Share News

'దీపావళి వేడుకల్లో బాధ్యత అవసరం'.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:33 PM

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ వాయు కాలుష్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఆంక్షలు, ఆదేశాలతోనే సమస్య పరిష్కారం కాదని, ప్రజల ప్రవర్తనలో మార్పు రావాలని పేర్కొంది. పంట వ్యర్థాల దహనం, ప్రైవేట్ వాహనాల కాలుష్యంపైనా దృష్టి సారించింది.

'దీపావళి వేడుకల్లో బాధ్యత అవసరం'.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court comments on Delhi pollution

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆంక్షలు విధించడం, ఆదేశాలు జారీ చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేసింది. ప్రజల్లో అవగాహన, ప్రవర్తనలో మార్పు రావాలని అభిప్రాయపడింది. దీపావళి వంటి పండుగలను పర్యావరణానికి హాని కలగకుండా సంప్రదాయబద్ధంగా, బాధ్యతాయుతంగా నిర్వహించుకోవాలని సూచించింది.


ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ కాలుష్యంపై విచారణ సందర్భంగా.. సీజేఐ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విచారణ ప్రారంభంలోనే.. 'ఢిల్లీలోని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారని ఆశిస్తున్నాం' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. పండుగల సందర్భంగా అసలు సంప్రదాయాలకు తిరిగి ఎందుకు వెళ్లకూడదని సీజేఐ ప్రశ్నించగా.. వేడుకల వాణిజ్యీకరణ కూడా కాలుష్యానికి కారణమవుతోందని జస్టిస్‌ జోయ్ మల్యా బాగ్చీ అభిప్రాయపడ్డారు.


'పేదల్ని బాధ్యుల్ని చేయడం సరికాదు'

కాలుష్యానికి పేదలను బాధ్యులుగా చేయడం సరికాదని ఈ సందర్భంగా సీజేఐ పేర్కొన్నారు. పేదలు కాలుష్యాన్ని సృష్టించేవారు కాదని, దానివల్ల ఎక్కువగా నష్టపోయేది వారేనని వ్యాఖ్యానించారు. సంపన్నులు వినియోగించే ప్రైవేట్ వాహనాలు, విలాసవంతమైన కార్లు కూడా కాలుష్యానికి కారణమవుతున్నాయని గుర్తుచేసింది ధర్మాసనం. రవాణా రంగమే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో కాలుష్యానికి ప్రధాన కారణమని అమికస్‌ క్యూరీ అపరాజితా సింగ్‌ వివరించారు.


ఇక.. పంట వ్యర్థాల దహనం(పరాలీ) నివారణకు వాటి కొనుగోలు ధరను ముందుగానే ప్రకటించాలని, గ్రామ పంచాయతీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సుప్రీంకోర్టు సూచించింది. పంట వ్యర్థాల దహనం ఢిల్లీ కాలుష్యంలో 14 శాతం వాటా కలిగి ఉందని అమికస్‌ క్యూరీ పేర్కొన్నారు. వాహనాల పొగ సహా చెత్తను అంటించడం వంటి స్థానిక కాలుష్య కారకాలపైనా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు.. బీఎస్‌-6 ప్రమాణాలులేని వాహనాల ప్రవేశంపై ఆంక్షలు, డీజిల్‌ ఆటోలను దశలవారీగా తొలగించడం, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం వంటి చర్యలు చేపడుతున్నట్లు కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి ధర్మాసనానికి వివరించారు.


అయితే.. ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) 400కు చేరుతోందని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వ చర్యలు సహా ప్రజల బాధ్యతాయుత ప్రవర్తన కూడా అత్యవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది.


ఇవీ చదవండి:

తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో షాక్.. దీపావళి బెయిల్ పిటిషన్ తిరస్కరణ

వేములవాడలో అమానుషం.. బతికుండగానే శ్మశానానికి తరలింపు

Updated Date - Nov 06 , 2026 | 07:18 PM