విదేశీ గడ్డపై వైభవ్ మెరుపు ఇన్నింగ్స్.. హాఫ్ సెంచరీ మిస్
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:21 PM
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ అఫ్గానిస్థాన్- ఏ జట్టుతో భారత్-ఏ టీమ్ తలపడుతోంది. ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారించిన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ .. ఈ మ్యాచ్‌లో కూడా దుమ్ములేపాడు.
స్పోర్ట్స్ డెస్క్: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ(శుక్రవారం)దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్- ఏ జట్టుతో భారత్ తలడుతోంది. ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారించిన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో కూడా దుమ్ములేపాడు. శ్రీలంక-ఎతో జరిగిన తొలి మ్యాచ్‌లో విఫలమైన వైభవ్(14 పరుగులు).. రెండో మ్యాచ్‌లో తనదైన శైలిలో వీరవిహారం చేశాడు. అఫ్గాన్ బౌలర్లకు ఈ చిచ్చర పిడుగు చుక్కలు చూపించాడు.
ఈ 15 ఏళ్ల బిహారీ కుర్రాడు ఇన్నింగ్స్ రెండో బంతి నుంచే బౌండరీలు బాదడం ప్రారంభించాడు. ముఖ్యంగా అఫ్గాన్ పేసర్ మహమ్మద్ ఇబ్రహీంను వైభవ్ టార్గెట్ చేసి మరి.. బౌండరీలు కొట్టాడు. ఈ క్రమంలో వైభవ్ కేవలం 22 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆరు పరుగుల దూరంలోత్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 7.1 ఓవర్లలో అబ్దుల్లా అహ్మద్జాయ్ బౌలింగ్‌లో వైభవ్ ర్యాంప్ షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు.
ఐపీఎల్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. అలాంటి దూకుడైన ఆటగాడి నుంచి ఇప్పుడు అఫ్గాన్‌పై ఒక్క సిక్స్ రాకపోవడం విశేషం. తన 44 పరుగుల్లో 36 పరుగులు కేవలం ఫోర్ల రూపంలోనే వచ్చాయి. పరిస్థితులకు తగ్గట్టుగానే ఆడగలనని తన ఇన్నింగ్స్ ద్వారా చాటిచెప్పాడు. మరికొద్ది రోజుల్లో జాతీయ జట్టుకు ఆడనున్న క్రమంలో పరిణితి ప్రదర్శించడం అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఇవి కూడా చదవండి:
డబ్బు కంటే గౌరవమే ముఖ్యం: వైభవ్ తండ్రి సంజీవ్