ఇక అంతా గోల్ గోల
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:50 AM
ఉత్కంఠ పోరు.. ఉప్పొంగే ఉత్సాహం.. అంతులేని ఆనందాలు.. లిప్తపాటులో తలకిందులయ్యే ఫలితాలు.. అంతలోనే నిర్వేదాలు.. హోరాహోరీ పోరాటాలతో ప్రపంచ మొత్తాన్ని ఓ ఆటాడుకొనే ఫుట్‌బాల్...
ఆరంభ వేడుకలు
రాత్రి 10.30 నుంచి
(డీడీ స్పోర్ట్స్, జీ నెట్‌వర్క్‌లో..)
నేటి మ్యాచ్
మెక్సికో X దక్షిణాఫ్రికా
(అర్ధరాత్రి 12.30)
శుక్రవారం (ఉ. 7.30)
కొరియా X చెక్ రిపబ్లిక్
నేటి నుంచే సాకర్ సంగ్రామం
39 రోజులు..
48 జట్లు..
12 గ్రూప్‌లు..
104 మ్యాచ్‌లు
అమెరికా, మెక్సికో, కెనడా ఆతిథ్యం
ఉత్కంఠ పోరు.. ఉప్పొంగే ఉత్సాహం.. అంతులేని ఆనందాలు.. లిప్తపాటులో తలకిందులయ్యే ఫలితాలు.. అంతలోనే నిర్వేదాలు.. హోరాహోరీ పోరాటాలతో ప్రపంచ మొత్తాన్ని ఓ ఆటాడుకొనే ఫుట్‌బాల్ మహా సంగ్రామం.. ఫిఫా వరల్డ్‌కప్ నేడు ఆరంభం కానుంది. ఇక, సాకర్ ఫీవర్‌తో ప్రపంచాన్ని ఊపేయనుంది.
వరల్డ్‌క్‌పల్లో జంబో ఈవెంట్‌గా..
అమెరికా, కెనడా, మెక్సికో మూడు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ముచ్చటైన ఈ టోర్నీ.. సరికొత్త చరిత్రను సృష్టించనుంది. 39 రోజులు.. 48 జట్లు.. 12 గ్రూప్‌లు.. 104 మ్యాచ్‌లు.. 1248 మంది ప్లేయర్లు.. ఇలా గత టోర్నీ కంటే సుదీర్ఘంగా 23వ ప్రపంచకప్ జరగనుంది.
డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా టైటిల్ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉండగా.. మాజీ విజేతలు ఫ్రాన్స్, స్పెయిన్, బ్రెజిల్, జర్మనీ కప్పు అందుకోవాలన్న ఉత్సాహంతో ఉన్నాయి. ఆరోసారి బరిలోకి దిగుతున్న అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోల విన్యాసాలు చూసేందుకు ఇదే చివరి అవకాశం కానుం డడంతో.. ఈసారి అభిమానుల కళ్లన్నీ ఈ ఇద్దరిపైనే.
మెక్సికో సిటీ: యావత్ ప్రపంచానికి ఫుట్‌బాల్ కిక్కెక్కించే మెగా ఫుట్‌బాల్ సమరం.. 23వ ఫిఫా వరల్డ్‌క్‌పనకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీ గురువారం అర్ధరాత్రి ఆరంభం కానుంది. 39 రోజులపాటు.. 104 మ్యాచ్‌లతో అభిమానులను అలరించే టోర్నీ.. వచ్చే నెల 19న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. టీమ్‌ల సంఖ్య పెరగడంతో.. మరిన్ని నాకౌట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. 2022లో కతార్‌లో జరిగిన టోర్నీలో విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగనుంది. ఈ టీమ్ కెప్టెన్ మెస్సీ మరోసారి జట్టుకు టైటిల్ అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కూడా టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. ఫ్రాన్స్ స్టార్ ఎంబాపే, స్పెయిన్ యువ కెరటం లామినె యామల్, లెనార్ట్ కర్ల్ వంటి యువ ఆటగాళ్లు విశ్వవేదికపై తమ ఆగమనాన్ని ఘనంగా చాటడానికి ఉవ్విళ్లూరుతున్నారు.
‘యాజ్టెకా’లో మూడోసారి.. మెక్సికో సిటీలోని చారిత్రక యాజ్టెకా స్టేడియం మూడోసారి వరల్డ్‌కప్ ప్రారంభ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన వేదికగా చరిత్ర సృష్టించనుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో గ్రూప్-ఎలో ఆతిథ్య మెక్సికోతో దక్షిణాఫ్రికా తలపడనుంది. 1966లో ఆరంభమైన యాజ్టెకా స్టేడియం లాటిన్ అమెరికాలోనే అతిపెద్దది. సీటింగ్ సామర్థ్యం సుమారు 87,500. 1970 ప్రపంచకప్ టైటిల్‌ను పీలే అందుకొన్నది ఇక్కడే. ఇక, సాకర్ మాంత్రికుడు మారడోనా కూడా 1986 ఫైనల్లో జర్మనీని ఓడించి అర్జెంటీనాను విజేతగా నిలిపాడు. అంతేకాకుండా క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌పై మారడోనా ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ నమోదైంది కూడా ఇక్కడే కావడం విశేషం. ఇక, ఫైనల్ మ్యాచ్‌కు న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియం వేదిక కానుంది.
మూడు దేశాల్లోనూ వేడుకలు..: ఆరంభ వేడుకల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మూడు దేశాల్లో తొలి మ్యాచ్‌లు జరిగే ముందు ప్రత్యేకంగా ఆరంభోత్సవాలను నిర్వహించనున్నారు. మెక్సికోలో జరిగే కార్యక్రమంలో ప్రముఖ పాప్ సింగర్ షకీరా, బర్న బాయ్‌లు వరల్డ్‌కప్ అధికార గీతం ‘డై డై’కు ఆడిపాడనున్నారు. మెక్సికో బ్యాండ్ మనా ప్రదర్శనతోపాటు.. అంతర్జాతీయ సింగర్లు అల్జెరో ఫెర్నాండెజ్, జె బాల్విన్, బెలిండా, డానీ ఓషన్, లైలా డౌన్స్, టైలా అలరించనున్నారు.
మెస్సీ X రొనాల్డో పోరు సాధ్యమా?
ఆధునిక సాకర్ దిగ్గజాలు మెస్సీ, రొనాల్డోలు ఆరోసారి టోర్నీ బరిలోకి దిగనున్నారు. 38 ఏళ్ల మెస్సీ అర్జెంటీనాకు.. 41 ఏళ్ల రొనాల్డో పోర్చుగల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిద్దరికీ ఇదే చివరి వరల్డ్‌కప్ కాబట్టి ఒకరితో ఒకరు తలపడితే.. ఆ మజాను ఆస్వాదించాలని అభిమానులు కోరుకొంటున్నారు. అయితే, ఇది సాధ్యం కావాలంటే అర్జెంటీనా గ్రూప్-జె టాపర్‌గా, పోర్చుగల్ గ్రూప్-కె టాపర్‌గా నిలవడంతోపాటు.. రౌండ్-32, రౌండ్-16 నాకౌట్ మ్యాచ్‌ల్లో గెలిస్తే.. క్వార్టర్స్‌లో మెస్సీ, రొనాల్డో సమరాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది.

అమెరికాలో 78 మ్యాచ్‌లు..
మొత్తం 16 నగరాలు వరల్డ్‌క్‌పనకు ఆతిథ్యం ఇస్తున్నాయి. అమెరికాలో 78 మ్యాచ్‌లు.. కెనడా, మెక్సిలో 13 చొప్పున జరగనున్నాయి.
టోర్నీ ఫార్మాట్ ఇలా..
తాజా టోర్నీలో జట్ల సంఖ్యను 32 నుంచి 48కి పెంచారు. ఆఫ్రికా దేశమైన కేప్ వెర్డె, డచ్ కరీబియన్ ఐలాండ్ దేశం కురకావో, జోర్డాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలు తొలిసారి అర్హత సాధించాయి. 48 జట్లను 12 గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు మూడేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన రెండు జట్లతోపాటు మూడోస్థానంలో నిలిచిన 8 మెరుగైన జట్లు నాకౌట్ రౌండ్-32కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత రౌండ్-16, క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ ఇలా రెగ్యులర్ ఫార్మాట్‌లో టోర్నీ సాగుతుంది. చాంపియన్‌గా నిలిచే జట్టు టోర్నీలో 8 మ్యాచ్‌లు నెగ్గాల్సి ఉంటుంది.
మొత్తం ప్రైజ్‌మనీ రూ. 6,242 కోట్లు
విజేతకు రూ. 476 కోట్లు
రన్నరప్‌నకు రూ. 314 కోట్లు
మూడోస్థానానికి రూ. 276 కోట్లు
నాలుగో స్థానానికి రూ. 257 కోట్లు
చిన్నోడు.. పెద్దోడు
మెక్సికో వండర్ కిడ్ గిల్బెర్డో మోరా (17 ఏళ్లు) టోర్నీలో పాల్గొంటున్న పిన్న వయస్కుడు. స్కాట్లాండ్ గోల్‌కీపర్ క్రెయిగ్ గోర్డాన్ (43 ఏళ్లు) పెద్ద వయస్కుడు కాగా.. రొనాల్డో (41), మెక్సికో కీపర్ గుల్మెరో ఓచో (40), క్రొయేషియా స్టార్ లూకా మోద్రిచ్ (40) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
భూటియా, అదితి వ్యాఖ్యానం
భారత్‌లో వరల్డ్‌కప్ ప్రసార హక్కులను జీ టీవీ సొంతం చేసుకొంది. యునైటెడ్8 స్పోర్ట్స్, జీ5లో మ్యాచ్‌లను వీక్షించవచ్చు. కవరేజ్ ప్యానెల్ సభ్యులుగా భారత మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా, మాజీ కోచ్ ఇగోర్ స్టిమాక్, అదితి చౌహాన్ వ్యవహరించనున్నారు.
గ్రూప్-ఎ
మెక్సికో
కొరియా
దక్షిణాఫ్రికా
చెక్ రిపబ్లిక్
గ్రూప్-బి
స్విట్జర్లాండ్
కతార్
కెనడా
బోస్నియా
గ్రూప్-సి
బ్రెజిల్ మొరాకో
స్కాట్లాండ్
హైతీ
గ్రూప్-డి
అమెరికా
టర్కీ
ఆస్ట్రేలియా
పరాగ్వే
గ్రూప్-ఇ
జర్మనీ
ఈక్వెడార్
ఐవరీకోస్ట్
కురకావో
గ్రూప్-ఎఫ్
నెదర్లాండ్స్ జపాన్
స్వీడన్
ట్యునీషియా
గ్రూప్-జి
బెల్జియం
ఇరాన్
ఈజిప్టు
న్యూజిలాండ్
గ్రూప్-హెచ్
స్పెయిన్
ఉరుగ్వే
సౌదీ అరేబియా
కేప్ వెర్డె
గ్రూప్-ఐ
ఫ్రాన్స్
సెనెగల్
నార్వే
ఇరాక్
గ్రూప్-జె
అర్జెంటీనా
అల్జీరియా
ఆస్ట్రియా
జోర్డాన్
గ్రూప్-కె
పోర్చుగల్
కొలంబియా
కాంగో
ఉజ్బెకిస్థాన్
గ్రూప్-ఎల్
ఇంగ్లండ్ క్రొయేషియా
పనామా
ఘనా
ఈ వార్తలు కూడా చదవండి...
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి
కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News