.


దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు.. ఢిల్లీలోని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ జసోలా బ్రాంచ్ నుంచి కీలక సమాచారం అందుకున్నారు. అనుమానాస్పదంగా రూ.8 లక్షలు నగదు విత్‌డ్రా చేసుకునేందుకు వచ్చిన వికాస్, వంశ్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇరువురి బ్యాంకు అకౌంట్లను మోసపూరిత లావాదేవీలు జరిపేందుకు కమీషన్‌ కోసం ఇచ్చినట్లు విచారణలో తేలింది. దీంతో ఫయ్యాజ్ ఆలమ్, అమిత్ అనే మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే.. ఈ మోసం వెనుకున్న అసలు సూత్రధారులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.


ఇవీ చదవండి:

భారత్‌కు షాకిచ్చిన అమెరికా.. మ్యాప్ మార్చేసి.. ఇండో పేరు తొలగించి..

FSSAI కొత్త రూల్స్.. తుప్పు పట్టిన కత్తులు వాడితే చర్యలు

Updated Date - Jun 17 , 2026 | 03:52 PM