పీవీ సింధుకు కోచ్‌గా మారిన భర్త వెంకట దత్త సాయి
ABN , Publish Date - Jun 11 , 2026 | 03:45 PM
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భర్త వెంకట దత్త సాయి కాసేపు కోచ్‌గా మారారు. వృత్తిరీత్యా డేటా సైంటిస్ట్ అయిన ఆయన సింధు కోసం కొద్దిసేపు కోచ్‌గా మారారు. అంతేకాక కోచ్‌గా తన భార్యకు మనోధైర్యం కల్పించారు.
స్పోర్ట్స్ డెస్క్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భర్త వెంకట దత్తసాయి అనుకోకుండా కోచ్‌గా మారారు. వృత్తిరీత్యా ఆయన డేటా సైంటిస్ట్. కానీ, సింధు కోసం కాసేపు కోచ్‌గా మారి తన భార్యకు మద్దతుగా నిలిచాడు. ఇదే విషయాన్ని పీవీ సింధు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో తనకు ఎదురైన అనుభవాన్ని సింధు వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...
ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో పీవీ సింధు మరో భారత షట్లర్ ఇషారాణి బారువాపై 22-20, 21-12 తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని సింధు తెలియజేసింది. ‘నాకు ఉదయం నుంచి ఒంట్లో అంతగా బాగోలేదు. అలాంటి సమయంలో మనోధైర్యం అవసరం అనిపించింది. నాకు తెలిసిన వారితో గొప్ప ఎనలిస్ట్‌ను పిలిచాను. మా ఇద్దరికి ఒకరే కోచ్ కావడంతో.. నేను కోచ్‌ను పిలిచి ఇషాను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. దీంతో నా భర్త దత్తసాయికి ప్రమోషన్ ఇచ్చి.. ఆయనను కోచ్‌గా పరిచయం చేశాను' అని సింధు పోస్టులో రాసుకొచ్చింది.
'నిజం చెప్పాలంటే.. నాకు ఈ కోచ్ వద్దు బాబోయ్ అనేంతగా బాగా ప్రోత్సహించారు. అయితే, రిఫరీ నుంచి రెండు హెచ్చరికలు అందుకొన్నా. కార్డు లేకుండానే ఎలాగోలా దీన్నుంచి బయటపడ్డాం. రెండో గేమ్ ప్రారంభమయ్యే సరికి ఇషాను సరిగ్గా అంచనా వేయగలిగాను. భర్త క్రీడాభిమాని అయితే..ఇలాంటి అత్యవసర సమయాల్లో సాయపడుతుంది’ అని పీవీ సింధు పోస్టు పెట్టింది. ఆమె చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఇషారాణి బారువాను ఓడించడానికి పీవీ సింధుకు 42 నిమిషాలు పట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన మొదటి సెట్‌ను అతి కష్టం మీద గెలుచుకుంది. రెండవ గేమ్‌లో బరువాను తిరిగి పుంజుకోనివ్వకుండా చివరకు విజయం సాధించింది. ఈ ఏడాది సింధుకు ఇది ఐదో క్వార్టర్ ఫైనల్.
ఇవి కూడా చదవండి:
అదరగొట్టిన భారత బ్యాటర్లు.. అఫ్గాన్ ముందు భారీ టార్గెట్
విదేశీ గడ్డపై వైభవ్ మెరుపు ఇన్నింగ్స్.. హాఫ్ సెంచరీ మిస్