విజయ్ జన నాయగన్ చిత్రం లీక్.. ఆందోళనలో మూవీ యూనిట్
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:40 AM
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ సినిమా కెరీర్‌లో ఆఖరి చిత్రంగా భావిస్తున్న ‘జన నాయగన్’ చుట్టూ ఇప్పుడు పెను దుమారం నడుస్తోంది. ఈ సినిమా అధికారికంగా విడుదల కాకముందే, పైరసీ వెబ్‌సైట్లలో హై డెఫినిషన్ క్వాలిటీలో లీక్ కావడం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) సినిమా కెరీర్‌లో ఆఖరి చిత్రంగా భావిస్తున్న ‘జన నాయగన్’ (Jana Nayagan) చుట్టూ పెను దుమారం నడుస్తోంది. ఈ సినిమా అధికారికంగా విడుదల కాకముందే, పైరసీ వెబ్‌సైట్లలో హై డెఫినిషన్ (HD) క్వాలిటీలో లీక్ కావడం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
లీక్ సంచలనం.. విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో..
రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించే ముందు విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం కావడంతో ‘జన నాయగన్’పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. కొన్ని నెలలుగా సెన్సార్ వివాదాలు, కోర్టు కేసులతో నలుగుతున్న ఈ సినిమా ఇప్పుడు పైరసీ కోరల్లో చిక్కుకోవడం చిత్ర యూనిట్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది.
ఈ చిత్రంలో ఉన్న రాజకీయ అంశాల కారణంగా సెన్సార్ బోర్డు(CBFC) సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం చేసింది. ఈ విషయంపై చిత్ర యూనిట్ కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే.. శుక్రవారం(ఏప్రిల్ 10) ఉదయం కొన్ని పైరసీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ ఛానళ్లలో ఈ సినిమా పూర్తి హెచ్‌డీ ప్రింట్ ప్రత్యక్షమైనట్లు సమాచారం. పూర్తి సినిమా రాకముందే.. విజయ్ మాస్ ఇంట్రడక్షన్ సీన్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్న క్లిప్స్, సినిమా క్లైమాక్స్ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి.
కుట్ర కోణంపై అనుమానాలు.?
విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం(TVK) రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ లీక్ వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. దాదాపు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా లీక్ అవ్వడం వల్ల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశముంది. ఈ మూవీ ఇంకా సెన్సార్ ల్యాబ్‌లో లేదా రివైజింగ్ కమిటీ వద్ద ఉన్నప్పుడే ఎలా లీక్ అయిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అభిమానుల ఆగ్రహం.. పోలీసుల చర్యలు
విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో #StopPiracy, #SaveJanaNayagan వంటి హ్యాష్ ట్యాగ్‌లతో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ వెంటనే అప్రమత్తమై సోషల్ మీడియాలోని లింకులను తొలగించే ప్రయత్నం చేస్తోంది. సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో సినిమాను వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకురావడమే ఏకైక మార్గమని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఒక స్టార్ హీరో ఆఖరి సినిమాకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం అత్యంత బాధాకరమని పలువురు చెబుతున్నారు. ఈ లీక్ మూలాలను వెతికి దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. లేదంటే ఇది భవిష్యత్తులో మరిన్ని భారీ చిత్రాలకు శాపంగా మారే అవకాశం ఉందని తెలిపారు. పైరసీని ప్రోత్సహించవద్దని, సినిమాను థియేటర్లలోనే చూడాలని.. ఓ సినిమా వెనుక వేలాది మంది కష్టం ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని జన నాయగన్ మూవీ యూనిట్ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
‘మావిగన్ జోకర్’గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు
మీడియాపై దాడులకు పాల్పడటం సరికాదు: వెంకయ్య నాయుడు
పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా జగన్‌ను ప్రజలు నమ్మరు: బుద్దా వెంకన్న
Read Latest AP News And Telangana News And International News And Telugu News