ప్రధానిపై ప్రశంసలు.. మమతకు విధేయత!
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:36 PM
టీఎంసీ తిరుగుబాటు ఎంపీల జాబితాలో తన పేరుందన్న వార్తలను శత్రుఘ్న సిన్హా ఖండించారు. తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తాను తిరుగుబాటు చేయబోనని ఆయన స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటుడు శత్రుఘ్న సిన్హా స్పందించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని వీడబోనని ప్రకటించారు.
ప్రధానిగా మోదీ పన్నెండేళ్ల పాలన పూర్తిచేసుకుని అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా మోదీకి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు సిన్హా. 'మన మిత్రుడు, దేశానికి మార్గదర్శకుడు అయిన ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు' అని పోస్ట్ చేస్తూ, దానిని మమతకూ ట్యాగ్ చేశారు. ఈ నేపథ్యంలో టీఎంసీ అసంతృప్త నేతల్లో ఆయనా ఒకరనే ప్రచారం జోరందుకుంది. అయితే.. ఆ వార్తలను పూర్తిగా ఖండించారు సిన్హా. తాను ఎలాంటి తిరుగుబాటు వర్గంలో లేనని, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే ఆలోచన కూడా తనకు లేదని స్పష్టం చేశారు.
'నా రాజకీయ జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మమతా బెనర్జీ నాకు అండగా నిలిచారు. ఆమె కష్టకాలంలో నేనూ ఆమె వెంటే ఉంటాను. దీదీని ఎప్పటికీ వదిలిపెట్టను' అని సిన్హా పేర్కొన్నారు. ఆసన్సోల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని నాడు మమత చెప్పడంతోనే తాను ఎన్నికల బరిలోకి దిగానని ఆయన తెలిపారు. టీఎంసీపై తనకు పూర్తి నమ్మకముందన్న ఆయన.. ఆ పార్టీతోనే తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు.
కాగా.. శత్రుఘ్న సిన్హా రాజకీయ ప్రస్థానం బీజేపీతో ప్రారంభమైంది. కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన ఆయన.. సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా కమలం పార్టీకి రాజీనామా చేశారు. 2019లో కాంగ్రెస్ తరఫున పాట్నా సాహిబ్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2022లో టీఎంసీలో చేరి ఆసన్సోల్ ఉపఎన్నికలో విజయం సాధించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి గెలుపొందారు.
ఇవీ చదవండి:
కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం.! క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్
మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..