ట్రాఫిక్ కష్టాలకు చెక్.. లక్డీకాపూల్‌లో వన్‌వే దిశగా అడుగులు.!
ABN , Publish Date - Nov 06 , 2026 | 07:17 PM
హైదరాబాద్ లక్డీకాపూల్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీసులు కొత్త వన్‌వే విధానాన్ని ప్రతిపాదిస్తున్నారు. సీపీ వీసీ సజ్జనార్ బైక్‌పై పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. తొలుత ప్రయోగాత్మకంగా అమలు చేసి ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు.
హైదరాబాద్, నవంబర్ 06 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలోని ప్రధాన రహదారుల్లో ఒకటైన లక్డీకాపూల్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు పోలీసులు కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో కొత్తగా వన్‌వే విధానాన్ని అమలుచేసే సాధ్యాసాధ్యాలపై కసరత్తులు ముమ్మరం చేస్తున్నారు. హైదరాబాద్ సీపీ వీసీ.సజ్జనార్ స్వయంగా బైక్‌పై తిరిగి ఆ ఏరియాలోని ట్రాఫిక్ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నగరంలోని ద్వారకా హోటల్, రవీంద్ర భారతి, ఇక్బాల్ మినార్, హెచ్‌డీఎఫ్‌సీ జంక్షన్, పాత సైఫాబాద్ పోలీస్‌స్టేషన్, ఓల్డ్ కంట్రోల్ రూమ్ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను సీపీ పరిశీలించారు. ట్రాఫిక్ సమయాల్లో వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులతో ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్, డీసీపీ అవినాశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మారనున్న దారులు
ప్రతిపాదిత విధానం ప్రకారం.. రవీంద్ర భారతి నుంచి ఇక్బాల్ మినార్ వైపు వెళ్లే వాహనాలను హెచ్‌డీఎఫ్‌సీ జంక్షన్, పాత సైఫాబాద్ పోలీస్‌స్టేషన్, ఇక్బాల్ మినార్, సచివాలయం జంక్షన్ మీదుగా మళ్లించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. నిరంకారీ జంక్షన్ నుంచి ఓల్డ్ కంట్రోల్ రూమ్ వెళ్లే వాహనాలకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ప్రతిపాదించారు. సచివాలయం, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలకూ ప్రత్యేక మార్గాలను పరిశీలిస్తున్నారు. అయితే.. ఈ ప్రతిపాదనలపై జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ అధికారులతో త్వరలోనే సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా వన్‌వే విధానాన్ని అమలు చేసి, ఫలితాలను పరిశీలించిన అనంతరం శాశ్వత నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు.. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ప్రస్తుతం ఉన్న వన్‌వే మార్గానికి అదనంగా మరో ట్రాఫిక్ లేన్ ఏర్పాటు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇందుకు అడ్డంకిగా ఉన్న భూగర్భ పైపులైన్లు, విద్యుత్ స్తంభాలను సంబంధిత శాఖల సమన్వయంతో తరలించనున్నారు. నగరంలోని ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ ఇలాంటి ట్రాఫిక్ మార్పులపై పోలీసులు దృష్టి సారించారు. వాహనదారులకు ఇబ్బందులు తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేసేలా సమగ్ర ట్రాఫిక్ నిర్వహణకు చర్యలు చేపడుతున్నారు.
ఇవీ చదవండి:
తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో షాక్.. దీపావళి బెయిల్ పిటిషన్ తిరస్కరణ
కర్ణాటక బీజేపీ వినూత్న నిరసన.. ఏఐ వీడియోతో కాంగ్రెస్‌పై విమర్శలు!