Share News

చీలిక దిశగా సమాజ్‌వాదీ పార్టీ.. బాంబు పేల్చిన యూపీ మంత్రి

ABN , Publish Date - Jun 17 , 2026 | 03:04 PM

పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో రాజకీయ పునరేకీకరణలు, ఫిరాయింపులు పర్యంపై చర్చ జరుగుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ మంత్రి, సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ బాంబు పేల్చారు. యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ త్వరలో చీలిపోనుందని చెప్పారు.

చీలిక దిశగా సమాజ్‌వాదీ పార్టీ.. బాంబు పేల్చిన యూపీ మంత్రి
Akhilesh Yadav and OP Rajbhar

లక్నో: పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో రాజకీయ పునరేకీకరణలు, ఫిరాయింపుల పర్యంపై చర్చ జరుగుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ మంత్రి, సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SPBP) చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ బాంబు పేల్చారు. యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ త్వరలో చీలిపోనుందని చెప్పారు. 'మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ను మరిచిపోండి. సమాజ్‌వాదీ పార్టీ మొత్తం బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉంది' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన తెలిపారు.


'సమాజ్‌వాదీ పార్టీ చీలిపోనుంది. రామ్‌ గోపాల్ యాదవ్ ఒక లేఖను కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు అందజేశారు. గనుల కుంభకోణం, గోమతి రివర్ ఫ్రంట్ కుంభకోణం వెనుకనున్న సూత్రధారులు ఎవరో యూపీలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఉచ్చు బిగుస్తున్న కొద్దీ సమాజ్‌వాదీ పార్టీ ఆందోళనకు గురవుతోంది' అని రాజ్‌భర్ తెలిపారు. ఇక మహారాష్ట్ర, బెంగాల్‌ను మరిచిపోవచ్చని, సమాజ్‌వాదీ పార్టీ మొత్తం బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 2027లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార కూటమి, విపక్ష కూటమి తమ వ్యూహాలకు పదునుపెడుతున్న తరుణంలో రాజ్‌భర్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


సమాజ్‌వాదీ పార్టీ స్పందన

కాగా, తమ పార్టీ త్వరలో చీలిపోనుందంటూ రాజ్‌భర్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ మండిపడింది. తమ పార్టీని చూసి బీజేపీ, భాగస్వామ్య పార్టీలు బెంబేలెత్తుతున్నాయని, రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు రాజ్‌భర్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని పేర్కొంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలాన్ని సమాజ్‌వాద్ పార్టీ సగానికి సగం తగ్గించేసిందని, 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని ఆ పార్టీ ప్రతినిధి సునీల్ సాజన్ అన్నారు. ఎస్‌బీసీపీ నుంచి ఈసారి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవరని అన్నారు. కేవలం ప్రచారం కోసమే రాజ్‌భర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.


గతంలోనూ రాజ్‌భర్ వివాదాస్పద వ్యాఖ్యలు

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని గతంలోనూ రాజ్‌భర్ విమర్శలు చేశారు. అఖిలేష్ యాదవ్ విదేశీ పర్యటనలపై సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో రాజ్‌భర్ ఇటీవల విమర్శలు చేశారు. లండన్, పారిస్ పర్యటనలకు బదులు కాశీ, అయోధ్య, మధుర, నైమిశారణ్యం, వింధ్యావాసిని ఆలయం వంటి ప్రదేశాల్లో ఆయన పర్యటించి ఉంటే ఉత్తరప్రదేశ్ పర్యాటకానికి, స్థానిక వ్యాపారులు, దుకాణాలు, రవాణారంగంతో ముడిపడిన ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.


ఇవి కూడా చదవండి..

భారత్‌కు షాకిచ్చిన అమెరికా.. మ్యాప్ మార్చేసి.. ఇండో పేరు తొలగించి..

బెంగాల్ బ్లాక్‌బస్టర్ షో.. అన్‌సంగ్ హీరో మిథున్ చక్రవర్తి

Updated Date - Jun 17 , 2026 | 03:31 PM