Share News

బెన్ స్టోక్స్ రిటైర్‌మెంట్ నిర్ణయం తీసుకోవద్దు: ఇంగ్లండ్ మాజీ ప్లేయర్

ABN , Publish Date - Jun 11 , 2026 | 11:48 AM

లండన్ నైట్‌క్లబ్‌లో జరిగిన గొడవ కారణంగా బెన్ స్టోక్స్‌పై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించి, న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టుకు సీనియర్ బ్యాటర్ జో రూట్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది.

బెన్ స్టోక్స్ రిటైర్‌మెంట్ నిర్ణయం తీసుకోవద్దు: ఇంగ్లండ్ మాజీ ప్లేయర్
Ben Stokes

స్పోర్ట్స్ డెస్క్: మద్యం మత్తులో నైట్‌ క్లబ్‌లో ఓ రగ్బీ ఆటగాడితో గొడవపడిన నేపథ్యంలో బెన్ స్టోక్స్‌పై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) క్రమశిక్షణా చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. జూన్‌ 17 నుంచి 21 మధ్య ఓవెల్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో టెస్ట్‌కు దూరం కానున్నాడు. అతడి స్థానంలో సీనియర్‌ బ్యాటర్‌ జోరూట్ ఇంగ్లండ్‌ తాత్కాలిక కెప్టెన్‌గా ఈసీబీ నియమించింది. మరోవైపు స్టోక్స్ రెండో టెస్టుకు మాత్రమే దూరమైనప్పటికీ, అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టోక్స్‌కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ కీలక సూచనలు ఇచ్చాడు.


భావోద్వేగపరంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండే ఈ సమయంలో రిటైర్మెంట్ లాంటి నిర్ణయం తీసుకోవద్దని నాసర్ హుస్సేన్ స్టోక్స్‌కు సూచించాడు. ఓ స్పోర్ట్స్ పాడ్‌కాస్ట్‌లో హుస్సేన్ మాట్లాడుతూ.. 'బెన్ స్టోక్స్ ఇంగ్లండ్‌కు చాలా కాలం పాటు అండగా నిలిచాడు. అతడు కెప్టెన్‌గా, ఆటగాడిగా కీలక టోర్నీల్లో జట్టుకు తోడుగా ఉన్నాడు. అతడు ఇంగ్లండ్ కోసం ఒక యోధుడిలా పోరాడాడు. కానీ ఈసారి ఓ తప్పు చేశాడు. అయితే అది అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించే అంత పెద్ద తప్పిందం అని నేను అనుకోవడం లేదు' అని వెల్లడించాడు.


'ప్రస్తుతం బెన్ చాలా బాధలో ఉంటాడు. తాను చాలా మందిని నిరాశపర్చినట్లు భావించి.. భావోద్వేగంతో రిటైర్మెంట్ తీసుకోవాలని బెన్ అనుకోకూడదని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే, అలా చేస్తే ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్‌గా ఉన్న అతడి కెరీర్‌కు అది చాలా విచారకరమైన ముగింపు అవుతుంది. అతడు గొప్ప గౌరవంతో క్రికెట్ నుంచి వీడ్కొలు పలకాలని నేను భావిస్తున్నారు' అని నాసర్ హుస్సేన్ తెలిపాడు. రిటైర్మెంట్ విషయంపై తుది నిర్ణయం పూర్తిగా స్టోక్స్ చేతుల్లోనే ఉన్నప్పటికీ, అతడు కొందరి అభిప్రాయాలను కోరుతున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఒక ఇంగ్లండ్ దిగ్గజం ఈ విధంగా నిష్క్రమించడాన్ని హుస్సేన్ ఇష్టపడటం లేదు.


ఇవి కూడా చదవండి:

డబ్బు కంటే గౌరవమే ముఖ్యం: వైభవ్‌ తండ్రి సంజీవ్‌

ఇక అంతా గోల్ గోల

Updated Date - Jun 11 , 2026 | 12:00 PM