Share News

ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌న్యూస్.. ఆ డిపాజిట్లపై వడ్డీ పరిమితుల ఎత్తివేత

ABN , Publish Date - Jun 17 , 2026 | 09:24 PM

దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక ముందడుగు వేసింది. ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్ల వడ్డీ రేట్ల పరిమితులను తాత్కాలికంగా ఎత్తివేస్తూ బ్యాంకులకు మరింత స్వేచ్ఛ కల్పించింది.

ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌న్యూస్.. ఆ డిపాజిట్లపై వడ్డీ పరిమితుల ఎత్తివేత
RBI Removes Interest Rate Caps On FCNR And NRE Deposits

ఇంటర్నెటె డెస్క్: దేశంలో విదేశీ పెట్టుబడులను మరింత ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ బ్యాంక్(FCNR-B డిపాజిట్లు, నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్(NRE) డిపాజిట్లపై అమలులో ఉన్న వడ్డీ రేటు పరిమితులను తాత్కాలికంగా ఎత్తివేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుందని తెలిపిన ఆర్‌బీఐ.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు కొనసాగనుందని స్పష్టం చేసింది.


ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం.. మూడేళ్లు, ఐదేళ్ల కాలపరిమితి గల కొత్త ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) డిపాజిట్లపై బ్యాంకులు తమకు అనుకూలంగా వడ్డీ రేట్లు నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే.. అదే తరహా ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్లకు, వాటి పునరుద్ధరణలకూ ఇదే వెసులుబాటు వర్తించనుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇటీవల ఆర్‌బీఐ ప్రకటించిన చర్యల్లో ఇదొకటి. కొత్తగా వచ్చే మూడు, ఐదేళ్ల ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) డిపాజిట్లకు హెడ్జింగ్‌ సౌకర్యం, ప్రభుత్వ రంగ సంస్థలు సమీకరించే విదేశీ వాణిజ్య రుణాలకు(ఈసీబీలు) ప్రత్యేక స్వాప్‌ విండో వంటి చర్యలతోపాటు ఈ నిర్ణయం తీసుకుంది.


అయితే.. స్వల్పకాలిక డిపాజిట్లకు మాత్రం ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలనే యథాతథంగా కొనసాగించింది ఆర్‌బీఐ. ఏడాది నుంచి మూడేళ్ల లోపు కాలపరిమితి కలిగిన ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) డిపాజిట్లపై బ్యాంకులు రిఫరెన్స్‌ రేటుకు గరిష్ఠంగా 250 బేసిస్‌ పాయింట్లు అదనంగా వడ్డీ ఇచ్చే అవకాశం కల్పించింది. గతంలో 3 నుంచి 5 సంవత్సరాల డిపాజిట్లకు 350 బేసిస్‌ పాయింట్ల పరిమితి ఉండగా.. తాజాగా దానిని తొలగించింది. ఇక ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌వో డిపాజిట్లపై వడ్డీ రేట్లు, సాధారణ దేశీయ రూపాయి టర్మ్‌ డిపాజిట్లపై బ్యాంకులు అందించే రేట్లను మించకూడదన్న నిబంధన కొనసాగుతుందని కూడా ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అయితే.. ఈ ప్రత్యేక సడలింపులు వర్తించే సందర్భాల్లో మినహాయింపు ఉంటుంది. ఆర్‌బీఐ తాజా చర్యలతో ఎన్‌ఆర్‌ఐలు, ఇతర విదేశీ పెట్టుబడిదారులకు భారతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు మరింత ఆకర్షణీయం కానున్నాయి. విదేశీ మారక నిల్వలను బలోపేతం చేయడంలోనూ ఈ చర్య కీలకంగా మారుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.


ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 17 , 2026 | 09:36 PM