మహిళపై సామూహిక అత్యాచారం.. ప్రియుడి భార్య సూచనలతోనే..!
ABN , Publish Date - Oct 01 , 2026 | 04:30 PM
తన భర్తతో మరో మహిళ ఉండడాన్ని తట్టుకోలేక ఓ వివాహిత దారుణానికి ఒడిగట్టింది. ఆమెపై అత్యాచారం చేయించేందుకు ఓ గ్యాంగ్‌ను పురమాయించింది.
ఇంటర్నెట్ డెస్క్: తన భర్తతో మరో మహిళ ఉండడాన్ని తట్టుకోలేక ఓ వివాహిత దారుణానికి ఒడిగట్టింది. ఆమెపై అత్యాచారం చేయించేందుకు ఓ గ్యాంగ్‌ను పురమాయించింది. కేరళంలో గత నెల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కేరళంలోని త్రిస్సూర్‌కు వెళ్లింది. అక్కడ ఇద్దరూ సిటీ బస్టాండ్ వద్ద ఉన్న ఓ లాడ్జ్‌లో ఏకాంతంగా గడిపారు. అయితే కొంతసేపటి తరువాత ఐదుగురు వ్యక్తులు పోలీస్ దుస్తులతో వచ్చి వీరిని బెదిరించారు. ఆ తరువాత వీరిద్దరి కాళ్లు, చేతులు కట్టేసి.. తమిళనాడుకు తీసుకువెళ్లేందుకు బలవంతంగా కారులో ఎక్కించారు. దారిలో ప్రియుడిపై నకిలీ పోలీసులు దారుణంగా దాడికి పాల్పడ్డారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని గంటల అనంతరం అతణ్ని ఓ ఆసుపత్రి ముందు దించేసి వెళ్లిపోయారు.
కానీ.. ఆ మహిళను మాత్రం వదల్లేదు. మరోచోటకు తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తరువాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రియుడి భార్యే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. తన భర్త మరో మహిళతో ఉండడాన్ని తట్టుకోలేక ఆమె ఇలా చేయించిందని దర్యాప్తులో తేలింది. భర్త ప్రియురాలిపై అత్యాచారం చేయాలని భార్యే ఓ గ్యాంగ్‌కు సూచించిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెతో పాటు మరో నలుగురు నిందితులనూ అరెస్ట్ చేశారు పోలీసులు.
ఈ వార్తలూ చదవండి
40 ఏళ్ల క్రితం నీరజా భానోత్.. నేడు స్మిత్ మచ్చార్.. సేమ్ సీన్ రిపీట్.. కానీ..
బకాయిలు చెల్లించక పోతే... ఎమ్మెల్యేల కమీషన్ల దందా బయటపెడతాం