Share News

సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మత మార్పిడితో రిజర్వేషన్ వర్తించదని స్పష్టం

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:21 PM

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు మరోసారి సంచలన తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా మత మార్పిడి ప్రాతిపదికగా రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించేందుకు కృత్రిమ మార్గాలను సృష్టించడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయపడింది.

సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మత మార్పిడితో రిజర్వేషన్ వర్తించదని స్పష్టం
Supreme Court

ఇంటర్నెట్ డెస్క్: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు మరోసారి సంచలన తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా మత మార్పిడి ప్రాతిపదికగా రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించేందుకు కృత్రిమ మార్గాలను సృష్టించడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయపడింది. మతం మారినంత మాత్రాన.. రిజర్వేషన్లు, వెనుకబడిన వర్గాల హోదా వంటి ప్రయోజనాలు ఆటోమేటిగ్గా పొందలేరని పేర్కొంది. ఈ మేరకు మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.


ఏమిటీ వివాదం?

తమిళనాడులో హిందూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఇస్లాం మతంలోకి మారినవారికి బీసీ ముస్లిం కేటగిరీలో కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తూ 2024 మార్చిలో ఉత్తర్వులు జారీచేసింది. మతం మారినంత మాత్రాన గతంలో పొందుతున్న రిజర్వేషన్ ప్రయోజనాలను కోల్పోకూడదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే.. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది.


కాగా.. 2015లో హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన సమీర్‌ అహ్మద్‌ అనే వ్యక్తి.. తనను ముస్లిం లబ్బాయిస్ వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తిస్తూ కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక తహసీల్దార్‌ అప్లికేషన్‌ను రిజెక్ట్ చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల చట్టబద్ధతపై వివాదం రాజుకుంది. ప్రభుత్వం నోటిఫై చేసిన 7 బీసీ ముస్లిం సామాజిక వర్గాల్లో.. కేవలం మత మార్పిడితోనే సభ్యత్వం లభించదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆయా వర్గాల్లో జన్మతః ఆధారంగా సమాజ గుర్తింపు కీలకమని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. అక్కడా ఊరట దక్కలేదు.


ఇవీ చదవండి:

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. భారత్ విడిచి వెళ్లాలని ఆదేశం.?

ముస్కాన్‌కు మరణశిక్ష.. పిల్లల భవితవ్యంపై సౌరభ్ కుటుంబం స్పందనిదే.?

Updated Date - Oct 15 , 2026 | 12:26 PM