సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 17 , 2026 | 06:17 PM
సైబర్ నేరగాళ్లపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వారు అమాయక ప్రజలను మోసంచేసి కోట్ల రూపాయలు కాజేసే పరాన్నజీవులని పేర్కొంది. ఇలాంటి వారిపై మరింత కఠినతర చట్టాలు అమలు చేయాలని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: సైబర్ నేరస్థులు అమాయక ప్రజలను మోసంచేసి కోట్లాది రూపాయలు కాజేసే పరాన్నజీవులని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఓ సైబర్ ఫ్రాడ్ కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరించి, సదరు పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా.. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సైబర్ నేరాలపై పెరుగుతున్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలను ఆకర్షించి భారీ లాభాలొస్తాయని నమ్మబలికి వారిని మోసగించే వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమంది. 'మీరు పరాన్నజీవులు.. పెట్టుబడిదారుల నుంచి డబ్బు తీసుకుని మోసం చేస్తున్నారు. మీలాంటి వారు జైల్లో ఉండటమే సమాజానికి శ్రేయస్కరం. సైబర్ నేరస్థుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి నేరాలు ఎప్పుడూ పాన్ ఇండియా స్థాయిలో జరుగుతూ ఉంటాయి. గుజరాత్‌లో ఒకరు, ఆ తర్వాత ముంబై మరొకరి నుంచి.. ఇలా అందరి నుంచి డబ్బులు వసూలు చేస్తారు' అని ధర్మాసనం పేర్కొంది.
ఈ సందర్భంగా కోర్టుకు అందించిన వివరాలను ప్రస్తాస్తూ.. గతేడాది చివరి నాటికి దేశంలో డిజిటల్ మోసాల కారణంగా రూ.3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు పేర్కొంది న్యాయస్థానం. సైబర్ నేరాల తీవ్రతను ఇది విస్పష్టంగా తెలియజేస్తోందని వ్యాఖ్యానించింది.
కాగా.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) గణాంకాల ప్రకారం.. 2021 నుంచి 2023 మధ్య సుమారు 63 శాతం సైబర్ మోసాలు పెరగడంతో కేసుల సంఖ్య 86 వేల మార్కును దాటింది. వీటిలో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా.. తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇవీ చదవండి:
ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్
'బాస్' పేరిట వాట్సాప్ మోసం.. రూ.10.4 కోట్లకు పైగా బురిడీ