Share News

పవార్‌కు మోదీ ఫోన్‌.. ప్రఫుల్‌ పటేల్‌ భేటీ.. మారనున్న 'మహా' రాజకీయాలు?

ABN , Publish Date - Nov 06 , 2026 | 09:01 PM

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరద్ పవార్‌ను ప్రధాని మోదీ ఫోన్‌లో పరామర్శించగా, ప్రఫుల్ పటేల్ స్వయంగా కలిశారు. ఈ పరిణామాలతో మహారాష్ట్రలో ఎన్సీపీ రెండు వర్గాల విలీనం, శరద్ పవార్ వర్గం ఎన్డీయేలో చేరికపై రాజకీయ చర్చ మొదలైంది.

పవార్‌కు మోదీ ఫోన్‌.. ప్రఫుల్‌ పటేల్‌ భేటీ.. మారనున్న 'మహా' రాజకీయాలు?

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం చర్చంతా ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ చుట్టూనే తిరుగుతోంది. ఓవైపు ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినా.. మరోవైపు ఆ రాష్ట్ర రాజకీయ చదరంగంలో ఆయన అడుగులు కొనసాగుతున్నాయి. ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 85 ఏళ్ల పవార్‌తో ప్రత్యర్థి వర్గానికి చెందిన ప్రఫుల్‌ పటేల్‌ భేటీ అయ్యారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఫోన్‌ చేసి ఆయన్ను పరామర్శించడంతో ఎన్సీపీ రెండు వర్గాల విలీనంపై ఊహాగానాలకు తెరలేపినట్టైంది.


2023లో శరద్‌ పవార్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పార్టీని చీల్చిన అజిత్‌ పవార్‌ వర్గం.. ఎన్‌సీపీ పేరు, ఎన్నికల గుర్తును దక్కించుకుంది. ప్రస్తుతం ఆ వర్గానికి సునేత్రా పవార్‌ నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు మళ్లీ ఒక్కటవుతాయా? లేక శరద్‌ పవార్‌ వర్గం నేరుగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరుతుందా? అనే విషయమై సందిగ్ధత నెలకొంది.


అధికారమే వ్యూహమా?

సుమారు 60 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు శరద్ పవార్. 1999లో సోనియా గాంధీ విదేశీ మూలాలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి ఎన్‌సీపీని స్థాపించిన పవార్.. అదే ఏడాది ఎన్నికల అనంతరం తిరిగి కాంగ్రెస్‌తో చేతులు కలిపి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2004లోనూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2014లో బీజేపీకి మద్దతు ప్రకటించి మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2019లో శివసేన, కాంగ్రెస్‌తో కలిసి మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలకపాత్ర పోషించారు పవార్. ఈ పరిణామాలు పవార్‌ రాజకీయ వ్యూహాలపై మరోసారి చర్చకు దారితీస్తున్నాయి.


సూలే నిర్ణయమే కీలకమా?

ఎన్‌సీపీ రెండు వర్గాల విలీనంపై గతంలో పవార్‌ సానుకూల సంకేతాలు ఇచ్చినప్పటికీ.. తుది నిర్ణయం మాత్రం తదుపరి తరం నేతలదేనని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆయన కుమార్తె సుప్రియా సూలే పాత్ర మరింత కీలకం కానుంది. మరోవైపు.. అజిత్‌ పవార్‌ వర్గంలోనూ నాయకత్వం, అంతర్గత అసంతృప్తిపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. శరద్‌ పవార్‌ వర్గం ఎన్డీయేలో చేరినా, రెండు ఎన్‌సీపీలు విలీనమై అధికార కూటమిలో భాగమైనా మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్‌, శివసేన(యూబీటీ), ఎన్‌సీపీ(ఎస్పీ)తో కూడిన మహావికాస్‌ అఘాడీ బలహీనపడుతుంది. అంతేకాకుండా.. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిపైనా ప్రభావం చూపే అవకాశముంది.


ఇవీ చదవండి:

'దీపావళి వేడుకల్లో బాధ్యత అవసరం'.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కర్ణాటక బీజేపీ వినూత్న నిరసన.. ఏఐ వీడియోతో కాంగ్రెస్‌పై విమర్శలు!

Updated Date - Nov 06 , 2026 | 09:09 PM